కరీంనగర్ ఆంధ్రప్రభ: కాంగ్రెస్ పార్టీ నేతలకు కరప్షన్ అనే వైరస్ సోకిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఏ శాఖలో చూసిన అవినీతి తాండవిస్తుందని, కాంగ్రెస్ నాయకులందరూ కరప్షన్ కు అలవాటు పడిపోయారన్నారు. త్వరలో అవినీతిపై బిజెపి యుద్ధం చేయబోతుందన్నారు.
ఈ ఏడాది దొంగతనాలు ఎక్కువవుతాయని, ప్రజాప్రతినిధులు, అధికారులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడతారని, కొత్త వ్యాధి ప్రబలుతుందని కూడా జ్యోతిష్య పండితులు చెబుతున్నారన్నారు. కాంగ్రెస్ పాలనను గమనిస్తే జ్యోతిష్య పండితులు చెప్పేది నిజమే అనిపిస్తుందన్నారు.
కాంట్రాక్టుల దగ్గర నుండి పెండింగ్ బిల్లుల వరకు ప్రతి దాంట్లోనూ కమీషన్లు ఇవ్వనిదే పనిచేయడం లేదన్నారు.కాంగ్రెస్ కరప్షన్ వైరస్ మూలంగా అన్ని వర్గాల ప్రజలు బాధలు పడుతున్నారన్నారు.బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో పింక్ వైరస్ సోకి తెలంగాణ ప్రజలు నష్టపోయారని, బీజేపీ చేసిన పోరాటాలవల్ల పింక్ వైరస్ పీడ విరిగిందన్నారు. కాంగ్రెస్ బారినుండి బీజేపీ ప్రజలను కాపాడుకుంటామన్నారు. పోరాటాలనే వ్యాక్సిన్ గా కాంగ్రెస్ అవినీతిపై యుద్దం చేయబోతున్నామన్నారు.
*సన్నబియ్యం పంపిణీని స్వాగతిస్తున్నాం*
రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామన్నారు.అయితే బియ్యం ఖర్చంతా కేంద్రమే భరిస్తోందన్నారు.ఒక్కో కిలోకు 40 రూపాయలు మోదీ సర్కారే చెల్లిస్తోందన్నారు.సన్న బియ్యంవల్ల రాష్ట్ర ప్రభుత్వంపై కిలోకు పడే భారం కేవలం 10 రూపాయలు మాత్రమే అన్నారు.రాష్ట్ర సర్కార్ చేసే ఖర్చు కంటే మూడు రెట్లు అదనంగా మోదీ ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. వెంటనే రేషన్ షాపులతోపాటు అంతటా ప్రధాని ఫోటోలు కూడా పెట్టాల్సిందే అన్నారు.
*ఫోన్ ట్యాపింగ్ కేసును నీరు గార్చారు*
ఫోన్ ట్యాపింగ్ కేసును కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నీరు వాడుతుందన్నారు. శ్రవణ్ రావు తో సహా అందరికీ బెయిల్ వచ్చేలా చేసి కాంగ్రెస్సే సహకరిస్తోందని, గత ఎన్నికలకు ముందు కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి యూ టర్న్ తీసుకున్నారన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ కాపాడుతోందని,అందుకే ఏడాదిన్నరైనా అరెస్ట్ కాదు కదా కనీసం నోటీసులిచ్చి విచారణ కూడా చేయండం లేదన్నారు.ప్రజలను దారి మళ్లించడానికి డీలిమిటేషన్ పేరుతో డ్రామాలాడుతున్నాయన్నారు.
*కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ కుమ్మక్కయ్యాయి*
జీహెచ్ఎంసీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంటూ మజ్లిస్ ను గెలిపించేందుకు సిద్ధమైనాయన్నారు. మరి కొద్దిరోజుల్లో ఆ 3 పార్టీల అసలు రంగు బయటపడబోతోందని,బీఆర్ఎస్ కు అత్యధిక మంది కార్పొరేటర్లున్నా ఎందుకు పోటీ చేయడం లేదన్నారు. జీహెచ్ఎంసీలో బీజేపీకి సరిపడా బలం లేకపోయినా లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నామన్నారు.మజ్లిస్ ను గెలిపించేందకు కాంగ్రెస్ పోటీకి దూరంగా ఉండాలనుకుంటోందన్నారు.
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై అందరి అభిప్రాయాలను తీసుకున్నామని,అతి త్వరలోనే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంట్ లో ఆమోదం పొందడం ఖాయమన్నారు.
*ఆర్ఎస్ఎస్ దేశభక్తి గల పార్టీ*
ఆర్ఎస్ఎస్ దేశభక్తి కలిగిన పార్టీ అని, ఈ దేశ ధర్మం, సనాతన ధర్మం, హిందూ సమాజ సంఘటితం చేసేందుకు నిరంతరం క్రుషి చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న సంస్థ అన్నారు ఆర్ఎస్ఎస్ ఏనాడూ ఉగ్రవాదులకు సహకరించలేదన్నారు. ఉగ్రవాదులకు బెయిల్ కోసం ఏనాడూ పాటుపడలేదన్నారు. ఒవైసీ ఆసుపత్రిలో ఉగ్రవాదులు దొరికారని, దారుస్సలాం టెర్రరిస్టులకు అడ్డాగా మారిందన్నారు.ఆర్ఎస్ఎస్ ఆఫీసులో దేశభక్తిపరులుంటారని,మజ్లిస్ కు తెలంగాణ అంతటా పోటీ చేసే దమ్మే లేదన్నారు.అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి అమ్ముడుపోయే పార్టీ మజ్లిస్ అని ఆరోపించారు.
ఒవైసీ కుటుంబ వ్యాపారాలను కాపాడుకునేందుకు ఏ పార్టీకైనా కొమ్ముకాస్తారని,కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు దమ్ముంటే జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టి వేర్వురుగా పోటీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలు ఆ పార్టీలకు గుణ పాఠం చెప్పడం తథ్యమన్నారు.