TG – అర్హులందరికీ రేషన్​ కార్డులు – అదేశాలు జారీ చేసిన రేవంత్

హైదరాబాద్ , ఆంధ్రప్రభ , రాష్ట్రమంతటా కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజా పాలన అర్జీలు, కుల గణనతో పాటు గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులు, మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలన్నారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఇప్పటికే పలుమార్లు దరఖాస్తులకు అవకాశమిచ్చినప్పటికీ, మీ సేవా కేంద్రాల వద్ద రేషన్ కార్డులకు ఎందుకు రద్దీ ఉంటుందని సీఎం ఆరా తీశారు. దరఖాస్తు చేసిన కుటుంబాలే మళ్లీ మళ్లీ చేస్తున్నాయని, అందుకే రద్దీ ఉంటుందని అధికారులు వివరణ ఇచ్చారు. వెంటనే కార్డులు జారీ చేస్తే ఈ పరిస్థితి తలెత్తేది కాదని, ఆలస్యం చేయకుండా వెంటనే కొత్త కార్డులు జారీ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే కార్డుల కోసం దరఖాస్తు చేసిన కుటుంబాలు మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాల్లో ముందుగా కార్డులను జారీ చేయాలని చెప్పారు. కోడ్​ ముగిసిన తర్వాత అన్ని జిల్లాల్లో కొత్త కార్డులు ఇవ్వాలని సూచించారు. కొత్త కార్డులకు సంబంధించి పౌర సరఫరాల విభాగం తయారు చేసిన పలు డిజైన్లను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *