ఇదీ బీజేపీ భవిష్యవాణి
మాజీ ఎమ్మెల్సీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో సీఎం మార్పు జరుగబోతున్నట్లు బీజేపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్సీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ జోస్యం చెప్పారు. జూన్ 2 తర్వాత గానీ, డిసెంబర్ 9 తర్వాత గానీ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం కావడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి స్థానంలో కేసీఆర్ సీఎం అవుతారంటూ చెప్పుకొచ్చారు. బుధవారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతంలో కవితకు సాయం చేసిన న్యాయవాదిని చట్టసభకు పంపించడానికి బీఆర్ఎస్ ఎలా సహాయం చేసిందో అందరికీ తెలుసన్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభల ద్వారా ఎంపిక జరగడం లేదన్నారు. దీంతో గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ కు చెందిన వారికే సంక్షేమ ఫలాలు జరుగుతున్నాయన్నారు. రాజకీయ నేపథ్యం లేని వారికి పథకాలు దక్కడం లేదన్నారు.
కమ్యూనిస్టుల తీరు మారడం లేదు
ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందన్నారు. అనుకున్న లక్ష్యాన్ని అతి తక్కువ సమయంలో భారత్ సాధించిందన్నారు. ప్రపంచదేశాల్లో పాకిస్తాన్ ను ఏకాకిని చేసిన ఘనత ప్రధాని మోదీకి దక్కిందన్నారు. ఉగ్రవాదులపై కమ్యూనిస్టుల తీరు మారలేదని ఫైర్ అయ్యారు. వారి కౌన్సిల్ సమావేశాల్లో ఎప్పుడూ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. తాము ఎదగాలని కాకుండా.. బీజేపీని ఓడించాలని వారు ప్రయత్నిస్తారని ఎద్దేవా చేశారు. దేశ వ్యాప్తంగా దారుణంగా ఓటమి పాలవుతున్నా వారి బుద్ధి మారడం లేదన్నారు.