99 రోజుల కార్యాచరణ ప్రణాళిక..

99 రోజుల కార్యాచరణ ప్రణాళిక..
ప్రగతి ప్రణాళికను ప్రారంభిస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్ పావని రమేష్ గౌడ్
చెత్తను తొలగిస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్, కమిషనర్, పాలకవర్గం
ఎమ్మెల్యే సహకారంతో మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి
మున్సిపల్ చైర్ పర్సన్ పావని రమేష్ గౌడ్
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో చౌటుప్పల్ మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని మున్సిపల్ నూతన చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “99 రోజుల కార్యాచరణ ప్రణాళిక” (ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక) చౌటుప్పల్ పురపాలక సంఘంలో మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకట్రామిరెడ్డి లతో కలిసి మున్సిపల్ చైర్ పర్సన్ పావని రమేష్ గౌడ్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. పట్టణాల సమగ్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకట్రామిరెడ్డి కొత్తగా ఎన్నుకోబడిన చైర్ పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కార్యాలయ సిబ్బంది, పారిశుధ్య కార్మికుల చేత పట్టణ పరిశుభ్రత అభివృద్ధిపై ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా చైర్ పర్సన్ పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే తో పాటు అందరి సహకారంతో చౌటుప్పల్ పట్టణాన్ని అభివృద్ధి దిశలో నడిపిస్తామని, ‘స్వచ్ఛ చౌటుప్పల్’ సాధనకై శక్తివంచన లేకుండా కృషి చేస్తామని” తెలిపారు. వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్ మాట్లాడుతూ.. “వేగంగా విస్తరిస్తున్న చౌటుప్పల్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని, అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ, తమ తమ విధులను సక్రమంగా నిర్వహించాలని కోరారు. అనంతరం తంగడపల్లి ఐదో వార్డు బ్రహ్మంగారి గుడి దగ్గర ఉన్న రోడ్లను శుభ్రం చేసి, చెత్త కుప్పను పూర్తిగా తొలగించారు. పరిసర ప్రాంత ప్రజలకు పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుదాం అని కమిషనర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ నూతన కౌన్సిలర్లు కొసనం రాకేష్ రెడ్డి, పోలేపల్లి లక్ష్మి, పల్లె లావణ్య ఊదరి యాదయ్య, కొయ్యడ శేఖర్, ఆలె శ్రీలత చిరంజీవి, కాసర్ల మంజుల, బద్రి గాలయ్య, దేప రమ్య రాజు, పాక చిరంజీవి, బత్తుల వాణి విప్లవ్, ఊడుగు జ్యోతి రమేష్ గౌడ్, గడ్డం ఇందిర, బత్తుల జయమ్మ, చింతల ఉమామహేశ్వరి, బుడ్డ సురేష్, పిల్లలమర్రి మధుసూదన్, ఎండి హన్ను, 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పరిశీలకులు ఈఈ రవిశంకర్, నాయకులు మొగుదాల రమేష్ గౌడ్, ఆలే చిరంజీవి, బత్తుల విప్లవకుమార్, దేప రాజు, ఊడుగు రమేష్ గౌడ్, ఆలే చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
