TG – మరి కొద్దిసేపట్లో అసెంబ్లీ, మండలి ప్రత్యేక సమావేశం
హైదరాబాద్: మరి కొద్దిసేపట్లో శాసన సభ , మండలి ప్రత్యేక సమావేశం కానుంది.. ఈ సందర్భంగా రెండు కీలక అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేసి.. వాటిపై చర్చించనున్నారు. తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ సమగ్ర ఇంటింటి కుల గణననపై రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తారు. వాటిపై లఘు చర్చ జరుగుతుంది. అనంతరం ఎస్సీ వర్గీకరణ, జస్టిస్ షమీం అక్తర్ ఏకసభ్య న్యాయ్ కమిషన్ రిపోర్ట్ పై ప్రకటన చేస్తారు. వాటిపై కూడా లఘు చర్చ జరుగుతుంది. కుల గణన, బీసీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపనుంది.
కేబినెట్ భేటి
కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఉదయం ప్రత్యేక కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్ లో సమావేశమవుతారు.
ఈ భేటీలో ప్రధానంగా సమగ్ర ఇంటింటి కులగణన నివేదిక, ఎస్సీ వర్గీకరణ, జస్టిస్ షమీమ్ అక్తర్ ఏకసభ్య న్యాయ్ కమిషన్ రిపోర్ట్‌పై కేబినెట్‌లో చర్చించనున్నారు. అనంతరం రెండు నివేదికలకు మంత్రి మండలి ఆమోదం తెలుపనుంది. అనంతరం శాసన సభ, శాసన మండలి ప్రత్యేక సమావేశం కానున్నాయి.
కాగా రాష్ట్రంలోని ఎస్సీలను మూడు గ్రూపులుగా వర్గీకరించాలని ఈ అంశంపై నియమించిన ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి సూచించినట్టు తెలిసింది. గతంలోలా ‘ఏ బీ సీ డీ’గా కాకుండా ఇప్పుడు ‘ఏ బీ సీ’ గ్రూపులుగా వర్గీకరించాలని ప్రభుత్వానికి సమర్పించిన తన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ఆయా గ్రూపుల్లో మాదిగ, మాల సహా మిగిలిన ఉప కులాల జనాభా శాతం, వాటికి ఇప్పటి వరకు వివిధ రంగాల్లో దక్కిన అవకాశాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లను కేటాయించాలని నివేదికలో పొందుపరిచినట్టు సమాచారం.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే. ఆ కమిషన్ తన నివేదికను సోమవారం ఎస్సీ సంక్షేమ శాఖకు అందించగా.. ఆ శాఖ అధికారులు దానిని మంత్రివర్గ ఉప సంఘానికి సమర్పించారు. నివేదికపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని ఉప సంఘం సోమవారం మధ్యాహ్నం, సాయంత్రం రెండు దఫాలుగా సమావేశమై నివేదికలోని పలు అంశాలను పరిశీలించి చర్చించింది.
దీనిలో సభ్యులుగా మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్, ఎంపీ మల్లు రవి ఉన్న విషయం తెలిసిందే. అనంతరం సబ్ కమిటీ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి.. నివేదికలోని విషయాలను వివరించింది.