Telangana | రసవత్తరంగా భీంగల్ పుర పోరు..

Telangana | రసవత్తరంగా భీంగల్ పుర పోరు..

అభివృద్ధి పేరుతో ప్రతిపక్షం, సంక్షేమం పేరుతో పాలక పక్షం

కాంగ్రెస్ నుంచి నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్యాల సునిల్ కుమార్, కార్పొరేషన్ చైర్మన్లు ఈరవత్రి అనిల్, మానాల మోహన్ రెడ్డి త్రిముఖ వ్యూహంతో ముందుకు,
నియోజకవర్గంలో అచ్చి వచ్చిన భీమ్ గల్ పట్టణంలో అభివృద్ధి మంత్రంతో ఇక్కడే తిష్ట వేసి ఒంటరి పోరు జరుపుతున్న ఎమ్మెల్యే వేముల

Telangana | భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ : భీంగల్ మున్సిపల్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. పట్టణంలో వంద పడకల ఆసుపత్రి మంజూరు చేయడం, సమీకృత మార్కెట్ మంజూరు, ప్రధాన రోడ్లు, సీసీ రోడ్లు, సెంట్రల్ లైటింగ్ వంటి అభివృద్ధి పనులతో జనంలో తమపైనే అభిమానం ఉందని నమ్ముతూ, అచ్చి వచ్చిన భీమ్గల్ పట్టణం లో మళ్లీ మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని టిఆర్ఎస్ పార్టీ కే కైవసం చేసుకోవాలని మాజీమంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇక్కడే ఉంటూ ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.

Telangana

ఇంటింటికి రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు, అమృత్ పథకం ఉచిత గృహ విద్యుత్, గ్యాస్ సబ్సిడీ ఉచిత బస్ వంటి సంక్షేమ పథకాల పేరుతో పాలకపక్షం నుంచి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునిల్ కుమార్ తో పాటు రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, సొసైటీ యూనియన్ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి లు స్థానికంగా ఉంటూ ఎలాగైనా భీంగల్ పురపాలిక పై తమ పార్టీ ప్రతినిధిని చైర్మన్ గా గెలిపించుకోవాలని త్రిముఖ వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. వీరికి మద్దతుగా ఏకంగా రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సైతం ఇక్కడికి వచ్చి ప్రచారంలో పాల్గొనడం విశేషం. తాము చేసిన అభివృద్ధి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తుందని ప్రతిపక్ష ఎమ్మెల్యే వేముల నమ్ముతున్నారు. తాము అందిస్తున్న సంక్షేమ పథకాలు తమల్ని ఒడ్డుకు చేరుస్తాయని పాలకపక్షం నమ్ముతోంది.

ఆసక్తి రేపుతున్న బీజేపీ పోరు

ఈ మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి తరఫున మొత్తం 12 స్థానాల్లో 12 మంది బిజెపి అభ్యర్థులు కౌన్సిలర్ గా బరిలో ఉండడం ఆసక్తిని రేపుతోంది. బాల్కొండ నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి తన అనుచర గణంతో తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు హిందుత్వ ఎజెండా పేరుతో గల్లి గల్లి తిరుగుతున్నారు.
దీంతో కొన్నిచోట్ల త్రిముక పోరు ఉన్నట్లు అనిపిస్తుండగా మరికొన్ని చోట్ల బీజేపీ అభ్యర్థులు ఎవరి ఓట్లకు గండి కొడతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

అంతు పట్టని జనం నాడి

ఇదిలా ఉండగా జనం నాడి ఎంతకు అంతు పట్టడం లేదు.
పార్టీలు చూపే తాయిలాలకు ఆకర్షితులై స్థానికులు మూడు పార్టీల సమావేశాలకు హాజరవుతూ మూడు పార్టీల ప్రచార కార్యక్రమాల్లో కనిపిస్తూ ఉండడంతో విశ్లేషకులకు గందరగోళ పరిస్థితి నెలకొంది.
అన్ని పార్టీలు విందు వినోదాలతో, కుల సంఘాల సమావేశాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాయి.

బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ కీలకం

అయితే ప్రతీసారి బాల్కొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎన్నికల్లో భీంగల్ ఓటర్లె కీలకంగా నిలిచారు. ముఖ్యంగా గత రెండు ఎన్నికల్లో భీంగల్ మండలం తో పాటు పట్టణ ఓటర్లు ఏకపక్షంగా వేముల ప్రశాంత్ రెడ్డి వెంటనే నిలిచారు. దీంతో ఇప్పుడు కూడా ఓటర్లు టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తారని ధీమాతో ఆయన ఉన్నారు. ఎప్పుడు మూడు వర్గాలుగా కనిపించే కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ నాయకులు ముత్యాల సునీల్ కుమార్ ఈరవత్రి అనిల్ మానాల మోహన్ రెడ్డి లు ఏకతాటిపై ఉండి ప్రచారం సాగిస్తుండడం, సంక్షేమ పథకాలు ఆకర్షణీయంగా ఉండడంతో తమ అభ్యర్థులను గెలిపిస్తాయని కాంగ్రెస్ నాయకులు నమ్ముతున్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలు హిందుత్వం ఎజెండా తమను గట్టెక్కిస్తాయని బీజేపీ నేతలు లెక్కలు వేస్తున్నారు.

మరో రెండు రోజుల్లో ఓటర్ నిర్ణయం

ఈనెల 11వ తేదీన పోలింగ్ ఉండడంతో మరో రెండు రోజుల్లో ఓటరు తన నిర్ణయాన్ని వెల్లడించే సమయం ఆసన్నమైంది. 11వ తేదీన ఓటరు తమ ఓటు హక్కు నమోదు చేసుకోగా 13వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆరోజు సాయంత్రానికల్లా ఫలితం తేలనుంది. అంతవరకు ఈ ఉత్కంఠతో భీంగల్ పురపోరు రసవత్తరంగా కొనసాగనుంది.

Leave a Reply