TG | నాడు వైభవం.. నేడు వెలవెల

TG | నాడు వైభవం.. నేడు వెలవెల
- నకరికల్లులో మసకబారిన సంక్రాంతి
- కనిపించని పండగ వాతావరణం
TG | నకరికల్లు, ఆంధ్రప్రభ : తెలుగువారి అతిపెద్ద పండుగ రైతులకు ఇష్టమైన సంక్రాంతి సంబరాలు నకరికల్లు మండలంలోని పలు గ్రామాలలో ఈ ఏడాది వెలవెలబోతున్నాయి. ఒకప్పుడు కోలాహలంగా సాగే పండుగ వాతావరణం నేడు ఎక్కడో ఒకచోట తప్ప కనిపించడం లేదు. గ్రామ వీధుల్లో పండుగ కళ పూర్తిగా మసకబారింది. గతంలో సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో వీధులన్నీ కళకళలాడేవి. పోటీపడి మరీ ముగ్గులు వేసే యువతులు, మహిళలు నేడు ఆ ఉత్సాహాన్ని కనబరచడం లేదు. ఇక పల్లెల్లో పండుగకు సంకేతమైన హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు అడ్రస్ లేకుండా పోయాయి. డూడూ బసవన్నల సవ్వడి వినపడక, హరిదాసుల రాక లేక పండుగ సందడి కరువైంది. సాధారణంగా పండుగ సమయాల్లో స్థానిక రాజకీయ నాయకులు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో ఉత్సాహం నింపేవారు.
కానీ ఈసారి నకరికల్లు లో అటువంటి దాఖలాలు కనిపించడం లేదు. ప్రజలను ఏకం చేసే ప్రయత్నం చేయకపోవడంతో పండుగ కేవలం నామమాత్రంగానే మిగిలిపోయింది. గ్రామంలోని ప్రజల మధ్య ఐక్యత తగ్గడానికి సోషల్ మీడియా ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. పక్కింటి వారితో కలిసి పండుగ జరుపుకోవడం కంటే, స్మార్ట్‌ఫోన్లలో మునిగిపోయి సామాజిక మాధ్యమాల మత్తులో గడుపుతున్నారు. “ఎవరికి వారే యమునా తీరే” అన్న చందంగా పండుగ సంస్కృతి మారిపోయింది. మన సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతిరూపమైన సంక్రాంతి పండుగ ఇలా మసకబారడం పట్ల పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాంత్రిక జీవనంలో పడి మన మూలాలను మర్చిపోకూడదని, రాబోయే రోజుల్లోనైనా పాత సందడి తిరిగి రావాలని పెద్దలు కోరుతున్నారు.
