- వాస్తవ నష్టం చెల్లిస్తేనే రైతు గుండె నొప్పి తగ్గుతుంది.
- మీడియా సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు నారపరాజు రామచంద్రరావు.
- ఖమ్మంలో మున్నేరు వరదబాతులను పరామర్శించిన బిజెపి నేతలు.
ఖమ్మం బ్యూరో : ఇటీవల తుఫానులు, వరదల కారణంగా పంటలు నష్టపోయి, ఇళ్లు మునిగిపోయి తీవ్ర కష్టాల్లో ఉన్న రైతులు, ప్రజల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు నిప్పులు చెరిగారు.
ప్రభుత్వం ప్రకటించిన కేవలం పదివేల రూపాయల పరిహారం ఏమాత్రం సరిపోదని, ఇది రైతులను అవమానించడమేనని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. శుక్రవారం రాత్రి ఖమ్మం నగరంలో పర్యటించిన నారపరాజు రామచంద్రరావు, మున్నేరు పరివాహక ప్రాంతాల వరద బాధితులను స్వయంగా కలిసి, వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు.
కంటి తుడుపు చర్యలతో ప్రయోజనం లేదు
“పదివేల రూపాయల పరిహారం అనేది రైతు నష్టానికి కాదు, కేవలం ప్రభుత్వం చూపు తప్పించుకునేందుకు మాత్రమే. కంటి తుడుపు చర్యలతో రైతు గుండె నొప్పి తగ్గదు. పంటలు నష్టపోయిన రైతులకు సరైన నష్టపరిహారం, వాస్తవ నష్టానికి అనుగుణంగా చెల్లించినప్పుడే వారికి మేలు కలుగుతుంది” అని ఆయన స్పష్టం చేశారు. పంటలతో పాటు ఇళ్లు, ఆశలన్నీ ముంపులో కొట్టుకుపోయినా, ప్రభుత్వం మాత్రం కంటి తుడుపు చర్యలతో పబ్లిసిటీ చేసుకుంటోందని ఆయన ధ్వజమెత్తారు.
కొనుగోలు కేంద్రాల్లో వైఫల్యం
కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్ పట్టాలు లేకపోవడంతో వర్షంలో తడిసిపోయిన ధాన్యం రోడ్డుపైనే పడేయాల్సిన పరిస్థితి రైతులకు ఎదురైందని రామచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రభుత్వం రైతు పంటను రక్షించడంలో పూర్తిగా విఫలమైంది. కొనుగోలు కేంద్రాల్లో కనీస సదుపాయాలు లేకపోవడం రైతు ఆత్మాభిమానానికి అవమానం” అని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతుల జీవితాలను గాలికి వదిలేసి, ఓట్ల కోసం పాకులాట ఆపాలని ఆయన హెచ్చరించారు.
ఆరోగ్యంపై అశ్రద్ధ, సుందరీకరణపై విమర్శ
మున్నేరు పరివాహ ప్రాంతాల్లో ఇళ్లు మునిగిపోవడం వల్ల దోమలు, దుర్వాసనలతో ఆరోగ్య సమస్యలు తీవ్రమైనప్పటికీ, హెల్త్ డిపార్ట్‌మెంట్ కనీసం కనబడడం లేదని, ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం చింత లేదని ఆయన మండిపడ్డారు. సుందరీకరణ పేరుతో పార్కులు, రిటైనింగ్ వాల్ పనులు చేసి చూపు మాయ చేస్తున్నారే తప్ప, నీరు బయటకు వెళ్లే మార్గాలు లేకపోవడం వల్లే నష్టం అధికమైందని ఆయన విమర్శించారు.
రాజకీయాలు మానుకోవాలి
“మూడు జిల్లాల్లో వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. అయినా ప్రభుత్వం రాజకీయ లాభం కోసం మాత్రమే పర్యటనలు చేస్తోంది” అని ఆరోపించారు. కేవలం ఫోటోలు తీయడం కాదు, రైతుల జీవితాలను రక్షించడమే ముఖ్యమని ఆయన ఉద్ఘాటించారు. రైతు పంటలకు సరైన అంచనా వేయాలని, పత్తి, మిర్చి పంటల నష్టంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
సత్తుపల్లి ఘటనపై ఆగ్రహం
సత్తుపల్లి సంఘటనపై స్పందిస్తూ, అక్కడ కాంగ్రెస్ నాయకులు కేసులు పెట్టించి బీజేపీ కార్యకర్తలను వేధిస్తున్నారని, రాజకీయ ఒత్తిడితో విచారణలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. దోషులను తక్షణమే అరెస్టు చేయాలని, ప్రజా సమస్యలను రాజకీయ లాభం కోసం వాడుకోవడం మానుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికైనా స్థానిక పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
మీడియా సమావేశంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు, జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, నాయకులు సన్నీ ఉదయ్ ప్రతాప్, సూర్యపేట జిల్లా అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు నాయుడు రాఘవరావు, నల్లగట్టు ప్రవీణ్ కుమార్, నాయకులు మందడపు సుబ్బారావు, దార్ల మల్లేశ్వరి, కొనతం లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

