- అందుకు సిద్ధమవుతున్న ప్రణాళికలు
- విద్యుత్ ఉద్యోగులకు రెండు శాతం డీఏ పెంపు
- 71,417 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం
- ప్రతి నెలా రూ.11.193 కోట్లు ప్రభుత్వంపై భారం
- భవిష్యత్తు సవాళ్లకు సిద్ధం కావాలి
- డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రం విద్యుత్ రంగంలో దేశానికి దిక్సూచి కావాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళుతోందని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka Mallu) అన్నారు. ప్రజాభవన్‌లో శనివారం విద్యుత్ ఉద్యోగులకు డీఏ ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
ఉద్యోగుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, ఇందులో భాగంగా విద్యుత్ ఉద్యోగులు (Electricity employees), పెన్షనర్లకు 1.944 శాతానికి డీఏని పెంచినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గొప్ప మనసుతో తీసుకున్న నిర్ణయం ఫలితంగా రాష్ట్రంలోని 71,417 ఇది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
16.018% శాతానికి చేరిన డీఏ
భట్టి విక్రమార్క మాట్లాడుతూ…. ఈ పెంచిన డిఎ విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్ల (Pensioners) తో పాటు ఆర్టిజన్స్ కు వర్తిస్తుందని అన్నారు. గతంలో 14.074% గా ఉన్న డీఏ ను 16.018% శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పెంచిన డిఎ ఈ సంవత్సరం జనవరి నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. పెంచిన డీఏతో విద్యుత్ సంస్థపై ప్రతి నెల 11.193 కోట్ల రూపాయల భారం పడుతుందని చెప్పారు. అయినా ఉద్యోగుల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
రెండు వేల మెగావాట్ల డిమాండ్ అదనంగా పెరిగింది
భట్టి విక్రమార్క మాట్లాడుతూ మనిషి జీవించడానికి గాలి ఎంత అవసరమో పోటీ ప్రపంచంలో ప్రతి ఉత్పత్తికి విద్యుత్తు అనివార్యమైందన్నారు. 2023 మార్చిలో 15 వేల మెగావాట్ల పీక్ డిమాండ్ రాగా, 2025 మార్చిలో 17,162 మెగావాట్ల పీక్ డిమాండ్ వచ్చిందన్నారు. గత ప్రభుత్వ కాలంతో పోలిస్తే అదనంగా 2000 మెగావాట్ల విద్యుత్ (Electricity) డిమాండ్ వచ్చింది. అయినప్పటికీ ప్రభుత్వం, విద్యుత్ ఉద్యోగులు ఓ కుటుంబం మాదిరిగా శ్రమించి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా, నాణ్యమైన విద్యుత్ సరఫరాను చేస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో విద్యుత్ డిమాండ్ తీవ్రంగా పెరగనుందని అన్నారు.
మరో ఐదేళ్లలో 26,299 మెగావాట్ల విద్యుత్ డిమాండ్
రాష్ట్రంలో 2029-30 నాటికి 26,299 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడ నుందని భట్టి అంచనా వేశారు. 2034-35 నాటికి 33, 773 మెగావాట్ల డిమాండ్ ఏర్పడుతుందని కేంద్ర ప్రభుత్వ సంస్థ (central government agency) నివేదిక ఇచ్చిందని వివరించారు. భవిష్యత్తు డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తికి ఇప్పటి నుంచే రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు సిద్ధం చేసుకుని ముందుకు పోతుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యూ గ్రీన్ ఎనర్జీ పాలసీ-2025 తీసుకువచ్చి 2029-30 నాటికి 20వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని తెలిపారు.
భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిబ్బంది సంసిద్ధంగా ఉండాలని, ప్రభుత్వం, విద్యుత్ ఉద్యోగులు ఒక ఆదర్శ కుటుంబం అని డిప్యూటీ సీఎం (Deputy CM) అభివర్ణించారు. కార్యక్రమంలో జెన్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు రత్నాకర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు శివాజీ, 1104 యూనియన్ నేత సాయిబాబా, 327 యూనియన్ నాయకులు శ్రీధర్ , పవర్ డిప్లమా ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకుడు బేసిరెడ్డి, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ నాయకుడు శ్యామ్ మనోహర్, 1535 యూనియన్ నాయకులు వజీర్, పెన్షనర్స్ అసోసియేషన్ నాయకుడు సత్యనారాయణ, టీఆర్‌వీకేఎస్ యూనియన్ నాయకులు కరెంటు రావు తదితరులు పాల్గొన్నారు.