TG | అహ్మదాబాద్‌కు సీఎం రేవంత్ !

  • ఏఐసీసీ, సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరు

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో రెండు రోజులపాటు జరగనున్న అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంగళవారం ఉదయం ఇక్కడి నుంచి బయలుదేరి వెళుతున్నారు.

పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన మంగళవారం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం, బుధవారం ఏఐసీసీ భేటీ జరగనున్నట్టు కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ రెండు కీలక సమావేశాల్లో పార్టీ బలోపేతం, త్వరలో జరిగే బీహార్‌, తమిళనాడు ఎన్నికల్లో రచించాల్సిన వ్యూహంపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.

అహ్మదాబాద్‌లోని సర్ధార్‌ పటేల్‌ మెమోరియల్‌లో సమావేశాలను ఏర్పాటు చేశారు. 1885 డిసెంబర్‌ 28న జాతీయ కాంగ్రెస్‌ ఆవిర్భవించాక 1902వ సంవత్సరం డిసెంబర్‌ 23 నుంచి మూడు రోజుల పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు సురేంద్రనాధ్‌ బెనర్జీ అధ్యక్షతన అహ్మదాబాద్‌లో తొలిసారిగా ఏఐసీసీ సమావేశాలు జరిగాయని, 1907 డిసెంబర్‌ 26 నుంచి రెండు రోజులపాటు గుజరాత్‌లోని సూరత్‌లో రెండోసారి పార్టీ సమావేశం జరిగిందని తెలిపారు.

1921లో మూడోసారి అహ్మదాబాద్‌లోని అహ్మదాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ సమావేశాలు జరగడం విశేషమన్నారు. 1938 ఫిబ్రవరి 19 నుంచి మూడు రోజుల పాటు నాలుగోసారి నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అధ్యక్షతన కూడా గుజరాత్‌లో పార్టీ సమావేశాలు జరిగాయని చెబుతున్నారు.

గుజరాత్‌లోని భవనగర్‌లో 1961లో పార్టీ అధ్యక్షుడు నీలం సంజీవరెడ్డి అధ్యక్షతన ఐదవసారి సమావేశాలు నిర్వహించారు. ఆరవసారి కూడా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో రెండు రోజులపాటు కాంగ్రెస్‌ పార్టీ కీలక సమావేశాలను ఏర్పాటు చేసింది.

Leave a Reply