ఉదయం ఎండ.. సాయంత్రం వర్షం…

ఉదయం ఎండ.. సాయంత్రం వర్షం…

భానుడి భగభగకు కాస్త బ్రేక్
బెజవాడలో పిడుగులతో వర్షం,
ఉష్ణోగ్రత ఒక్కసారిగా మారిన పరిస్థితి..
40 డిగ్రీల దాటిన ఎండకు ఉపశమనం
మధ్యాహ్నం నుంచి చల్లబడిన వాతావరణం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం
రోడ్లన్నీ తడిసి ముత్తయిన పరిస్థితి.

విజయవాడ, ఆంధ్రప్రభ : గత కొన్ని రోజులుగా భానుడి తీవ్రతతో ఉక్కిరిబిక్కిరి అయిన బెజవాడకు అకస్మాత్తుగా ఉపశమనం లభించింది. 40 డిగ్రీల దాకా చేరువైన ఉష్ణోగ్రతలు నేడు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టగా, నగర వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఉదయమంతా ఎండలతో అల్లాడిన ప్రజలకు మధ్యాహ్నం కాస్త చల్లబడి సాయంత్రం వర్షం ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీచడం ప్రారంభమైంది.

అనంతరం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో నగర వాసులు ఎండ దెబ్బ నుంచి ఊరట పొందారు. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత కొనసాగినప్పటికీ, ఒక్కసారిగా మేఘాలు కమ్ముకోవడంతో వాతావరణం చల్లబడింది. వేడిగాలుల స్థానంలో చల్లని ఈదురుగాలులు వీచడం నగరంలో సరికొత్త వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో నగరంలోని ప్రధాన రహదారులు తడిసి ముద్దయ్యాయి.

కొన్ని ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత కొన్ని రోజులుగా 40 డిగ్రీలకు చేరువలో ఉన్న ఉష్ణోగ్రతలు వర్షం తర్వాత గణనీయంగా తగ్గాయి. చల్లటి వాతావరణం నెలకొనడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. వర్షం ఉపశమనం కలిగించినప్పటికీ, పిడుగులు, మెరుపుల సమయంలో బయట తిరగకూడదని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Reply