ఆంధ్రప్రభ, శ్రీ సత్యసాయి జిల్లా బ్యూరో ) రాయలసీమలోని పెనుకొండ కియా కార్ల కంపెనీలో భారీ సంఖ్యలో ఇంజన్ల చోరీ ఉదంతం.. ప్రపంచంలోని ఆటోమొబైల్ ఉత్పత్తి రంగాన్ని కుదిపేసింది. ఏకంగా 900 ఇంజన్లు ఎలా మాయం అయ్యాయనే అంశంపై .. కార్ల కంపెనీలు తర్జన భర్జన పడుతున్నాయి. ఇక ఈ కేసు మిస్టరీ చేధన ఏపీ పోలీసులకూ అంతు దొరకటం లేదు. ఎందుకంటే కంపెనీ ఇచ్చిన సమాచారంతో.. దర్యాప్తులో కనిపిస్తున్న వాస్తవాల్లో పొంతన కనిపించటం లేదు. ఎందుకంటే.. అంతర్జాతీయ కార్ల కంపెనీల్లో కియా కంపెనీ ఆషామాషీ కాదు. భద్రత విషయంలోనూ రాటుతేలిన సంస్థ ఇది. ఒక గుండుసూది కనిపించక పోతే.. అదెక్కడుందో తన సాంకేతిక పరిజ్ఞానంతో ఇట్టే జల్లెడ పట్టగల సత్తా ఉన్న కంపెనీ ఇది. .
ఈ అంతర్జాతీయ స్థాయి కంపెనీలో ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ఈఆర్పీ) , సప్లయ్ చైన్ మేనేజ్ మెంట్ (ఎస్పీఎం) , బార్కోడ్, రేడియో ప్రీక్వెన్సీ ఐడీ (ఆర్ ఎఫ్ ఐడీ) వంటి ట్రాకింగ్ సిస్టమ్స్ ఉన్నప్పటికీ ఇంజన్ల దొంగలు ఏ టెక్నాలజీ ఉపయోగించారే ప్రశ్న… ఆటో మొబైల్ రంగాన్ని పీడిస్తోంది. అక్కడి వరకూ దేనికి? ఇంజిన్‌లు చిన్నా చితక మోటార్లు కావు. కనీసం సీసీ కెమెరాలు, లోడ్ చెక్ పాయింట్ లు గుర్తించకపోవటమే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
కంపెనీ లెక్కల ప్రకారం 900 ఇంజన్లు ఒకే సారి అదృశ్యం కాలేదు. విడతల వారీగా మాయమైనట్టు రికార్డులు చెబుతున్నాయి. కానీ స్టాక్ చెకింగ్, ఇంటర్నల్ ఆడిట్లల్లో ఈ ఇంజన్ల లెక్క ఎలా తప్పింది? ఇక్కడే పోలీసులు జుట్టుపీక్కొనే స్థితి ఏర్పడింది. పెనుకొండ మండలంలోని యర్రమంచి పంచాయతీలోని కియా సంస్థ రోజుకు 450 కార్లు ఉత్పత్తి చేస్తోంది. ఇక్కడ ప్రధాన యూనిట్‌తో పాటు 25 కి పైగా అనుబంధ పరిశ్రమలు పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంస్థ నుంచి సుమారు 900 కార్ల ఇంజిన్‌లు మాయమైనట్లు సంస్థ గుర్తించింది.
మార్చి 19న పోలీసులకు కియా ఇండియా కంపెనీ సీఈవో ఫిర్యాదు చేశారు. తమిళనాడు నుంచి పెనుకొండకు కంటైనర్లలో ఇంజన్లు చేరాయి. హ్యుందాయ్ కంపెనీ వీటిని రవాణా చేసింది. దారి మధ్యలో కంటైనర్లను ఆపి ఇంజన్లను దొంగలు అపహరించారనే అనుమానం వ్యక్తమైంది. అదే నిజమైతే చైన్నైలో లోడింగ్, పెనుకొండలో కియా కంపెనీలో అన్ లోడింగ్ లెక్కల్లో తేడాలను సెక్యూరిటీ పట్టేస్తుంది? మరి లెక్కల్లో వ్యత్యాసాలను సెక్యూరిటీ గుర్తించిందా? గుర్తిస్తే ఈ సమాచారాన్ని దాటవేసిందా? నిజానికి ఈ కంపెనీ దగ్గర నిఘావ్యవస్థ అషామాషీ కాదు. సెక్యూరిటీపైనా నిఘా వ్యవస్థ పని చేస్తుంది.
మరి ఇంతకీ దారి మధ్యలో ఇంజన్ల చోరీ కథ నిజమా? కట్టుకథా?
అందుకే పోలీసులు చాలా లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. ప్రత్యేకంగా మూడు బృందాలను రంగంలోకి దించారు. ఈ మూడు బృందాలు దేశవ్యాప్తంగా ఈ చోరీ జాడను గుర్తించే పనిలో బిజీబిజీగా ఉన్నారు. కియా మోటార్స్ ఇండియా కంపెనీ మార్కెట్ డిమాండ్ ఆధారంగా యేటా 300,000 నుంచి 400,000 కార్లను ఉత్పత్తి చేయగలదు. గత యాబై ఏళ్లుగా దొంగతనాలను తట్టుకున్న బలమైన కంపెనీ ఇది. తాజా పరిణామంతో ఒక ప్లాంట్ నుంచి ఇంత పెద్ద సంఖ్యలో ఇంజన్లను ఎలా మాయం చేయవచ్చో ? అనే అంశం ప్రస్తుతం తెరమీదకు వచ్చింది.
ఇలాంటి చోరీలను ఏరీతిలో అడ్డుకోవాలో పరిశోధన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెర మీదకు నెట్ వర్క్ కుట్ర 2020 నుంచి ఈ దొంగతనాలు వెలుగులోకి రాలేదు. అంటే అంతర్గత సిబ్బంది ప్రమేయంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అంతర్గత సిబ్బందిలో అందరూ కొరియన్లే. జపానీలే ఉన్నారు.
భారతీయులు ఒక్కరూ లేరు. ఇక పెనుకొండ ప్లాంట్ లో పని చేసే కార్మికుల్లో స్థానికులందరూ అన్ స్కిల్డ్ వర్కర్లే. ఇంజన్ల మాయం వ్యవహారాన్ని గుర్తించే శక్తి కేవలం సెక్యూరిటీ సిబ్బందికే ఉంటుంది. వీరిని కూడా దారి మళ్లించారంటే.. ఇక్కడ నెట్‌వర్క్ తెరమీదకు వచ్చింది. నాలుగు ఇంజన్ల ఇండెంట్ లో , ఐదు డెలివరీ చేసినట్లుగా అనుమానిస్టున్నారు. ఇండెంట్ల ధృవీకరణ ఆధారంగా ఇది ఒక కోణం మాత్రమే. చోరీ వెనుక ఫ్యాక్టరీలో గతంలో పని చేసిన ఉద్యోగుల ప్రమేయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ కీలక సమాచారంతో సహా యాక్సెస్ ఎలా పొందారు? ప్రస్తుత ఉద్యోగులు, ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలు ఇందులో భాగస్వామ్యులై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ కాలంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులు సహా,వివిధ షెల్ కంపెనీల ప్రతినిధులపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇప్పటికే దారిమధ్యలోనే చోరీ జరిగిందనే అంశంపై .. పెనుకొండ.. చెన్నై మధ్య సీసీ పుటేజీలను తనిఖీ చేస్తున్నారు. ఇక దర్యాప్తు ఎన్ని కోణాల్లో జరిగినా.. ఈ చోరీ వ్యవహారం సాధారణ విషయం కాదు.
ఇంటర్నేషన్ థెప్ట్ కేసుగా పోలీసులు పరిగణిస్తున్నారు. నిఘా వ్యవస్థకే శఠగోపం నిఘా వ్యవస్థలోనే అష్టదిగ్భంధన అస్ర్తాలు కలిగిన కియా కంపెనీకే శఠగోపం పెట్టిన టెక్నాలజీ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇంజన్ల మాయం వ్యవహారంలో కనీసం సీసీ కెమెరాలు, లోడ్ చెక్‌లు గుర్తించకపోవడం ఆశ్చర్యం ఇక ఈఆర్సీ, ఎస్పీఎం, బార్కోడ్, ఆర్ ఎఫ్ ఐడీ వంటి ట్రాకింగ్ సిస్టమ్స్ ఉన్నా.. వీటి కళ్లుగప్పిన సాప్ట్ వేర్ హ్యాకింగ్ హీరో ఎవరు? ఎందుకంటే కియా కంపెనీలో ఉన్న సాప్ట్ వేర్ .. తన ప్రాంగణంలో మాయమైన వస్తువును ఇట్టే పసిగట్టగలదు. ఖండాంతరాలు దాటినా గుర్తించగలదు.
ఈఆర్పీ జోలికొస్తే.. అంతే ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఇది హుమన్ రిసోర్స్ శాఖ, ఉత్పత్తి , సప్లై చైన్, ఫైనాన్స్, అకౌంటింగ్ విభాగాలన్నీ సాఫ్ట్‌వేర్ కనుసన్నల్లో సాగుతాయి. ఇది కంపెనీ కార్యకలాపాలను ఏకీకృత దృక్పథంతో పచ్చి నిజాలను వడపోస్తుంది. ఇందులో ఆన్ –ప్రెమిసెస్ , క్లౌడ్- బేస్డ్, హైబ్రిడ్ ఈఆర్పీ . ఆన్ ప్రెమిసెస్ ఈఆర్బీ వ్యవస్థ కంపెనీ సర్వర్లలో ఆన్ -లొకేషన్‌లోనే నడుస్తుంది, ఇక క్లౌడ్-బేస్డ్ ఈఆర్బీ మూడవ పక్షం, రిమోట్ సర్వర్‌లో పనిచేస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్ అన్ని ఆర్థిక డేటాను నిల్వ చేస్తుంది, పర్యవేక్షిస్తుంది, విశ్లేషిస్తుంది , ఖచ్చితమైన, సకాలంలో పారదర్శక ఆర్థిక నివేదికలను నిర్వహిస్తూనే మెరుగైన నగదు లావాదేవీలు, తక్కువ ఖర్చులు పెరిగిన లాభదాయకతకు దారితీసే అంతర దృష్టిని బహిర్గతం చేయటానికి కీలక పాత్ర పోషిస్తుంది
. అంటే.. ఏ ఇంజన్ ఎక్కడ నుంచి వచ్చింది? ఎక్కడకు వెళ్లింది? అనే సమాచారం దీనిలో నిక్షిప్తమవుతుంది. ఎస్పీఎం.. ఆర్ ఎఫ్ ఐడీ కళ్లు కప్పలేరుఆక అత్యంత ప్రాథమిక స్థాయిలో, సప్లయ్ చైన్ మేనేజ్ మెంట్ లో ముడి పదార్థాల సేకరణ నుండి ఉత్పత్తి, తుది గమ్యస్థానానికి డెలివరీ చేసే వరకు ఒక ఉత్పత్తికి వినియోగించిన పరికరాలు , డేటా ఆర్థిక లావాదేవీలకు పక్కా సమాచారం క్రోడీకరిస్తుంది.
ఇది సరే.. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీలో రేడియో తరంగాలతో ఉత్పత్తులను గుర్తించడానికి ఉపయోగిస్తుంది. వైర్‌లెస్ పరికరంలో ఉన్న సమాచారాన్ని , భౌతిక సంబంధం లేకుండా దృష్టి రేఖ అవసరం లేకుండా దూరం నుండి ట్యాగ్ చేసే పరికరం ఇది. ఆర్ ఎఫ్ ఐడీ సెన్సార్ అనేది విద్యుదయస్కాంత క్షేత్రాలను ఉపయోగించి ఉత్పత్తులను స్వయంచాలకంగా గుర్తించడానికి, ట్రాక్ చేయడానికి ఈ ట్యాగ్ పని చేస్తుంది. ఈ సెన్సార్లు చాలా ఖచ్చితమైనవి, వీటిని జతచేసిన వస్తువు విలువైన డేటాను అందించగలవు. డేటాను అప్‌లోడ్ చేస్తున్నందున, ఒకేసారి పెద్ద సంఖ్యలో ఉత్సత్తుల డేటాను సేకరించడానికి ఉపయోగించినప్పుడు ట్రాన్స్క్రిప్షన్ లోపాలు, డేటాలో నకిలీ తప్పిపోయిన అంశాలను కూడా నివారిస్తుంది. ఇంత గొప్ప టెక్నాలజీ ఉన్న కియా కంపెనీలో 900 ఇంజన్లు మాయం కావటాన్ని అంతర్జాతీయ ఆటోమొబైల్ కంపెనీలు జీర్ణించుకోలేక పోతున్నాయి. అసలు దొంగలెవరో తెలిసే వరకూ ఈ కంపెనీల గుండెదడ ఆగదంటే అతిశయోక్తి కాదు.