గ్రామ పంచాయతీ సిబ్బంది సేవలు వెల కట్ట లేనివి..

గ్రామ పంచాయతీ సిబ్బంది సేవలు వెల కట్ట లేనివి..
ఊట్కూర్ లో పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగిన ప్రజా ప్రతినిధులు.
ఊట్కూర్, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీ సిబ్బంది చేస్తున్న సేవలు వెల కట్టలేనివని ఊట్కూర్ సర్పంచ్ ఎం. రేణుక భరత్ కొనియాడారు. ఆదివారం నారాయణపేటజిల్లా ఊట్కూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ కార్మికుల కాళ్లు కడిగి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి నిత్యం గ్రామ పంచాయతీ సిబ్బంది ఏదో ఒక కాలనీలో తమ సేవలు చేస్తూ నిరంతరం ప్రజల మధ్య ఉంటూ చేస్తున్న సేవలు ఆదర్శనీయమని కొనియాడారు. ప్రతి ఒక్కరూ గ్రామ పంచాయతీ కార్మికుల సేవలను గుర్తించాలని అన్నారు.
ఊట్కూర్ పట్టణంలో 16 వార్డులు ఉన్నాయని సిబ్బంది కొరత ఉన్న ఏ వార్డులో సమస్య ఉన్న తక్షణమే స్పందిస్తూ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రమేష్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, వార్డు సభ్యులు గోవిందమ్మ, సువర్ణ, భరత్, నరేష్, అక్షయ్, మౌనిక, నరేష్, రూప తదితరులు పాల్గొన్నారు.
