జగన్ పర్యటనలో ఉద్రిక్తత..
(ఆంధ్రప్రభ – కృష్ణా ప్రతినిధి):
మొంథా తుఫాన్ నేపథ్యంలో కృష్ణా జిల్లాకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు పెట్టారు. మచిలీపట్నం డిఎస్పీ సిహెచ్.రాజా గూడూరు మండలంలో పర్యటనకు ఆంక్షలతో కూడిన అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో కృష్ణా జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రతీ నియోజకవర్గంలో భారీగా పహారా కాశారు. పెనమలూరు, పామర్రు, పెడన నియోజకవర్గాల్లో అడుగుడుగునా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ పెద ఓరిగిరాల వద్ద ప్రజలు జగన్ కాన్వాయ్ ముందుకు కదలకుండా కొద్దిసేపు ఆపేశారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వారికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఆకునూరు వద్ద భారీ జనసందోహం ఆయనకు స్వాగతం పలికారు.

గండిగుంట వద్ద జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న కాన్వాయిలోని రెండు కార్లు ఒకదానికొకటి ఢీ కొట్టుకోవటంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయింది. కారులోని వారికి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. అదే విధంగా గూడురు మండలంలో జగన్మోహన్ రెడ్డి పర్యటించే ప్రాంతంలో పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహించారు. అడుగడుగునా తనిఖీలు చేస్తూ గూడూరు మండలం నుంచి ఆకుమర్రు లాకు, ఎస్.ఎన్.గొల్లపాలెం వరకు భారీగా పోలీసులు మె సహరించి ట్రాఫిక్ బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందుల కలుగకుండా శాంతిభద్రతలను నిరంతరం పర్యవేక్షణ చేశారు. వైసీపీ శ్రేణులు బైపాస్ రోడ్ల వెంబడి జగన్మోహన్ రెడ్డి రాక కోసం ఎదురుచూశారు. అడుగడుగునా జన నీరాజనం పట్టారు.
పామర్రులో మాజీ ఎమ్మెల్యే వర్సెస్ పమిడిముక్కల సీఐ :-
ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా ఎక్కడికక్కడ పోలీసులు కట్టడి చేస్తున్న నేపథ్యంలో పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పమిడిముక్కల సీఐ మధ్య స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పామర్రు శివారు గోపువానిపాలెం వద్దట్రాఫిక్ ఇబ్బంది కలిగించవద్దని మాజీ ఎమ్మెల్యేకు సీఐ చిట్టిబాబు చెప్పిన నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. డౌన్ డౌన్ పమిడిముక్కల సీఐ అంటూ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ శ్రేణులు నినాదాలు చేశారు. సీఐని అరవొద్దు.. మేము అరవగలమని మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.


