AP | నగర, పట్టణ కార్పొరేషన్ ఉప ఎన్నికల్లో టీడీపీ హవా
- హిందుపూర్ మున్సిపల్ పీఠం కైవసం
- ఏలూరు, నెల్లూరు, బుచ్చిరెడ్డి పాలెం, పాలకొండలోనూ పాగా
- తిరుపతి, పిడుగురాళ్ల, నందిగామ ఎన్నికలు వాయిదా
వెలగపూడి – రాష్ట్రవ్యాప్తంగా పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో జరిగిన ఉప ఎన్నికలలో టీడీపీ ఘన విజయం సాధించింది. మొత్తం 10 పురపాలికలలో నేడే ఏడు చోట్ల ఎన్నికలు నిర్వహించారు. ఈ ఏడింటిని తెలుగుదేశం కైవసం చేసుకుంది. హిందూపురం, పాలకొండ చైర్మన్ పోస్ట్ లు, బుచ్చిరెడ్డిపాలెం, తుని, పిడుగురాళ్ల, ఏలూరు, నూజీవీడులోని వైస్ ఛైర్మన్ పదవులను దక్కించుకుంది. మూడు చోట్ల కోరం లేకపోవడంతో ఎన్నికలు రేపటి వాయిదా వేసింది.
ఏలూరులో రెండు పోస్ట్ లు టీడీపీకే ..
ఏలూరు కార్పొరేషన్‌లో ఇద్దరు డిప్యూటీ మేయర్ల ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. మొత్తం 50మంది కార్పొరేటర్లకు గాను, 30మంది టీడీపీ కార్పొరేటర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కూడా హాజరయ్యారు. ఈ ఎన్నికల్లో 30వ డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావు తొలి డిప్యూటీ మేయర్‌గా, 47వ డివిజన్ కార్పొరేటర్ వందనాల దుర్గాభవాని రెండో డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైసీపీ కార్పొరేటర్లు ఈ ఎన్నికలకు దూరంగా ఉండటంతో ఈ ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయింది. డిప్యూటీ మేయర్ ఎన్నికలో టీడీపీ అభ్యర్థులు ఒప్పందంతోనే ముందుకు రావడంతో ఏకగ్రీవ విజయం సాధించారు. ఈ ఫలితంతో ఏలూరు కార్పొరేషన్‌లో టీడీపీ మరింత బలపడిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
హిందూపురం మున్సిపల్ పీఠం టీడీపీ కైవసం
హిందూపురం మున్సిపల్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. ఆరో వార్డు కౌన్సిలర్ రమేశ్ కుమార్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. చేతులెత్తే విధానంలో ఎన్నిక నిర్వహించారు. ఎన్డీఏ కూటమికి ఎంపీ, ఎమ్మెల్యే ఓటుతో కలిపి 23మంది బలం ఉండటంతో మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని టీడీపీ దక్కించుకుంది. ఈరోజు నిర్వహించిన ఓటింగ్ లో టీడీపీకి అనుకూలంగా 23ఓట్లు వైసీపీ అభ్యర్థి వెంకటలక్ష్మికి 14ఓట్లు పడ్డాయి. ఓటింగ్ లో ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎంపీ పార్థసారథి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేశ్ ను హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ అభినందించారు. రమేష్ ను ఛైర్మన్ సీట్లో బాలయ్య కూర్చోబెట్టారు. ఆరు నెలల క్రితం వైసీపీ ఛైర్పర్సన్ ఇంద్రజ రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది.
నెల్లూరు డిప్యూటీ మేయర్ కూడా …
నెల్లూరు డిప్యూటీ మేయర్ టీడీపీ మద్దతు అభ్యర్థి తహసీన్ ఎన్నికయ్యారు. 29 ఓట్ల మెజారిటీతో ఆమె ఎన్నికయ్యారు. ఆమె 41 ఓట్లు, వైకాపా అభ్యర్థి కరీముల్లాకు 12 ఓట్లు వచ్చాయి. తహసీన్ గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. ఆమెకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి నారాయణ ఆలోచనతో మైనార్టీ అభ్యర్థిని పెట్టారని.. తాను బలపరిచినట్లు చెప్పారు. తహసీన్ ఎన్నికకు సహకరించిన కార్పొరేటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఎంపీ, మంత్రి ఆలోచనలను తెదేపా అదిష్టానం ఆమోదించిందన్నారు. ఈ గెలుపుతో నెల్లూరు నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ కు బహుమానం ఇచ్చామని పేర్కొన్నారు.
బుచ్చిరెడ్డిపాలెంలో…
నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ వైస్ చైర్మన్లుగా తెదేపా మద్దతు అభ్యర్ధులు ఎన్నికయ్యారు. మొదటి వైస్ చైర్మన్ గా 8వ వార్డుకు చెందిన ఎరటపల్లి శివకుమార్ రెడ్డి, రెండో వైస్వర్మన్ గా 8వ వార్డుకు చెందిన పటాన్ నస్తిన్ ఎన్నికయ్యారు. ఇక తుని, నూజీవీడు, పిడుగురాళ్ల వైస్ ఛైర్మన్ పోస్ట్ లు కూడా టీడీపీ ఖాతాలోనే పడ్డాయి.
తిరుపతి, పిడుగురాళ్ల, నందిగామలో ఎన్నిక వాయిదా…
తిరుపతి నగరపాలక డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేక వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. సభ నిర్వహణకు అవసరమైన సభ్యులు రాకపోవడంతో ఈమేరకు నిర్ణయించారు. పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కౌన్సిల్ సమావేశానికి వైకాపా కౌన్సిలర్లు రాకపోవడంతో ఎన్నికను ఆర్డీవో రేపటికి వాయిదా వేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేనందున ఎన్నికను అధికారులు వాయిదా వేశారు.