ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం..

ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం..
అధికారపక్షం గైరాజార్ – ప్రతిపక్షం హాజరు
మొదటి రోజే అబాసుపాలైన “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” ప్రతిజ్ఞ కార్యక్రమం
అచ్చంపేట, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక”లో భాగంగా పురపాలక సంఘాలలో అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక మొదటి రోజే అచ్చంపేట మున్సిపాలిటీలో వివాదాస్పదంగా మారింది. అధికార పార్టీ ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం చూపిందంటూ ప్రతిపక్షం ఘాటుగా విమర్శలు గుప్పించింది. పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు మార్చి 6 నుంచి మార్చి 15, 2026 వరకు నిర్వహించనున్న కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని కోరుతూ అచ్చంపేట మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. అయితే మొత్తం 24 మంది సభ్యులు (20 కౌన్సిలర్లు, 4 కో-ఆప్షన్ సభ్యులు) ఉన్న మున్సిపాలిటీలో కేవలం ముగ్గురు మాత్రమే హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ నుంచి ఒక్క కౌన్సిలర్ మాత్రమే హాజరుకాగా, ప్రతిపక్షానికి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు మాత్రమే కార్యక్రమానికి హాజరయ్యారు.
మున్సిపల్ చైర్మన్, కమిషనర్‌తో పాటు ఎక్కువ మంది అధికారపక్ష కౌన్సిలర్లు గైరాజరు కావడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కలిగించింది. ప్రజా సమస్యలపై అధికారపక్ష నేతలకు ఉన్న చిత్తశుద్ధి ఇదేనా అంటూ అక్కడికి వచ్చిన ప్రజలు బహిరంగంగా విమర్శలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష కౌన్సిలర్లు కానోజ్ మనోహర్ ప్రసాద్, రమేష్ రావు పాత్రికేయులతో మాట్లాడుతూ అధికారపక్షంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజా సమస్యలపై చర్చించే కార్యక్రమానికి చైర్మన్, కమిషనర్, అధికార పార్టీ కౌన్సిలర్లు గైరాజరు కావడం దురదృష్టకరమన్నారు. ఇదేనా ప్రజల పట్ల వారి బాధ్యత అంటూ ప్రశ్నించారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో పట్టణ పరిశుభ్రత కోసం నెలకు సుమారు రూ.25 లక్షలు ఖర్చు చేసేవారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యక్రమానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని విమర్శించారు.
కాలనీల్లో ఉన్న సమస్యలపై ప్రజలకు ఏమి సమాధానం చెప్పాలంటూ, ఏ ముఖం పెట్టుకొని కాలనీలో పర్యటించాలని వారు ఆవేదనతో ప్రశ్నించారు. ఇక అచ్చంపేట పట్టణంలో రెండు సంవత్సరాలుగా బస్టాండ్ ముందు మరియు ఉప్పునుంతల రోడ్డులో బ్రిడ్జి పనులు అసంపూర్తిగా ఉండిపోయాయని ఆరోపించారు. ముఖ్యంగా బస్టాండ్ ముందు రహదారి దారుణంగా మారి ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. వెంటనే ఆ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కేవలం కాగితాలకే పరిమితమవుతున్న కార్యక్రమాలతో ప్రజలను మోసం చేస్తున్నారని, వాస్తవ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ప్రతిపక్ష కౌన్సిలర్లు సూచించారు.
