Tech Shankar | 37 ఏళ్ల అజ్ఞాతం.. అడవిలోనే అంతం

Tech Shankar | 37 ఏళ్ల అజ్ఞాతం.. అడవిలోనే అంతం

  • ఉద్దానం విప్లవ కెరటం
  • సిక్కోలు బిడ్డ మెట్టూరు జోగారావు
  • మిలటరీ టెక్నాలజీలో దిట్ట
  • ఉద్దానం లో విషాదం

పలాస / వజ్రపుకొత్తూరు ఆంధ్రప్రభ : సొంతూరికి దూరంగా దాదాపు నాలుగు దశాబ్దాల అజ్ఞాత వాసం అడవిలోనే ముగిసిపోయింది. తుపాకీ గొట్టం ద్వారా సమాజ స్థాపన జరుగుతుందని అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన జీవితం ఆ తుపాకీ గుళ్లకే బలైపోయింది.

బాతుపురం లో పుట్టిన ఆయన.. చిన్నతనం నుంచి చురుకుగా ఉంటూ ఉద్దాన ప్రాంతంలోని సమస్యలపై, ప్రజలు ఎదుర్కొంటున్న బాధలను చూసి, ప్రభుత్వాలపై నమ్మకం లేక, అప్పటి పాలకులు పై ఉన్న అక్రోశం తో పీపుల్స్ వార్ పార్టీ లోకి వెళ్లి….. ఆపై అడవిలో అన్నగా మారిన మెట్టూరు జోగారావు అలియాస్ టెక శంకర్ (Tech Shankar) అలియాస్ బాబు అలియాస్ రఘు అలియాస్ శివ ప్రస్థానం ముగిసిపోయింది.

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి లో జరిగిన ఎన్కౌంటర్ లో హతమయ్యారు. ఈ ఘటనతో ఉద్దానం ఉలిక్కిపడింది.

మావోయిస్టు పార్టీ స్పెషల్ జోన్ కమిటీ సభ్యునిగా, మిలిటరీ ఆపరేషన్లలో టెక్నికల్ విభాగం లో భాద్యతలు నిర్వహిస్తున్న మెట్టూరు జోగారావు అలియాస్ టెక్ శంకర్ అలియాస్ రఘు అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందారు.

ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామం. సాధారణ రజక కుటుంబంలో జన్మించిన ఆయన 37 సంవత్సరాలుగా విప్లవోద్యమంలో అజ్ఞాత జీవితం గడుపుతున్నారు. కామయ్య, చిన్నపిల్లమ్మ దంపతులకు ఆరుగురు సంతానం కాగా నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

తండ్రి కామయ్య జోగారావు చిన్నతనంలోనే చనిపోగా, తల్లి ఇటీవలే అనారోగ్యం కారణంగా మృతి చెందింది. మూడో సంతానంగా జోగారావు బాతుపురం లోనే ప్రాథమిక విద్యను ప్రభుత్వ పాఠశాలలో పూర్తిచేసి, ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు పక్క గ్రామమైన అక్కుపల్లిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు.

చిన్నతనం నుంచే చురుకుగా ఉండే జోగారావు గ్రామంలో పీపుల్స్ వార్ పార్టీ సమావేశాలకు, కార్యక్రమాలకు ఆకర్షితుడై 1988 లో ఊరు నుండి విప్లవోద్యంలోకి వెళ్లారు. 37 ఏళ్ల అజ్ఞాత జీవితాన్ని అడవి లోనే గడిపి అడవిలోనే ఊపిరి వదిలేశారు.

స్థానిక ఘటనల్లో జోగారావు పాత్ర

1988 లో పీపుల్స్ వార్ పార్టీలోకి అజ్ఞాతంలోకి వెళ్లిన పలాస పరిసర ప్రాంతాల్లో అనేక ఘటనల్లో పాల్గొన్నారు. 1990-91 ప్రాంతంలో సమ్మదేవి రైల్వే స్టేషన్ వద్ద ఇంజిన్ దగ్ధం, హరిశంకర్ థియేటర్ పేల్చివేత, దేవంగత మాజీ ఎంపీ డాక్టర్ కణితి విశ్వనాధం సాల్ట్ ఫ్యాక్టరీ పేల్చివేత వంటి వంటి ఘటనల్లో జోగారావు కీలకపాత్ర పోషించారని స్థానికులు చెబుతున్నారు.

విషాదం లో ఉద్దానం గ్రామాలు :

భారత విప్లవోద్యమానికి ఎంతోమంది వీరులను అందించిన ఉద్దానం తల్లి అందరినీ కోల్పోయి, ఆ ఉద్యమంలో ఇంకా ఇద్దరు విప్లవ వీరులుగా ఉద్దానం వారసత్వాన్ని ఉద్యమంలో అందిస్తున్నారనే సంతృప్తితో ఉన్న ఉద్దాన గ్రామాలకు మెట్టూరు జోగారావు అను ఒక విప్లవ ధ్రువతార రాలిపోయింది అనే వార్త ఉద్దానం గ్రామాల్లోను, అక్కడ ప్రజల్లో విషాద ఛాయిలు నెలకొన్నాయి.

సిపిఎం నుండి 1968 లో వేర్పాటు అయిన సిపిఎంఎల్ వేర్పాటు అయినప్పటినుండి 1980 పీపుల్స్ వార్..నేటిమావోయిస్టు పార్టీ వరకు ఎన్ని ఒడిదుడుకులు వచ్చిన, పోలీసుల బూట్లు శబ్దాలు, నిర్భందాలు, రక్తపు టెర్లు పారిన ఉద్దానం ఆ మట్టి నేటికీ ప్రశ్నించే తత్వాన్ని నేర్పిస్తూనే ఉంది.

కుటుంబం ఎదురు చూపులు :

మారేడుమిల్లి సమీపంలో జియమ్మ వలసలో బుధవారం ఉదయం 6.30-7 గంటల సమయంలో పోలీసులు- మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్ట్ పార్టీ అగ్రనేత అలియాస్ మెట్టూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్ తో పాటు.. నంబాల కేశవరావు గార్డ్ కమాండర్ జ్యోతి అలియాస్ సరిత, ఏసీఎంలు సురేష్ అలియాస్ రమేష్, లోకేష్ అలియాస్ గణేష్, సాయిను అలియాస్ వాసు, అనిత, షమ్మిలు ఉన్నట్లు పోలీసులు వర్గాలు చెవుతున్నారంటూ వార్తలు రావడంతో జోగారావు కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

పోలీసులు, ప్రభుత్వం మానవత హృదయంతో గ్రామంలో అంత్యక్రియలు చేసుకునేందుకు జోగారావు మృద్దేహాన్ని కుటుంబీకులకు ఇవ్వాలని అమరవీరులు బంధుమిత్రుల కమిటీ సభ్యులు జోగి కోదండరాం, పోతనపల్లి అరుణ, పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు పత్రి దానేష్, యు డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకలు మాధవరావు తదితరులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply