హైదరాబాద్ – పథకాల పేర్లు మార్చడం కాదు.. ప్రజల బ్రతుకులు మార్చండి అంటూ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగానికి దశ, దిశ లేదని కామెంట్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని అన్నారు. అధికారంలోకి వచ్చి 15 నెలల గడుస్తున్నా.. రుణామాఫీ పూర్తిగా జరగలేదని, ఇచ్చిన హామీల్లో కేవలం 10 శాతం మాత్రమే అమలు చేస్తున్నారని మండిపడ్డారు. తన జనగామ నియోజకవర్గంలో మాత్రం ఎక్కడా 100 శాతం రుణమాఫీ కాలేదని చెప్పారు. తన నియోజకవర్గంలో మొత్తం 127 గ్రామాలు ఉన్నాయని, ఆ 127 గ్రామాల్లో ఏ ఒక్క గ్రామంలో 100 శాతం రుణమాఫీ కాలేదని అన్నారు.
తన నియోజకవర్గంలోని ఏ ఒక్క గ్రామంలో అయినా సరే 100 శాతం రుణమాఫీ జరిగినట్లుగా ప్రభుత్వం నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని పల్లా రాజేశ్వర్‌రెడ్డి శపథం చేశారు. అంతేకాదు తాను తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని అన్నారు. వంద శాతం రుణమాఫీ చేశామని అబద్ధాలు చెప్పకుండా.. ఇంకా రుణాలు మాఫీ కాని రైతులకు కూడా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత కారణంగా విద్యాశాఖలో డ్రాపౌట్స్ పెరిగాయని ఆరోపించారు. కాంగ్రెస్ 15 నెలల పాలనలో 2 లక్షల డ్రాపౌట్స్ నమోదయ్యాయని చెప్పారు. విద్యాసంస్థలకు నిధుల కేటాయింపులో కూడా ప్రభుత్వం విఫలమైందని అన్నారు.
తెలంగాణ చిహ్నం నుండి కళాతోరణం, చార్మినార్ తీయాలని చూస్తున్నారని మండిపడ్డారు.. వరంగల్ వాళ్ళం ఆత్మగౌరవం ఉన్నోల్లం రాణి రుద్రమ దేవి సాక్షిగా, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సాక్షిగా, దొడ్డి కొమురయ్య సాక్షిగా, చాకలి ఐలమ్మ సాక్షిగా, సమ్మక్క సారక్క సాక్షిగా మా ఆత్మగౌరవం కొరకు పోరాడుతాం అని అన్నారు. రాజముద్రలో నుండి కాకతీయులకళాతోరణం, చార్మినార్ మార్చవద్దు.. మారిస్తే మళ్ళీ మేము అధికారంలోకి రాగానే తెచ్చుకుంటాం అని తేల్చి చెప్పారు.
2014లో 1400 రైతుల ఆత్మహత్యలు జరిగితే వాటిని తగ్గించుకుంటూ 2023 నాటికి 134కు తెస్తే కాంగ్రెస్ వాళ్ళు మళ్లీ 564 రైతుల ఆత్మహత్యలకు పెంచారంటూ గణాంకాలతో వివరించారు.. తెలంగాణ తల్లి సామాన్యంగా ఉండాలని చెప్పే వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం నిండుగా నగలు వేసుకొని ఉంటారని దెప్పి పొడిచారు. తెలంగాణ తల్లి నుండి బతుకమ్మను వేరు చేయడం అంటే తెలంగాణ బతుకును అవమానించినట్టేనని అన్నారు.. ఇక కాంగ్రెస్ సర్కార్ అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని.. జర్నలిస్టులపై కేసులు పెట్టిందని సభ దృష్టికి తీసుకెళ్లారు. అరెస్ట్ అయిన జర్నలిస్ట్ లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.