TG Assebly – చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెడదాం ‍‍ – రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరుపై యూనివర్సిటీలు, సంస్థలు ఉంటే పరిపాలనా పరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. దాన్ని పరిష్కరించేందుకే రాష్ట్రంలోని యూనివర్సిటీలు, సంస్థలకు తెలంగాణకు సంబంధించిన పేర్లు పెడుతున్నామని చెప్పారు. పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ చట్ట సవరణ బిల్లును నేడు అసెంబ్లీలో మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశపెట్టారు. అనంతరం తెలుగు (పోట్టి శ్రీరాములు) యూనివర్సిటీ పేరు మార్పుపై అసెంబ్లీలో చర్చ జరిగింది.ఈ సంద‌ర్బంగా సీఎం మాట్లాడుతూ, తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములుకు బదులు సురవరం ప్రతాప రెడ్డి పేరును పెట్టబోతున్నట్లుగా ప్రకటించారు.సురవరం ప్రతాప రెడ్డి పేరును ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రతిపాదన చేశారని సభ లో వెల్లడించారు.

చల్లపల్లి టెర్మినల్ కు పొట్టి శ్రీరామలు పేరు ..

చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అనేక యూనివర్సిటీలకు పేర్లు మార్చుకున్నాం. పరిపాలనా సౌలభ్యం కోసమే కొన్ని వర్సిటీలకు ప్రొఫెసర్‌ జయశంకర్‌, కొండా లక్ష్మణ్‌ బాపూజీ, పీవీ నరసింహారావు, కాళోజీ నారాయణరావు పేర్లు పెట్టుకున్నాం. అదే ఒరవడిలో పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్‌రెడ్డి పేరు పెడుతున్నాం. తెలంగాణ సమాజానికి ఆయన ఎంతో సేవ చేశారు. గోల్కొండ పత్రికను సురవరం నడిపారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్చడం ఎవరికీ వ్యతిరేకం కాదని అన్నారు…

రోశ‌య్య ప‌ట్ల‌, ఆర్య‌వైశ్య‌ల ప‌ట్ల అపార గౌర‌వం ఉంది.

దివంగత మాజీ సీఎం రోశయ్య, ఆర్యవైశ్య సమాజం పట్ల ప్రభుత్వానికి అపారమైన గౌరవం, నమ్మకం, విశ్వాసం ఉంది. కులం, మతం పేరుతో రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకోవడం సరికాదు. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు లేఖ రాస్తా. దేశం కోసం ఆయన చేసిన త్యాగాలను గుర్తుచేసుకుందాం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకురావాలని కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ను కోరుతున్నాన‌ని చెప్పారు.

నేచర్‌ క్యూర్‌ ఆస్పత్రికి రోశయ్య పేరు

బల్కంపేట్‌లో నేచర్‌ క్యూర్‌ ఆస్పత్రికి రోశయ్య పేరు పెడతామ‌ని రేవంత్ ప్ర‌క‌టించారు. ఆయన సుదీర్ఘ అనుభవం గల నేత. గవర్నర్‌గా, సీఎంగా ఎన్నో సేవలందించారు. నేచర్‌క్యూర్‌ ఆస్పత్రి సమీపంలో రోశయ్య విగ్రహం నెలకొల్పి అధికారికంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తాం అని సీఎం ప్రకటించారు.

పేరు మార్పును వ్యతిరేకించిన బిజెపి

ఇక పేరు మార్పును బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యతిరేకించారు. అసలు పొట్టి శ్రీరాములు పేరు ఎందుకు మార్చాల్సి వస్తుందని ప్రశ్నించారు. ఉస్మానియా యూనివర్సిటీ కి సురవరం ప్రతాప రెడ్డి పేరును పెట్టాలంటూ ప్రభుత్వానికి సంచలన ప్రతిపాదన చేశారు. తెలుగు వర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు మార్చడం అవివేకమైన చర్య అని అన్నారు. పొట్టి శ్రీరాములు ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన వ్యక్తి కాదని, దళితుల కోసం అనునిత్యం పోరాటం చేసిన వ్యక్తి అని మహేశ్వర్ రెడ్డి కామెంట్ చేశారు. అనంత‌రం తెలుగు వ‌ర్శిటి పేరు మార్పు చేసే బిల్లుకు స‌భ ఆమోదం తెలిపింది.

స‌భ‌లో ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌,బిసి రిజ‌ర్వేష‌న్ బిల్లులు ..

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ వర్గీకరణ బిల్లు ను మంత్రి దామోద‌ర రాజ‌న‌ర‌సింహ ప్ర‌వేశ‌పెట్టారు.. దీనిపై ప్ర‌స్తుతం స‌భ‌లో చ‌ర్చ కొన‌సాగుతున్న‌ది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *