ఉమ్మడి జిల్లాలో దాదాపుగా పూర్తి కావచ్చిన సర్వే
- గండికోట నుంచి నాలుగు నియోజకవర్గాలకు తాగునీరు
- కండలేరు నుంచి ఐదు నియోజకవర్గాలకు కృష్ణా జలాలు
- తుది అంచనాలు రూపొందిస్తున్న అధికారులు
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ) : నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత చిత్తూరు జిల్లా తాగునీటి సమస్య మీద ప్రత్యేక దృష్టిని సారించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నిత్యం కరువు కాటకాలతో సతమతం అవుతుంది. వేసవి వస్తే తాగనీటి సమస్య ప్రతి సంవత్సరం పునరావృతం అవుతుంది. తాగునీటి సమస్యను తీర్చడానికి ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయల వ్యయం చేస్తున్న, శాశ్వత పరిష్కారం లభించడం లేదు. జిల్లాలో జీవనదులు, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు లేకపోవడంతో చిన్న చిన్న జలాశయాలు, బోర్ల మీదనే తాగునీటి కోసం ఆధారపడాల్సి వస్తుంది.
ఈ పరిస్థితిని అధిగమించడానికి చిత్తూరు జిల్లా (Chittoor District)లో వాటర్ గ్రిడ్ ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. సుబ్ అనే సంస్థకు సర్వే బాధ్యతను అప్పగించారు. ఈ సంస్థ గత ఆరు నెలలుగా జిల్లాలో సర్వే చేస్తుంది. ఈ సర్వే దాదాపుగా పూర్తి కావచ్చింది. సమగ్రమైన నివేదికలను తయారు చేసే పనిలో ఈ సంస్థ ఉంది. ఈ నెలాఖరకు ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదిక తయారవుతుందని అంచనా. చిత్తూరు జిల్లాతో పాటు తిరుపతి జిల్లాకు కూడా కృష్ణా జలాల ద్వారా తాగునీటిని సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. తొందర్లోనే ఈ పథకం ప్రభుత్వ ఆమోదముతో అమలు కానుంది.
రానున్న 30 సంవత్సరాల తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ పథకానికి రూపకల్పన జరుగుతోంది. గండికోట నుంచి కృష్ణా జలాల (Krishna waters) ను పుంగనూరు, పలమనేరు, కుప్పం, పూతలపట్టు నియోజకవర్గాలకు మళ్లించడానికి ప్రణాళిక సిద్ధమవుతోంది. అలాగే కండలేరు నుంచి నగరి, శ్రీకాళహస్తి, చంద్రగిరి, సత్యవేడు, తిరుపతి నియోజకవర్గాలకు తాగునీటిని సరఫరా చేయనున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్దం అవుతున్నాయి. ఇప్పటికే అడవిపల్లి రిజర్వాయర్ నుంచి రూ.275 కోట్లతో కృష్ణ జలాలను చిత్తూరు మున్సిపాలిటీకి తీసుకురావడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రతిపాదన తయారు చేయాల్సిందిగా తిరుపతి పబ్లిక్ హెల్త్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లా మొత్తానికి కృష్ణా జలాలతో దాహార్తిని తీర్చే బృహత్తర పథకం అమలు చేయాలన్న ఉద్దేశంతో జిల్లాలో కొనసాగుతున్న జలజీవన్ మిషన్ పథకాలను ప్రభుత్వం రద్దు చేసింది.
జిల్లాలో ఏటా వేసవికాలం ప్రారంభం నుంచే భూగర్భ జలాలు అడుగంటిపోతుంటాయి. బోర్లలో నీటి లభ్యత తగ్గుతుంది. మళ్ళి వర్షాలు పడే వరకు వేసవి నాలుగు నెలలూ దాదాపు ఇదే పరిస్థితి. బోర్లపై ఆధారపడే తాగునీటి పథకాల (Drinking water schemes) ద్వారా వేసవిలో నీరు అందించడం కుదరదు. దీంతో మునిసిపాలిటీల్లో, మండలాల్లో ట్యాంకర్లతో సరఫరా చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితులకు శాశ్వత పరిష్కారం చూపాలనజయతో రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా జలాలను చిత్తూరు తాగునీటికి మళ్ళించాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్‌లో బోర్ల ద్వారా కుళాయిలకు నీరు సరఫరా చేసేలా పనులను ప్రతిపాదించింది.
ఇందులో కొత్తగా తవ్విన బోర్లు (bores) కూడా ఉన్నాయి. వీటిలో చాలా బోర్లు గత రెండు సంవత్సరాల్లో వేసవిలో అడుగంటాయి. దీంతో ప్రజలు తాగునీటికి అల్లాడారు. దీంతో గ్రామాల్లోని గృహాలకు ఇచ్చిన కుళాయి కనెక్షన్ల ద్వారా 365 రోజులూ తాగునీరు సరఫరా అయ్యేలా ప్రణాళికలు చేపడుతోంది. సమీప జలాశయాలు, నదుల నుంచి పైపులైన్ల ద్వారా నీటిని తరలించి, వేసవిలోనూ ప్రజలకు సరఫరా చేసేలా డిజైన్లను మార్చనున్నారు. బోర్లు తవ్వి, వాటి నుంచి నీటిని సరఫరా చేయాలని గత వైఎస్సార్సీపీ సర్కార్ ప్రతిపాదించిన వాటిని రద్దు చేస్తున్నారు.
సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆదేశాలపై గ్రామాల్లో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. సవరించిన అంచనాల ప్రకారం ప్రాజెక్టు వ్యయం అదనంగా పెరుగుతుంది. అయినా సర్కార్ అదనపు వ్యయాన్ని భరించడానికి సుముఖంగా ఉంది. రాష్ట్రస్థాయి అంచనాల కమిటీ ఆమోదంతో వాటిని త్వరలో కేంద్రానికి పంపనున్నారు. జలాశయాలు, నదుల నుంచి నీటిని పైపులైన్లు, కాలువల ద్వారా సేకరించి సరఫరా చేయడం ద్వారా గ్రామాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఏపీ సర్కార్ భావిస్తోంది. గ్రామాల్లో ఇప్పటికే 2.67 లక్షల కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. దీంతో పాటు అదనంగా మరో 50,546 కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రక్రియను పూర్తి చేయడంతోపాటు ఖర్చు ఎక్కువైనా గ్రామాలకు సమీపంలోని జలాశయాల నుంచి సంవత్సరం పొడవునా నీరు ఇచ్చేలా పనులు చేపట్టాలని గ్రామీణ తాగునీటి సరఫరా విభాగాన్ని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
ఇందుకోసం కండలేరు, గండికోట జలాశయాల (Kandaleru and Gandikota reservoirs) నుంచి గ్రామాలకు నీటి సరఫరా కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికలు రూపొందిస్తున్నారు. కండలేరు నుండి 16 మండలాలకు, గండికోట నుండి 15 మండలాలకు తాగునీటిని సరఫరా చేయడానికి ప్రతిపాదనలు సిద్దం అవుతున్నాయి. పైపులైన్ల ద్వారా తెచ్చే నీటిని శుద్ధి చేశాక గ్రామాల్లోని ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, సంపులకు అనుసంధానించి ప్రజలకు కుళాయిల ద్వారా సరఫరా చేస్తారు. దీనిపై కేంద్రాన్ని ఒప్పించి ఆమోదం తీసుకోవాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు కొద్దిరోజుల క్రితం వేర్వేరుగా సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాగునీటి ప్రాజెక్టులకు సహకారం అందించేందుకు వారు సుముఖత వ్యక్తం చేశారు.
జల్‌జీవన్ మిషన్ (Jaljeevan Mission) లో ఇప్పటివరకు చేసిన పనులు, మిగిలిన పనులు సహా పలు విషయాలపై చర్చించారు. జలజీవన్ మిషన్ కింద చిత్తూరు జిల్లాలో గత ఐదు సంవత్సరాల కిందట 5041 పనులను ప్రతిపాదించగా, ఇప్పటివరకు 2,432 పనులు మాత్రమే పూర్తయ్యాయి. అంచనా వ్యయం 431.45 కోట్ల రూపాయలు కాగా, ఇందులో 101.21 కోట్ల రూపాయలను మాత్రమే వ్యయం చేశారు. ఇందులో 286 పనులు గత ఐదు సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయి. 1,921 పనులను అధికారులు రద్దు చేశారు. చిత్తూరు జిల్లాలోని గ్రామాలలో 3,17,818 కుటుంబాలు ఉన్నట్లు ఇరిగేషన్ శాఖ లెక్కలు కట్టారు. ఇందులో 2, 67,272 కుటుంబాలకు నీటి కొళాయి కనెక్షన్లు ఇచ్చారు. 50,456 కుటుంబాలకు ఇంకా నీటి కుళాయిల కనెక్షన్ ను ఇవ్వాల్సి ఉంది.
జల్ జీవన్ మిషన్ కింద జిల్లాలో ఇంకా 330 కోట్ల రూపాయలు కాకుండా అలాగే ఉంటాయి ఈ నిధులను కూడా కృష్ణా జలాల మళ్లింపు పథకాలకు వాడనున్నారు. కండలేరు, గండికోట జలాశయాల నుంచి చిత్తూరు జిల్లా (Chittoor District) కు తాగునీటిని తీసుకుని వచ్చి పథకాలకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధమయ్యాయి వీటిని రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి జిల్లా అధికారులు పంపారు. తొందర్లోనే ఈ పథకాలకు సంబంధించిన జీవోలను ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది, జీవోలు విడుదల కాగానే యుద్ధ ప్రాతిపదికన ఈ పనులను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. తిరిగి ఎన్నికలకు వెళ్లే సమయానికి జిల్లాలో తాగునీటి సమస్య అనేది లేకుండా జిల్లా మొత్తానికి కృష్ణా జలాలతో తాగునీటిని అందించాలని కృతజ్ఞతలు ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఉన్న బోర్లను ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకునేఅవకాశం ఉంది. ఏది ఏమైనా రెండు మూడు సంవత్సరాలలో చిత్తూరు జిల్లా వాసులు కృష్ణాజిల్లాలను తాగనున్నారు. వేసవిలో కూడా తాగునీటి సమస్య ఉండదు.

