మామిడి సాగులో మెళకువలు.. కోతలో జాగ్రత్తలు!

మామిడి సాగులో మెళకువలు.. కోతలో జాగ్రత్తలు!
కాయ రాలుడు నివారణతోనే రైతుకు మేలు
ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ యు. స్రవంతి సమగ్ర సూచనలు
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లాలో మామిడి సాగు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, మారుతున్న వాతావరణ పరిస్థితులు రైతులకు సవాలుగా మారుతున్నాయి. ప్రస్తుతం తోటల్లో పిందె దశ కొనసాగుతుండగా, వాతావరణ మార్పులు, పోషక లోపం , పురుగుల ఉధృతి వల్ల కాయ రాలుడు సమస్య తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో తోటల యాజమాన్యం , కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ యు. స్రవంతి రైతులకు సమగ్ర సూచనలు చేశారు.
కాయలు రాలడానికి కారణాలు – నివారణ:
తోటల్లో నీటి కొరత లేదా ఒక్కసారిగా అధికంగా నీరు పెట్టడం వల్ల కాయలు రాలిపోతాయని, నత్రజని, పొటాష్, సూక్ష్మ పోషకాల లోపం కూడా ప్రధాన కారణమని శాస్త్రవేత్త తెలిపారు. దీని నివారణకు పిందె గింజ దశలో ఉన్నప్పటి నుండి ప్రతి 10–15 రోజులకోసారి పద్ధతి ప్రకారం నీరు అందించాలి. కాయలు రాలకుండా ఉండాలంటే గింజ , గోలీ దశలో ఎన్ఏఏ 20–50 పీపీఎం లేదా 2,4-డీ 10–20 పీపీఎం హార్మోన్లను పిచికారీ చేయాలి. అలాగే 1 శాతం పొటాషియం నైట్రేట్ స్ప్రే చేయడం వల్ల కాయలు నిలబడతాయి.
తేనెమంచు పురుగు ఉధృతి:
ప్రస్తుతం జిల్లాలో తేనెమంచు పురుగు (హాపర్) ప్రభావం ఎక్కువగా ఉంది. ఇవి రసాన్ని పీల్చి తేనె వంటి ద్రవాన్ని విడుదల చేయడం వల్ల ఆకులు, పిందెలపై నల్లటి పూత ఏర్పడి మచ్చలు కనిపిస్తాయి. దీని నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ లేదా థియామెథాక్సామ్ 0.25 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. నల్లటి పూత తగ్గించడానికి 1 శాతం స్టార్చ్ లేదా సబ్బు ద్రావణాన్ని వాడాలి. తోటలో గాలి, వెలుతురు సోకేలా ఎండిన కొమ్మలను తొలగించడంతో పాటు, ‘ట్రైకోడెర్మా’, ‘సూడోమోనాస్’ వంటి బయోకంట్రోల్ పద్ధతులు పాటించాలి. తోట చుట్టూ సుబాబుల్ వంటి గాలి నిరోధక చెట్లను పెంచడం వల్ల గాలివానల నుండి పంటను కాపాడుకోవచ్చు.
కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
కాయలు పచ్చ రంగు నుండి లేత పసుపు రంగులోకి మారే సరైన పరిపక్వ దశలోనే కోయాలి. కోతకు వారం ముందు నీటి తడులు తగ్గించాలి. పురుగు మందులు పిచికారీ చేసినట్లయితే, కనీసం 10–15 రోజుల విరామం తర్వాతే కోయాలి. కాయలను కట్టర్‌తో చిన్న కాడ ఉండేలా కోయడం వల్ల కాయలకు గాయాలు కావు. కోసిన కాయలు నేలపై పడకుండా జాగ్రత్త వహించి, గ్రేడింగ్ చేసిన తర్వాత చల్లని ప్రదేశంలో నిల్వ చేయాలి.
జిల్లాలో 17,538 ఎకరాల్లో మామిడి సాగు:
మంచిర్యాల జిల్లాలో సుమారు 17,538 ఎకరాల్లో మామిడి సాగవుతూ ఏటా 50,000 టన్నుల ఉత్పత్తి లభిస్తోంది. బెల్లంపల్లి క్లస్టర్ పరిధిలో 9,870 ఎకరాలు, చెన్నూర్ క్లస్టర్‌లో 7,160 ఎకరాలు, మంచిర్యాల క్లస్టర్‌లో 1,120 ఎకరాల్లో తోటలు విస్తరించి ఉన్నాయి. ముఖ్యంగా నెన్నెల్, జైపూర్, భీమారం, బెల్లంపల్లి, తాండూర్ మండలాల్లో సాగు ఎక్కువగా ఉందని డాక్టర్ స్రవంతి వివరించారు.
