TG | ప్రజలకు ఆహార భద్రత కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్ నగర్: అణగారిన,బడుగు,బలహీన వర్గాల దళిత,గిరిజన,బి.సి మైనారిటీ ప్రజలకు ఆహార భద్రత కల్పించాలి అన్నదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.అందులో భాగంగానే రాష్ట్రంలోని 85 శాతానికి పై చిలుకు నిరుపేదలందరికి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.

యావత్ భారత దేశంలో నే ఈ తరహా ప్రయోగం చేపట్టడం తెలంగాణా రాష్ట్రంలోనే మొట్ట మొదటని ఆయన తేల్చిచెప్పారు. ఉగాది పర్వదినం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సాయంత్రం సూర్యాపేట జిల్లా హుజుర్నగర్ లో ప్రారంభించారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,శాసనసభాపతి ప్రసాద్ రావు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,దుద్దిళ్ల శ్రీదర్ బాబు,అనసూయ సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి,కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతీ లతో పాటుప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి,పౌర సరఫరాలశాఖా కార్యదర్శి డి.ఎస్.చౌహన్ పలువురు శాసనసభ్యులు,లోకసభ సభ్యులు,శాసనమండలి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గతంలో 10,665 కోట్లు ఖర్చు పెట్టి దొడ్డు బియ్యం పంపిణీ చేసినా సంకల్పం నెరవేరలేదన్నారు.. పైగా దొడ్డు బియ్యం దారి తప్పి కోళ్ల ఫారాలకు,బీర్ల కంపెనీ లకు చేరాయన్నారు.బి.ఆర్.ఎస్ పాలకులు ఎటువంటి మార్పుకు ప్రయత్నం చేయలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పరిస్థితిని లోతుగా అధ్యయనం చేసిన మీదట దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న నిరుపేలందరికీ సన్న బియ్యం పంపిణీ చేయాలన్న విప్లవాత్మకమైన మార్పుకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.

తెల్ల రేషన్ కార్డుల మంజూరీ విషయంలో కుడా బి.ఆర్.ఎస్ పాలకులు ఉదాసీనంగా వ్యహరించారని ఆయన విమర్శించారు.కేవలం ఉప ఎన్నికల సమయంలో మాత్రమే బి.ఆర్.ఎస్ పాలకులకు తెల్ల రేషన్ కార్డులు గుర్తుకు వచ్చేవన్నారు. దీనిని గమనించిన కాంగ్రెస్ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుల మంజూరికి నిర్ణయం తీసుకుందన్నారు తద్వారా 30 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు.ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం 2.85 కోట్ల మంది లబ్ధిదారులు ఉండగా ప్రస్తుతం వచ్చిన దరఖాస్తుల ప్రకారం ఆ సంఖ్య 3.10 కోట్లకు చేరనుందన్నారు.

ఉచితంగా సన్నబియ్యం పంపిణీతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మకమైన ఘట్టంతో రాష్ట్ర వ్యాప్తంగా 85 శాతం అంటే 3.10 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుందన్నారు. అటువంటి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఇక్కడి నుండి ప్రారంభించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని ఆయన అభివర్ణించారు

హుజుర్నగర్,కోదాడ నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి కంచు కోటలని అందుకు ఇక్కడి కాంగ్రెస్ కార్యకర్తలు చిందించిన స్వేదం,వారి త్యాగాల ఫలితమే నన్నారు.అందుకే లోకసభ ఎన్నికలలో ఒకే ఒక నియోజకవర్గం నుండి లక్ష ఓట్ల మెజారిటీ దాటించి దేశ చరిత్రలోనే రికార్డు సృష్టించిన చరిత్ర వెనుక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply