Telangana | ఘనంగా నిర్మల్ ఉత్సవాలు..

Telangana | ఘనంగా నిర్మల్ ఉత్సవాలు..
Telangana, నిర్మల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పే వేదికగా నిర్మల్ ఉత్సవాలు సోమవారం వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. నిర్మల్ జిల్లా చరిత్రను, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రజలకు పరిచయం చేసే ఉద్దేశంతో ఈ ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమని జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం రాత్రి నిర్వహించిన నిర్మల్ ఉత్సవాల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రికి గుస్సాడి నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్ని స్టాళ్లను సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిర్మల్ ఉత్సవాల పేరిట ఎంతో గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, వినూత్నంగా ఏర్పాటు చేసిన సమాచారాత్మక స్టాళ్లు ఆకట్టుకుంటున్నాయని అన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణలో పాల్గొన్న అధికారులకు, ప్రజలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా జిల్లా సంస్కృతి, చరిత్ర వెలుగులోకి రావడంతో పాటు పర్యాటక ప్రాంతాల పై అవగాహన పెరిగి, పర్యాటక అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. నిర్మల్ ఉత్సవాలు పేరిట గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్‌కు, అధికారులకు అభినందనలు తెలిపారు.
నిర్మల్ జిల్లా చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పేందుకే నిర్మల్ ఉత్సవాలు..
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ.. ఘనమైన చరిత్ర కలిగిన నిర్మల్ జిల్లా విశేషాలు, సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు చేసుకునేందుకు ఈ ప్రత్యేకమైన నిర్మల్ ఉత్సవాలను ప్రారంభించామని తెలిపారు. నేటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించబడతాయని తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉత్సవాలు కొనసాగుతాయని, సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. గత సంవత్సరం అధికారుల సమన్వయం, ప్రజల భాగస్వామ్యంతో ఉత్సవాలు విజయవంతమయ్యాయని, ఈ సంవత్సరం మరింత ఉత్సాహంతో రెట్టించిన కార్యక్రమాలతో విజయవంతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ జానకి షర్మిల, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఏఎస్పీ సాయికిరణ్, ఆర్డీఓ రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

