స్టేషన్ ఘన్‌పూర్‌లో దేవాలయాలు తాత్కాలికంగా మూసివేత..

స్టేషన్ ఘన్‌పూర్‌లో దేవాలయాలు తాత్కాలికంగా మూసివేత..
-కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం…
-ఉదయం 9.30కే గర్భగుడులు మూసివేత
-గ్రహణ సూత్రం ప్రకారం దర్శనాల నిలిపివేత
-సంప్రోక్షణ పూజల అనంతరం భక్తులకు తిరిగి దర్శనం
-గ్రహణ నియమాలు పాటించాలని భక్తులకు సూచన
-గ్రహణం ముగిసిన తర్వాత శుద్ధి కార్యక్రమాలు
స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని స్టేషన్ ఘన్‌పూర్ మండల పరిధిలోని పలు ప్రధాన దేవాలయాలను మంగళవారం ఉదయం తాత్కాలికంగా మూసివేశారు. పట్టణ కేంద్రంలోని మర్రిచెట్టు శివాలయం, శ్రీ తిరుమల నాధ స్వామి దేవాలయంతో పాటు ఆయా గ్రామాల్లోని ఆలయాల్లో ఉదయం ప్రత్యేక పూజలు, నైవేద్యాలు నిర్వ హించారు. అనంతరం గ్రహణ సూత్రం ప్రకారం.. ఉదయం 9.30 గంటలకు గర్భగుడులను మూసివేశారు. గ్రహణ సమయంలో ఆలయాల్లో నిత్యార్చనలు, దర్శనాలు నిలిపివేయడం ఆనవాయితీగా కొనసాగుతోందని అర్చకులు తెలిపారు. చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేసి, సంప్రోక్షణ పూజలు నిర్వహించిన అనంతరం తిరిగి భక్తులకు దర్శనాలను అనుమతిస్తామని చెప్పారు. భక్తులు గ్రహణ సమయ నియమాలను పాటిస్తూ జపాలు, ధ్యానాలు చేయాలన్నారు. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి ఆలయ దర్శనం చేయాలని ఆలయ అధికారులు సూచించారు.
