తలసరి ఆదాయాన్ని పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించాలి

తలసరి ఆదాయాన్ని పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించాలి
జిల్లాలో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు (SDG), KPIలలో మరింత పురోగతి చూపించాలి
ప్రభుత్వ శాఖలు మంచి సేవలందించాలి
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు ప్రతినిధి. ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో తలసరి ఆదాయాన్ని పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, జీడీడీపీ మరియు జిల్లా కీలక పనితీరు సూచికలకు సంబంధించి వ్యవసాయ అనుబంధ శాఖలు, రవాణా, ఐసిడిఎస్, సంక్షేమం, టూరిజం, ఆర్టీసీ, పరిశ్రమలు, ఆర్ డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్, రోడ్లు భవనాలు తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తలసరి ఆదాయం పెంచే దిశగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ స్పష్టమైన ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా లక్ష్యాలు కేటాయించుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. జిల్లాలో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు (SDG), KPI లలో మంచి పురోగతి ఉన్నప్పటికీ ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు.

సాగునీటి ప్రాజెక్టుల ద్వారా సాగుభూమి విస్తీర్ణాన్ని పెంచి రైతుల ఆదాయాన్ని మెరుగుపరచేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే వ్యవసాయ అనుబంధ శాఖలు, పరిశ్రమలు, టూరిజం తదితర శాఖల ద్వారా తలసరి ఆదాయాన్ని పెంచే విధంగా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి శాఖలోని ముఖ్య అంశాలు, బడ్జెట్ వివరాలు, ఆన్‌లైన్ సేవలు అన్నీ క్లుప్తంగా (at a glance) నివేదిక ను తయారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. టీనేజీ ప్రెగ్నెన్సీ కి సంబంధించి లక్ష్యాలు సాధించే విధంగా కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలన్నారు.
పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ అంశంలో వెనుకబడి ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు.ప్రభుత్వ శాఖలు మంచి సేవలందించాలన్నారు. జిల్లాలో హాస్టళ్ల నిర్వహణ, ఐసిడిఎస్, వైద్య ఆరోగ్య శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తిగా ఉన్నారని, ఆయా శాఖల అధికారులు ప్రజలకు మంచి సేవలందించి శాఖల పనితీరును మెరుగుపరచుకోవాలన్నారు. జిల్లాలో టీనేజ్ ప్రెగ్నెన్సీ లను నియంత్రించేందుకు ఐసిడిఎస్ పీడీ మరియు డీఎంహెచ్ఓలు కలిసి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు.
పబ్లిక్ పర్సెప్షన్‌లో నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ వస్తున్న శాఖల అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. హాస్టళ్లను, పాఠశాలలను ఎంపిడిఓలు వారానికి ఒక్కసారి తనిఖీ చేసి ఫోటో లను పంపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.కింది స్థాయి సిబ్బంది క్షేత్ర స్థాయి సందర్శనలకు వెళ్లినపుడు ప్రజలతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని కలెక్టర్ సూచించారు.
ప్రజలకు మంచి సేవలందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యమని, ఆ దిశగా అన్ని శాఖల అధికారులు పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో సీపీఓ భారతి, డీఎంహెచ్ఓ డా. భాస్కర్ రాజు, హౌసింగ్ పిడి చిరంజీవి, జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, డి ఈ ఓ సుధాకర్, డి పి ఓ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
