T20 World Cup | నేడు జింబాబ్వేతో భార‌త్ ఢీ

T20 World Cup | నేడు జింబాబ్వేతో భార‌త్ ఢీ

  • చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో మ్యాచ్‌
  • రాత్రి 7గంట‌ల‌కు ఆరంభం

T20 World Cup | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకూ డూఆర్ డైగా మారింది. సూపర్-8 దశలో ద‌క్షిణాఫ్రికా చేతిలో ఓడిపోవ‌డంతో మిగిలిన రెండు మ్యాచులు త‌ప్ప‌క గెల‌వాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో ఇవాళ గురువారం జింబాబ్వేను భార‌త్ ఢీకొట్ట‌నుంది. చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియం రాత్రి 7 గంట‌ల‌కు ఈ కీలక మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తోంది. సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే టీమిండియా ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలవడం అత్యవసరం.

దక్షిణాఫ్రికాతో బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమైన వాషింగ్టన్ సుందర్ స్థానంలో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ జట్టులోకి రానున్నాడు. జింబాబ్వే టాప్ ఆర్డర్‌లోని ఏడుగురిలో ఐదుగురు రైట్ హ్యాండ్ బ్యాటర్లు కావడంతో ఆఫ్ స్పిన్నర్ అవసరం అంతగా ఉండకపోవచ్చు. కాబట్టి అక్షర్ పటేల్ రీఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. వ‌రుస‌గా విఫలమవుతున్న రింకూ స్థానంలో బౌల‌ర్‌కు అవ‌కాశం ఇవ్వ‌వ‌చ్చు. అతని స్థానంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ జట్టులోకి రావచ్చు… లేదంటే పేసర్ మహ్మద్ సిరాజ్ కు అవకాశం కల్పించవచ్చు.

అలాగే తిలక్ వర్మకు త‌న స్థాయికి త‌గ్గ‌ట్లు ఆడ‌టం లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో మూడో స్థానంలో సంజూ శాంసన్ జట్టులోకి తీసుకురావొచ్చు. సంజూను మూడో నంబర్‌లో లేదా ఓపెనర్‌గా ఆడించవచ్చు. అతను ఓపెనింగ్ చేస్తే ఇషాన్ కిషన్ మూడో స్థానంలోకి వస్తాడు. ప్రత్యర్థుల ఆఫ్ స్పిన్ ఉచ్చును సంజూతో ఛేదించవచ్చని భారత్ ఆశిస్తోంది. చెన్నై చిదంబరం స్టేడియం పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. జింబాబ్వేపై వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌తో దాడి చేయాల‌ని టీమిండియా యోచిస్తోంది. అంతేకాదు చెన్నై వరుణ్ చక్రవర్తికి హోమ్ గ్రౌండ్ కూడా. అందుకే అతడు చెలరేగిపోతాడని భావిస్తున్నారు. బుమ్రా, అర్ష‌దీప్ పేస్ అటాక్ చేయ‌నున్నారు.

భారత జట్టు అంచ‌నా..
సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.

Leave a Reply