ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక

ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
ఆంధ్రప్రభ ప్రతినిధి , భూపాలపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు. శుక్రవారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జీఎస్ఆర్ మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ , జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, డ్రైనేజీలు, కాలనీలు, ఇళ్ల పరిసరాలు శుభ్రంగా ఉంచుకున్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాల్లో విద్యుత్ సౌకర్యాలు, డ్రైనేజీ సమస్యలు, ట్రాన్స్‌ఫార్మర్‌ల ఏర్పాటు, మిడిల్ పోల్స్ అవసరం వంటి సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పారు. అవసరమైన చోట మీటర్లు ఏర్పాటు చేసి విద్యుత్ సౌకర్యాలను మెరుగుపరచాలని సూచించారు. అదేవిధంగా విద్యార్థుల చదువు, హాస్టల్ సౌకర్యాలు, ప్రజల ఆరోగ్య పరిస్థితులపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు.

ఆరోగ్య శాఖ ద్వారా ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స అందించాలని తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అన్ని శాఖల అధికారులు పాల్గొని ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని తమ వార్డులు, గ్రామాల అభివృద్ధికి భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు , ప్రజలు పాల్గొన్నారు.
