BREAKING: జమ్మూ కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి

శ్రీన‌గ‌ర్ : పహల్గాం ఉగ్రదాడుల అనంతరం భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఈ క్రమంలో పాక్‌ కేంద్రంగా పనిచేస్తున్న పలు తీవ్ర వాద స్థావరాలపై భారత్‌ మెరుపుదాడులు చేసింది. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. దేశంలోని సరిహద్దు రాష్ట్రాలపై పాకిస్థాన్‌ సైన్యం దాడులు చేస్తోంది. దీన్ని భారత సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటికే పలువురు సైనికులతో పాటు సామాన్యులు కూడా మరణించారు.

కాగా జమ్మూకాశ్మీర్‌లో పాకిస్థాన్‌ మూకలు జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ వీరమరణం పొందినట్లు సమాచారం అందింది. మృతిచెందిన జవాన్‌ ను మురళీ నాయక్‌గా గుర్తించారు. మురళీది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లా కల్లి తండా అని తెలుస్తోంది. రేపు మురళీనాయక్ మృతదేహాన్ని స్వస్థలానికి తరలించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

కాగా మురళీ నాయక్‌ స్వస్థలం సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన కల్లి తండా అయినప్పటికీ సోమందేపల్లి మండలం నాగినాయని చెర్వుతాండాలో పెరిగాడు. సోమందేపల్లిలోని విజ్ఞాన్ పాఠశాలలో చదివినట్లు స్థానికులు తెలిపారు. జవాన్‌ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మురళీనాయక్‌ మరణవార్త తెలిసిన స్థానికులు వీధుల్లో ఆయన ఫోటో పెట్టి నివాళులు అర్పిస్తున్నారు. అదే సమయంలో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినదాలు చేస్తున్నారు.

కాగా మురళినాయక్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. “దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ శాసనసభ నియోజకవర్గం, గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళి నాయక్ కు నివాళులు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.’ అంటూ ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *