TDP State Spokesperson | కోటి సంతకాల పేరిట మరో స్కాం

TDP State Spokesperson | కోటి సంతకాల పేరిట మరో స్కాం

  • పీపీపీ విధానంపై జగన్ జగన్నాటకం
  • టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్

TDP State Spokesperson | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన కోటి సంతకాల సేకరణ మరో పెద్ద స్కాం అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర గవర్నర్‌కు దొంగ సంతకాల మూటలను సమర్పించడం ద్వారా జగన్ మరోసారి తన అసలైన రాజకీయ స్వరూపాన్ని బయటపెట్టారని విమ‌ర్శించారు.

శుక్రవారం చిత్తూరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సురేంద్ర కుమార్ మాట్లాడుతూ, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాల స్కాంలకు పాల్పడిన జగన్, అధికారం కోల్పోయిన తర్వాత కూడా కోటి సంతకాల పేరుతో మరో స్కాంకు తెరలేపారని విమర్శించారు. మెడికల్ కళాశాలల్లో పీపీపీ విధానంపై ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు జగన్మోహన్ రెడ్డి జగన్నాటకం ఆడుతున్నారని అన్నారు.

వైద్య కళాశాలలు, ఆస్పత్రుల నిర్మాణం, నిర్వహణకు పీపీపీ విధానం ఉత్తమమని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన పార్లమెంటరీ స్థాయి సంఘంలో వైసీపీ ఎంపీ గురుమూర్తి సభ్యుడిగా ఉన్నారని గుర్తు చేశారు. ఆ నివేదికలో పీపీపీ విధానానికి మద్దతుగా గురుమూర్తి సంతకం చేశారని తెలిపారు. జగన్ అనుమతి లేకుండానే ఆయన సంతకం చేశారా అని ప్రశ్నించారు. అక్కడ మద్దతు ఇస్తూ, ఇక్కడ దొంగ సంతకాలతో ప్రజలను మోసం చేయడం దుర్మార్గమైన రాజకీయమని ఆరోపించారు.

అధికారం పోయినా బెదిరింపుల రాజకీయాలు మానలేదని, పిపిపి విధానంలో మెడికల్ కళాశాలల నిర్వహణ చేపట్టే వారిని మేము అధికారంలోకి వస్తే రెండు నెలల్లో జైళ్లలో పెడతామని జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తున్నారని అన్నారు. పిపిపి విధానానికి పార్లమెంటరీ స్థాయి సంఘం, కేంద్ర ప్రభుత్వం, నేషనల్ మెడికల్ కమిషన్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, గౌరవ ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తులు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. మరి వారందరినీ కూడా జైళ్లలో పెడతారా అని ప్రశ్నించారు. పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదికపై సంతకం చేసిన మీ ఎంపీ గురుమూర్తినీ జైలుకు పంపుతారా అని ఎద్దేవా చేశారు.

పీపీపీ విధానం ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న ఉత్తమ విధానమని, ఇందులో మెడికల్ కళాశాలలు, ఆస్పత్రుల నిర్వహణ మాత్రమే ప్రైవేట్ సంస్థలు చేస్తాయని, అవి ప్రభుత్వ ఆస్తులుగానే ఉండి ప్రభుత్వ నియంత్రణలోనే పనిచేస్తాయని వివరించారు. పీపీపీ విధానంలో 50 శాతం సీట్లు ప్రభుత్వ కోటాలోనే భర్తీ అవుతాయని తెలిపారు. జగన్ పాలనలో మాత్రం కేవలం 42 శాతం సీట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేవని గుర్తు చేశారు.

పీపీపీ విధానంలో 70 శాతం ఇన్‌పేషెంట్లకు, 100 శాతం అవుట్ పేషెంట్లకు ఎన్టీఆర్ వైద్య సేవల ప్రకారమే ఉచిత వైద్యం అందుతుందని తెలిపారు. పేదలకు నాణ్యమైన వైద్యం, వైద్య విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం ఇష్టంలేకనే జగన్‌మోహన్ రెడ్డి ఈ విధానానికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు.

జగన్ పాలనలో వైద్య కళాశాలల నిర్మాణం పేరుతో సుమారు 8,500 కోట్ల రూపాయల కాంట్రాక్టులను తనవారికే కట్టబెట్టారని, ముడుపుల రూపంలో కోట్ల రూపాయలు దండుకోవడానికి స్కెచ్ వేశారని ఆరోపించారు. ఇప్పుడు పీపీపీ విధానం అమలులోకి వస్తుండటంతో ఆ లాభాలు చేజారుతున్నాయనే భయంతో ఈ రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. వాస్తవాలను ప్రజలు గ్రహించాలని, పేదలకు, విద్యార్థులకు మేలు చేసే పీపీపీ విధానానికి మద్దతు ఇచ్చి ప్రోత్సహించాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply