తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈరోజు హైదరాబాద్‌లో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, రాష్ట్రంలో జరుగుతున్న పలు కీలక అంశాలపై చర్చిస్తూ… రాష్ట్ర అభివృద్ధి, తమ ప్రభుత్వ పనితీరు, ముఖ్యమంత్రి సూచనలు, ప్రతిపక్షాల విమర్శలపై స్పష్టతనిచ్చారు.
ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ భట్టి, బీఆర్‌ఎస్ నేతల వ్యాఖ్యలు మితిమీరి పోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని, ప్రజల్లోకి కూడా వెళ్లడం లేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లో చురుకుగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
తమ ప్రభుత్వం కర్ణాటక తరహా పవర్ షేరింగ్ చేయదని, టీమ్ వర్క్ ఆధారంగా పనిచేస్తుందని తెలిపారు. రుణమాఫీ విషయంపై మాట్లాడుతూ, రూ.2 లక్షలు దాటిన వారికి రుణమాఫీ చేయకూడదన్నది ప్రభుత్వ విధాన నిర్ణయమని, రేషన్ కార్డు ఆధారంగానే కుటుంబంలో రుణమాఫీ జరుగుతుందని పునరుద్ఘాటించారు.
సంక్షేమ పథకాలు సక్సెస్..
సంక్షేమ పథకాలు విజయవంతమవుతున్నాయని భట్టి తెలిపారు. సన్నబియ్యం పథకం విజయవంతమైందని, గతంలో మాదిరిగా రేషన్ బియ్యం పక్కదారి పట్టడం లేదని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. మహిళల కోసం చేపట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు పథకానికి మంచి స్పందన వస్తుందని హర్షం వ్యక్తం చేస్తూ, మరో మూడు వేల బస్సులు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని వివరించారు.
పట్టణభివృద్ధి ప్రాజెక్టులు..
పట్టణాభివృద్ధిలో భాగంగా ఫోర్త్ సిటీ, మూసీ సుందరీకరణ, గాంధీ ఘాట్, రీజినల్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులు వేగంగా జరుగుతున్నాయన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చే అవకాశం లేదని ధీమాగా చెప్పారు.
ఫోర్త్ సిటీ పనులు వేగంగా జరుగుతున్నాయని, మూసీ సుందరీకరణ తమ ప్రభుత్వం హయాంలో పూర్తవుతుందని స్పష్టం చేశారు. గాంధీ ఘాట్ వరకు సుందరీకరణ జరుగుతుందని, అందుకు సంబంధించి అన్ని పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు కూడా వస్తుందని తెలిపారు.
ఇటీవల పాశమైలారంలోని పారిశ్రామికవాడలో చోటుచేసుకున్న సిగాచి సంస్థ ప్రమాదంపై ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి పని తీరు పట్ల ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ సంతృప్తి వ్యక్తం చేశారని భట్టి విక్రమార్క తెలిపారు.