కౌలు రైతు కన్నెర్ర
- గిట్టుబాటు కోసం ఆక్రోశం
- రూ. 1200 లు చాలదని మారం
- కనీసం రూ.2 వేలు ఇవ్వాలని డిమాండ్
పత్తికొండ, ఆంధ్రప్రభ : గిట్టుబాటు ధర లేక తన పంట పొలాన్నిఓ ఉల్లి రైతు దున్నేశారు. పత్తికొండ పట్టణానికి చెందిన పులికొండ అనే కౌలు రైతు రెండు ఎకరాల ఉల్లి పంటకు గిట్టుబాటు కాలేదని, తీరని ఆవేదనతో పొలంలోని తన ఉల్లి పంటను దున్నేశాడు.
క్వింటాలు ఉల్లికి రూ. 1200లు గిట్టుబాటు ధరను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ ధర తో పెట్టుబడి కూడా రావడం లేదని ఈ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటాలుకు రూ.2000 లు చెల్లిస్తే కనీసం అప్పులు తీరుతాయని రైతులు ప్రభుత్వాన్నివేడుకుంటున్నారు.
ఉల్లి పంటను దున్నేస్తున్నాడు అన్నవిషయం తెలుసుకున్నమాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ రైతు పొలంలోకి వెళ్లి రైతులకు మద్దతు తెలిపారు. రైతుల ఆవేదన పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీ దేవమ్మమాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి, టమాటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించి రైతాంగాన్నిఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఉల్లి, టమోటా రైతులను కనీసం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు పరామర్శించి రైతులకు భరోసా కలిగించే స్థితిలో లేరని ఆరోపించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉల్లి రైతులకు రూ. 3000లు కనీస మద్దతు ధర ఇవ్వాలని, టమాటా రైతులకు ఒక బాక్స్ కు కనీసం ధర రూ.300 లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల పక్షాన నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్నిహెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ నారాయణ దాసు, రాష్ట్ర మేధావుల ఫోరం కార్యదర్శి శ్రీరంగడు, బాబుల్ రెడ్డి, బనగాని శ్రీనివాసులు, తుగ్గలి మండల కన్వీనర్ జుట్టు నాగేష్, మద్దికేర మండల కన్వీనర్ మురళీధర్ రెడ్డి, ఎస్సీ సెల్ నాయకులు వెంకటేశ్వర్లు, జై చంద్ర రెడ్డి, రవి రెడ్డి, పెద్దహుల్తి నాగరాజు, క్రాంతి నాయుడు, కడమ కుంట్ల అమర్నాథ్ రెడ్డి, జిలాన్ భాష, ముజ్జు రహిమాన్, నూర్ భాష, మస్తాన్ పాల్గొన్నారు.


