Telangana | వరిధాన్యం కొనుగోళ్లలో మనమే టాప్

Telangana | వరిధాన్యం కొనుగోళ్లలో మనమే టాప్
- 41.6 లక్షల టన్నుల వరిధాన్యం కొనుగోలు
- 48 గంటల్లోనే రూ.7,887 కోట్లు రైతుల ఖాతాల్లో జమ
- రాష్ట్ర నీటి పారుదల ఫౌరసరరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : వరి ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్ర నీటి పారుదల ఫౌరసరరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
ఈ ఖరీఫ్ సీజన్లో తెలంగాణ రాష్ట్రంలో 8,401 కొనుగోలు కేంద్రాల ద్వారా 7.5 లక్షల మంది రైతులకు చెందిన 41.6 లక్షల టన్నుల వరిధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారిక లెక్కలు చెపుతున్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా క్షేత్రస్థాయిలో 1.26 లక్షల మంది సిబ్బంది పని చేస్తున్నారని ఇందులో 45 శాతం ఐకేపి మహిళలే కావడం ఇది మహిళా సాధికారత పట్ల తెలంగాణ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని మంత్రి ఉత్తమ్ అన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన సన్నరకం వరికి రూ.314 కోట్ల బోనస్ డబ్బులు సంబంధిత రైతులకు చెల్లించినట్లు తెలిపారు.
గతంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో 11.2 లక్షల టన్నుల వరి కొనుగోలు చేసి 1.7 లక్షల రైతులకు రూ.2,830 కోట్లు మాత్రమే చెల్లించారని ప్రస్తుతం తెలంగాణ స్థాయి ఏపీ కంటే 4 రెట్లు ఎక్కువగా ఉందన్నారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని స్తానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులే గెలుస్తారని మంత్రి ఉత్తమ్ అన్నారు.
