Telecom | టెలికాం టెంపరితనం.. యూజర్లు గిజగిజ..

Telecom | టెలికాం టెంపరితనం.. యూజర్లు గిజగిజ..
- ప్లానుల్లో అన్నీ కోతలే
- జిత్తులమారి ప్లాన్లుతో కస్టమర్ల జేబులకు చిల్లు
- వామ్మో.. అంటున్న మొబైల్ బాబులు
ఆంధ్రప్రభ : టారిఫ్ పెరగకుండానే మొబైల్ బిల్లు సామాన్యుడి జేబుకు చిల్లుపెడ్తోంది. టెలికాం (Telecom ) రంగంలో కంపెనీల కొత్త వ్యూహాలతో యూజర్లు గిజగిజలాడుతున్నారు. దేశంలో మొబైల్, డేటా వినియోగం విపరీతంగా పెరగడంతో, టెలికాం కంపెనీలు తమ లాభాలను పెంచుకునేందుకు సరికొత్త రూట్లను వెతుకుతున్నాయి.
ప్రస్తుతం టెలికాం రంగంలో జియో అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత ఎయిర్ టెల్, వోడా ఫోన్ ఐడియా (Vi), ప్రభుత్వ రంగ సంస్థ BSNL ఉన్నాయి. ప్రత్యక్షంగా రీఛార్జ్ ధరలను పెంచితే వినియోగదారుల నుంచి వ్యతిరేకత వస్తుందని భావిస్తున్న సంస్థలు, పరోక్షంగా ప్లాన్లలో కోత విధిస్తున్నాయి.
Also read : తెలంగాణ మొత్తం అప్పు 4,42,297 కోట్లు..జియో, ఎయిర్‌టెల్ వంటి దిగ్గజ సంస్థలు తమ ప్లాన్ల జాబితా నుంచి తక్కువ ధరకే లభించే రీఛార్జ్ ప్లాన్లను తొలగిస్తున్నాయి. ముఖ్యంగా సామాన్యులు ఎక్కువగా వాడే రోజువారీ 1GB డేటా ప్లాన్లు ఇప్పుడు మాయమవుతున్నాయి. ఎయిర్‌టెల్ తన అత్యంత చవకైన రూ.189 ప్లాన్‌ను నిలిపివేసింది.
దీంతో, యూజర్లు అంతకంటే ఖరీదైన ప్లాన్లను తీసుకోవడం మినహా మరో దారి లేకుండా పోయింది. ఈ విషయంలో ప్రభుత్వ రంగ సంస్థ BSNL కూడా వెనకడుగు వేయలేదు. ధరలు మార్చకుండానే రీఛార్జ్ కాలపరిమితిని (Validity), డేటాను తగ్గించి తన ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5G సేవలు వేగంగా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నెట్‌వర్క్ అందించడానికి కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ ఖర్చును మళ్లీ వినియోగదారుల నుంచే వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. రాబోయే రోజుల్లో రోజువారీ 2GB డేటా అందించే ప్లాన్ల ధరలను పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. దీనివల్ల 5G అనుభవం కావాలనుకునే వారు తమ బడ్జెట్‌ను పెంచుకోవాల్సిందే.
ప్రతి యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని (ARPU) పెంచుకోవడమే ప్రస్తుతం టెలికాం సంస్థల ప్రధాన అజెండా. 2027 నాటికి ఎయిర్‌టెల్ వంటి సంస్థలు ఒక్కో యూజర్ నుంచి కనీసం రూ.300 వరకు రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అధికారికంగా ధరల పెంపు ప్రకటించనప్పటికీ, పాత ప్లాన్లను తీసివేయడం, ప్రయోజనాలను తగ్గిస్తున్నాయి టెలికాం సంస్థలు. దీంతో, కొత్త ఏడాదిలో మొబైల్ వినియోగదారులకు గట్టి షాక్ తగిలే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
