Telangana | సిరిసిల్ల నేతన్నల సమస్యలపై విజ్ఞప్తి

Telangana | సిరిసిల్ల నేతన్నల సమస్యలపై విజ్ఞప్తి
Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై ప్రభావం చూపుతున్న విద్యుత్ సంక్షోభం నుంచి నేతన్నలను కాపాడాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును కలసి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సిరిసిల్ల పవర్‌లూమ్ యూనిట్లపై ఉన్న విద్యుత్ బకాయిలు, సర్‌చార్జిల భారంపై సమగ్ర వినతి పత్రాన్ని సమర్పించి, వాటిని మాఫీ చేయాలని కోరారు.
గత ప్రభుత్వ కాలంలో 25 హెచ్‌పీ వరకు విద్యుత్ సబ్సిడీ పెరగడంతో పరిశ్రమ నిలదొక్కుకుందని, అయితే ప్రస్తుతం విద్యుత్ శాఖ అమలు చేస్తున్న బ్యాక్ బిల్లింగ్ విధానం కారణంగా వేలాది కుటుంబాల జీవనోపాధి ప్రమాదంలో పడిందని వివరించారు.

2016 నుంచి 2024 వరకు కాలానికి సంబంధించిన సుమారు 127 ఎస్‌ఎస్‌ఐ యూనిట్లపై రూ.19 కోట్ల బ్యాక్ బిల్లింగ్ విధించగా, సర్‌చార్జీలతో కలిపి అది రూ.38 కోట్లకు పెరిగిందని తెలిపారు. ఈ భారాన్ని భరించలేక అనేక యూనిట్లు మూతపడగా, ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల 13 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో మానవీయ దృష్టితో బకాయిలను రద్దు చేసి సిరిసిల్ల నేతన్నలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
