శిల్పారామం: హాస్య బ్రహ్మ డాక్టర్ శంకర నారాయణ గత 50 సంవత్సరాలుగా తెలుగు సాహిత్యానికి చేసిన కృషికి గుర్తింపుగా, రమ్యా నాయుడు ఆధ్వర్యంలో శ్రీరాగ రమ్య సాంస్కృతిక సేవా సంస్థ శిల్పారామంలో ఆయనకు ఘనంగా స్వర్ణోత్సవ సన్మాన కార్యక్రమాన్ని (శనివారం) నిర్వహించింది.
ఈ సందర్బంగా కళా నీరాజనం పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కనువిందయిన కూచిపూడి నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. నాట్య గురువులు వై.అనంత లక్ష్మి, రేవతి రామినేని, కె.వి.పూర్ణిమా రామకృష్ణ శిష్యబృందాలు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కెనడా వాస్తవ్యురాలయిన శక్తి అంజన నృత్య ప్రదర్శన చేసి ప్రేక్షకుల మన్ననలు పొందారు.
సత్కారగ్రహీత, హాస్య బ్రహ్మ, ప్రముఖ జర్నలిస్ట్ డాక్టర్ శంకర నారాయణ మాట్లాడుతూ.. గత ఆరు సంవత్సరాలలో పుణ్యక్షేత్రాలతో పాటు అనేక నగరాల్లో 300 కార్యక్రమాలను నిర్వహించిన శ్రీ రాగ రమ్య సంస్థ తనను సత్కరించడం అదృష్టమని అన్నారు.
రమ్యా నాయుడు మాట్లాడుతూ.. శంకర నారాయణ సత్కారంతో పాటు మహిళా దినోత్సవం సందర్బంగా కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు.