సమస్యలను పరిష్కరించాలని డిమాండ్

సమస్యలను పరిష్కరించాలని డిమాండ్
బెల్లంపల్లిలో డీఈ కార్యాలయం ఎదుట ఆర్టిజన్ కార్మికుల ధర్నా
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు సోమవారం బెల్లంపల్లి పట్టణంలోని విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ (డీఈ) కార్యాలయం ఎదుట కార్మికులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టిజన్, అన్-మ్యాన్డ్, పీస్ రేట్ కార్మికులు తమ డిమాండ్ల సాధనకై నినదించారు. జేఏసీ నాయకులు దేవేందర్, నవీన్, సుభాకర్, సింగారావు ఆనంద్ మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యా అర్హతల ఆధారంగా ఆర్టిజన్ ఉద్యోగుల కన్వర్షన్ చేపట్టాలని, వీరికి పాత ఏపీఎస్‌ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని వారు కోరారు.
ముఖ్యంగా ఉత్తర డిస్కమ్‌లోని 1,600 మంది ఆన్-మ్యాన్డ్ వర్కర్లను తక్షణమే ఆర్టిజన్లుగా మార్చాలని, 2016 డిసెంబర్ 4 కంటే ముందు నుంచి పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ వర్కర్లను విద్యుత్ సంస్థల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యుత్ సంస్థల్లోని బిల్ కలెక్టర్లు, ట్రాన్స్‌ఫార్మర్ రిపేర్ చేసే పీస్ రేట్ వర్కర్లకు జీవో-11 ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని, 2026 పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ధర్నా కార్యక్రమానికి టీఆర్‌వీకేఎస్ హెచ్ -58 సంఘం మంచిర్యాల సర్కిల్ సెక్రటరీ ముష్క నర్సయ్య, బెల్లంపల్లి డివిజన్ ప్రెసిడెంట్ జాల తిరుపతి, సెక్రటరీ పైడాకుల తిరుపతిలు పాల్గొని మద్దతు తెలిపారు. విద్యుత్ కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
అలాగే 1104 యూనియన్ బెల్లంపల్లి ప్రెసిడెంట్ గిట్టె పుండలీక్ రావు, సెక్రటరీ మార్కండేయ, 327 యూనియన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ పెద్ద రమేష్, బెల్లంపల్లి అధ్యక్షుడు యూసస్, సెక్రటరీ ఈశ్వర్‌లు కూడా సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం ఈనెల 7వ తేదీలోగా స్పందించకుంటే 8వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న విద్యుత్ ఉద్యోగుల సమ్మెలో జిల్లాలోని కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న విద్యుత్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
