జన్నారం, (ఆంధ్రప్రభ) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కవ్వాల టైగర్ రిజర్వ్‌లోని మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ విభాగానికి చెందిన ఇందనపల్లి రేంజ్‌లోని పాలగోరి అడవుల్లో మళ్లీ పోడు వ్యవసాయం వివాదం రగిలింది.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్, సిర్పూర్ (యు), జైనూరు మండలాలకు చెందిన సుమారు 50 మంది ఆదివాసులు శుక్రవారం పాలగోరి అటవీ ప్రాంతంలోకి ప్రవేశించి చిన్న పొరకలను నరికివేసి, అక్కడే తాత్కాలిక గుడిసెలు వేశారు.

సమాచారం అందుకున్న జన్నారం ఎఫ్డీఓ ఎం.రామ్మోహన్ ఆదేశాలపై, ఇందనపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీధరచారి ఆధ్వర్యంలో దండేపల్లి ఎస్సై తహసోద్దీన్, పోలీసు బృందం, అటవీ అధికారులు అక్కడికి చేరుకుని, ఆదివాసులను అక్కడి నుంచి వెళ్లమని కోరారు. అయితే, పోలీసులు నచ్చజెప్పినా వారు పట్టించుకోకపోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం నెలకొంది.

గత నెలలో కూడా ఇదే ప్రాంతంలో ఇదే గిరిజనులు పొరకలను నరికివేసి, పూరి గుడిసెలు వేసుకుని సాగు ప్రారంభించారు. ఆ సమయంలో అటవీ అధికారులు మొక్కజొన్న పంటను ధ్వంసం చేసి, 30 మందిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపారు.

మళ్లీ అదే పరిస్థితి తలెత్తడంతో కవ్వాల పాలగోరి అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత చెలరేగింది.

Leave a Reply