TG| వారి కోసం మళ్ళీ కుల గణన – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్ ; రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన కులగణనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నేడు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది.

ఈ భేటీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లతోపాటు కులగణన సర్వేపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియా తో మాట్లాడుతూ. రాష్ట్రంలో కులగణన సర్వే శాస్త్రీయంగా జరిగిందన్నారు. వివిధ కారణాలతో కులగణన సర్వేలో పాల్గొనని వారి కోసం మరో అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.

ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు సర్వే సిబ్బందికి వివరాలు అందజేయాలని సూచించారు. రాష్ట్ర జనాభా లెక్కల్లోకి వచ్చే విధంగా అందరూ చూసుకోవాలని భట్టి కోరారు.

కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ వంటి వాళ్లు కొందరు ఉద్దేశపూర్వకంగా సర్వేలో పాల్గొనలేదని మండిపడ్డారు. ఇక ఎన్నికల్లో మాట ఇచ్చినట్లుగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆయన తెలిపారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై మార్చి మొదటి వారంలో కేబినెట్ తీర్మానం చేయనుందని భట్టి విక్రమార్క తెలిపారు.

శాసనసభలో బిల్లు ఆమోదింపజేసి చట్టబద్ధం చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కులగణన బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపుతామన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంటులో ఆమోదానికి కృషి చేస్తామని వివరించారు.ఓబీసీల రిజర్వేషన్ల కోసం వివిధ పార్టీల నాయకులను కలుస్తామని భట్టి తెలిపారు. దశాబ్దాల ఓబీసీల కలలను నిజం చేసేందుకు కృషి చేస్తామని చెప్పుకొచ్చారు. . రాజకీయ లబ్ధి పక్కన పెట్టి మద్దతు పలకాలని కోరుతున్నామని భట్టి విక్రమార్క తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *