పాఠశాల ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే వసంత..

పాఠశాల ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే వసంత..
మధ్యాహ్న భోజన పథకంపై క్షేత్రస్థాయి పరిశీలన
నాణ్యత, పరిశుభ్రతపై సూచనలు..

జి కొండూరు, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే వసంత కృష్ణా Prasad ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన, క్షేత్రస్థాయిలో అమలు తీరును నిశితంగా పరిశీలించారు. పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బందితో కలిసి వంటగదిని పరిశీలించిన ఎమ్మెల్యే, భోజన తయారీ విధానం, పరిశుభ్రత పరిస్థితులను స్వయంగా తనిఖీ చేశారు.
అనంతరం మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన రికార్డులను పరిశీలించి, వాటి నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేసిన ఎమ్మెల్యే, ఆహారాన్ని స్వయంగా రుచి చూశారు. “రోజూ భోజనం బాగుంటుందా? మెనూ ప్రకారం సరిపడా అన్నం ఇస్తున్నారా?” అని విద్యార్థులను ప్రశ్నించగా, ప్రతిరోజూ భోజనం బాగానే ఉంటుందని విద్యార్థులు సమాధానమిచ్చారు. అయితే కూరలో ఉప్పు కాస్త ఎక్కువగా ఉందని గుర్తించిన ఎమ్మెల్యే, రుచి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని వంట నిర్వాహకులకు సూచించారు.
ఇకపై పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని నిర్వాహకులు తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థులకు రుచికరమైన, శుచికరమైన ఆహారం అందించడంలో ఎలాంటి అలసత్వం వహించవద్దని అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే టీవీలు, సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని విద్యార్థులకు హితబోధ చేశారు. భోజనశాల, క్రీడా మైదానం అభివృద్ధికి హామీ ఇచ్చిన ఎమ్మెల్యే, క్రీడా సామగ్రిని కూడా పరిశీలించారు. పాఠశాల ఆవరణను పూర్తిగా పరిశుభ్రంగా ఉంచాలని సూచనలు జారీ చేశారు. మరో వారం రోజుల్లో మళ్లీ తనిఖీ నిర్వహించి, పాఠశాల సమగ్రాభివృద్ధికి సమన్వయంతో కృషి చేస్తామని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు.
