ఈ Sunday Magazine సంచికలోని రచయితలందరికి విజ్ఞప్తి… గతంలో కొందరు ఇందులో పబ్లిష్ అయిన తమ రచనలను కాపీ చేసి సోషల్ మీడియాలో పేస్ట్ చేసి వైరల్ చేసుకున్నారు. దయచేసి అలా చెయ్యకండి. కేవలం Sunday Magazine లింక్ మాత్రం పోస్ట్ చెయ్యండి. మీ కథ/శీర్షిక ఆంధ్రప్రభ Sunday Magazine పబ్లిష్ అయిందని మెన్షన్ చెయ్యండి. మీ రచన కోసం పత్రికకు వచ్చి మిగతా రచనలు కూడా చదవాలనేది పత్రిక ఉద్దేశం. దయచేసి సహకరించగలరు..
– అసోసియేట్ ఎడిటర్, ప్రభన్యూస్.కాం.
Sunday Magazine సంచికలో…
1.ఋణ మోక్షమణి పరకామణి
2.మనసు-మాట శీర్షిక
3.బాలప్రభ కథ – విజ్ఞత తప్పించిన ప్రమాదం !
4.కబుర్లు – శీర్షిక
5.టెన్షన్ – కథ
6.సన్నిహితం… శీర్షిక
7.మెదడుకు మేత-సామెత.. శీర్షిక
8.వినరో భాగ్యము – శీర్షిక
Sunday Magazine 14 DEC 2025

1.ఋణ మోక్షమణి పరకామణి
ఆది కృత యుగమునందు భాద్రపద ఏకాదశి సోమవారం దివ్యమైన వేంకటాద్రిపై తన లీలా స్వరూపాన్ని ఆవిర్భవింపజేశాడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడు. ఈ కలి యుగములో ఆపద మ్రొక్కులవాడుగా వరద హస్తముతో భక్త జనులను ఆదుకుంటున్నాడు. ప్రపంచ వ్యాప్తముగానున్న కోటానుకోట్ల భక్తుల హృదయాలు సదా ఆ శ్రీనివాసుని శ్రీచరణాలపై ఏకాగ్రత కలిగి ఉంటాయి.
అందుకే ఆ దివ్య మంగళమూర్తికి అంత శక్తి. భక్తుల విశ్వాసమే ఆ క్షేత్ర పవిత్రతకు, మహిమకు కారణం. ఆయన భక్తులకు చూపించే లీలలు అనంతం. రాజు నుండి పేద వరకు ఈ సంసార చక్రమున ఎదురయ్యే సమస్యలను, కోరికలను ముడుపు కట్టి సమర్పిస్తే పరిష్కరించి తీరుస్తాడు. కాసు హుండీలో వేస్తే వేయి కాసులు తిరిగి ఇస్తాడు.
సర్వపాపాని వేం ప్రాహు: కటస్తద్దాహ ఉచ్యతే
తస్మాద్వేంకటశైలోయం లోకే విఖ్యాతికీర్తిమాన్
-భవిష్యోత్తర పురాణం
‘ వేం ‘ అనగా సర్వపాపములు, ‘కట ‘ అనగా దహించుట. శ్రీ వేంకటేశ్వరుడు ఈ కలియుగమున తెలిసో, తెలియకో చేసే సంసార తాపత్రయాధారిత పాపములను, ఎవరైతే పశ్చాత్తాపముతో ఆయనను శరణు వేడుదురో, వాటిని దహించివేస్తాడు. తిరిగి వారిని సన్మార్గమున పెడతాడు. అయితే పశ్చాత్తాపము ముఖ్యమైనది. ఎవరైతే కపట భక్తిని ప్రదర్శిస్తారో, వారిని దుష్టుల జాబితాలో చేర్చి శిక్షిస్తాడు.
ప్రభాత కాలమున ఎవరైతే ఏడుకొండల స్వామిని స్మరిస్తారో వారికి అలౌకిక ఆనందమును చేకూర్చి రక్షిస్తాడు. శ్రీవేంకటేశ్వరుని పౌరాణిక చరిత్ర బహు విస్తారమైనది. ఆకాశరాజు కుమార్తె అయిన శ్రీ పద్మావతిని వివాహము చేసుకొను సందర్భమున ఖర్చుల నిమిత్తము అనగా దేవ, ఋషి, గణములకు సంభావనలు, విందు కొరకు కుబేరుని వద్ద ఋణము తీసుకున్నట్లు తెలియుచున్నది.
ప్రస్తుత పుష్కరిణీ తీరముననున్న అశ్వత్థ వృక్ష మూలమునకు కుబేరుని రహస్యముగా తీసుకువెళ్ళి శ్రీనివాసుడు ధనవృద్ధి పత్రమును చతుర్ముఖ బ్రహ్మచే వ్రాయించి ఇచ్చి ధనము ఋణము తీసుకున్నాడు. మొత్తము పదునాలుగు లక్షల రామముద్ర నిష్కములను తీసుకున్నాడు. ఆరోజు విళంబి నామ సంవత్సర వైశాఖ శుక్ల సప్తమి. వేయి సంవత్సరములలోపు ఋణము తీర్చాలి. సాక్షులుగా బ్రహ్మ, శంకరుడు, అశ్వత్థ వృక్షము. ఆనాటి నుండి నేటికీ ఋణవృద్ధితో బాటు ఋణము వంతుల వారీగా తీర్చుతూ ఉన్నారు.
ఆయన ఋణమును తీర్చుట కలియుగమున భక్తులకి వరం. అందుకే పోటీపడి మరీ హుండీ లేక కొప్పెరలో ధనం, కానుకలు సమర్పిస్తున్నారు. ఎవరైతే తమ ధర్మబద్ధమైన కష్టార్జితమును కొంత స్వామి వారికి హుండీలో సమర్పిస్తారో, వారికి అష్ట ఐశ్వర్యములు సంప్రాప్తమవుతాయి. పాపపు సొమ్మును ఒక్క పైసా కూడా హుండీలో వేయకూడదు. అలా వేసిన వారు అష్టకష్టముల పాలవుతారు. అంత మహిమ కలది ఈ స్వామి వారి హుండీ.
యుగయుగాల నుండి అనేక రూపాల్లో ఆలయ వ్యవహారాలు, స్వామి వారి కైంకర్యాలకు కావలసిన ఏర్పాట్లు, నైవేద్య, ప్రసాద వినియోగం, భక్త జనులు సమర్పించుకొనే కానుకల సం రక్షణకు వివిధ దేవగణాలు ఉండేవి. ఇక మనకు చరిత్ర ద్వారా వేయి సంవత్సరముల పూర్వము నుండి హుండీ ద్వారా లభించిన ధన వస్తువులను గణించే పరకామణి వ్యవస్థ ఉన్నట్టు తెలుస్తోంది. స్వామి వారికి చెందిన అనేక శాసనాలు తెలుగు, తమిళ, కన్నడ సంస్కృతములలో నేటికీ భద్రముగా ఉన్నాయి.
శ్రీవారికి భక్తులు, రాజులు, రాజ్యాధికారులు, ధనికులు, హుండీ ద్వారా గాని, ప్రత్యక్షంగా గానీ, ఇచ్చే కానుకలు, ఆభరణాలు, వస్తువులు, ముడుపులు, ధనం ఏ రోజుకారోజు ఆలయ అధికారులు లెక్క తేల్చి మరుసటి రోజు ఉదయం జియ్యంగారికి అందజేసేవారు. ఆ వివరాలు తోమాల సేవ తరువాత జరుగు కొలువు సమయంలో కొలువు శ్రీనివాసమూర్తికి జియ్యంగారి మఠ సేవకులు భక్తి ప్రపత్తులతో ఖచ్చితంగా లెక్క తెలిపి, సమర్పించేవారు. శ్రీరామానుజుల వారు వేయి సంవత్సరాలకు పూర్వం హుండీ, పరకామణి పర్యవేక్షణకు ఏకాంగి వ్యవస్థను ఏర్పాటు చేసారు.
వారు దివ్యక్షేత్రమైన తిరుమలలో అత్యంత నియమ నిష్టలు కలిగి ఎటువంటి అపచారాలు చేయకుండా, అవినీతికి పాల్పడకుండా నిత్యం ఆలయంలో ఉండి, స్వామి వారి సేవ చేసేవారు. మొత్తం నాలుగు వ్యవస్థలు ఉండేవి. అవి ఆచార్య పురుషులు, అర్చకులు, ఆలయాధికారులు, ఏకాంగి వారు. వీరంతా రాజశాసనానికి బద్ధులై కర్తవ్యనిర్వహణ చేసేవారు. ఇంతవరకు ఎప్పుడూ ఎటువంటి భ్రష్టాచారములు జరుగలేదు. దేవదేవునికి చెందిన సొమ్ము అత్యంత ఖచ్చితంగా జమ చేయబడింది.
స్వామివారి హుండీకి సమర్పించించడమే కాని, అందులో నుండి తస్కరించడం మహా పాపం. తస్కరించిన వారు జన్మ జన్మలకు అధోయోనులలో నరక యాతన పడతారు. ఈ జన్మలో వారి అంతరాత్మ వారిని దహించి వేస్తుంది. వారి సంతానం కూడా అనేక పాప జన్మలకు లోనవుతారు. ఏడు కొండల వాడి ముందు కపటము, వంచనకు ఎవరైతే పాల్పడతారో, వారు తప్పక దండించబడతారు. ఆ దండన ఏ రూపంలో ఉంటుందో ఎవరికీ తెలియదు. శిక్ష మాత్రం కఠినంగా ఉంటుంది. ఈ క్షేత్రానికి అంత మహిమ. భక్తుల మనోభావాల యజ్ఞం నుండి లభించింది అనేది పరమ సత్యం.
స్వామివారి హుండీలో వేసే ముడుపుల గురించి ఒక యధార్థం ఇక్కడ ప్రస్తావించక తప్పదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు విద్యాధికారిగా వారి కార్యాలయంలో ఒక తోటమాలీ ఉండేవాడు. అతను ఉదయం, సాయంత్రం ఉద్యానవనంలో తోటపని చేసేవాడు. మిగిలిన సమయంలో రిక్షా త్రొక్కుతూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. రిక్షా తొక్కి సంపాదించిన ధనంలో కొంత రోజూ ముడుపు కట్టి, తిరుమల వెళ్ళి స్వామి వారిని దర్శించుకుని హుండీలో వేసి వచ్చేవాడు. ఇలా అన్వేషిస్తే ఎన్నో గాధలు మనకు లభిస్తాయి. అంటే, హుండీలో పడే ప్రతి పైసా ఎంతో పవిత్రమైనది. ధర్మబద్ధమైనది. కష్టార్జితమైనది. అని తెలుస్తోంది.
అటువంటి శ్రీనివాసుని హుండీ సొమ్ము నుండి పరకామణిలో దొంగిలించడం ఎంత ఘోరమైన పాప కార్యమో తెలుసుకోండి. ఏ స్థాయిలో ఆ పాపం జరిగినా స్వామి వారి ఆలయాధికారులందరికీ ఆ పాప భాగం సంప్రాప్తిస్తుంది. అందుకే శ్రీరామానుజులు స్వతహాగా నియమనిష్టులు, శాస్త్ర పాండిత్యం, స్వామివారి భక్తి, పవిత్రమైన కుటుంబ చరిత్ర కలవారిని ఏకాంగి వ్యవస్థలో నియమించాలని నిబంధన విధించారు. శ్రీవారి ఋణ మోక్షమణి పరకామణి. శ్రీనివాసుడి ఋణం తీర్చడంలో భాగం పంచుకోవడమే హుండీలో సమర్పణ.
ఏది ఏమైనా స్వామి హుండీ అంటే అత్యంత పవిత్రమైన అగ్నిసమానమైన ఖజానా. అందుకే భక్తులు తిరుమలలో విలువైనది ఏది దొరికినా స్వామివారి హుండీలో వేస్తారు. ప్రతి రోజూ సుమారు పది నుండి పద్నాలుగు గంగాళాల హుండీలు భక్తులు వేసే కానుకలతో నిండి పరకామణి భవనాన్ని చేరతాయి. ప్రపంచంలోనే అత్యంత ధనవంతునిగా అలరారుతున్న శ్రీ వేంకటేశ్వరుడు ఇంకా కుబేరునికి వడ్డీతో సహా ఋణం తీర్చుతున్నాడు అన్న విషయం మరచి పోకూడదు. అందుకే స్వామి ఋణం తీర్చుకోవడానికి ఉడతాభక్తిగా ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. అటువంటి స్వామి సొమ్మును అపహరించ ప్రయత్నిస్తే ఈ జన్మలోనే నరకం తప్పదు.
2.మనసు-మాట శీర్షిక

శ్రవణ్ మనసు మాట :
నేను 27 సంవత్సరాల చార్టర్డ్ అకౌంటెంట్ని. నాకు సుధతో నిశ్చితార్థం జరిగి 5 నెలలవుతుంది. పెళ్ళి ముహూర్తం పెద్దలు వచ్చే సంవత్సరంలో కుదిర్చారు. సుధ ప్రవర్తన చూసి నాకు భయంగా మరియు దిగులుగా వుంది. దిగులు ఎందుకంటే, మా ఇద్దరి అభిప్రాయాలు వేరు, మా విలువలు వేరు, ప్రేమ వ్యక్త పరిచే విధానాలు వేరు అని అర్థమయ్యింది మరలాంటప్పుడు మా వివాహం నిలబడుతుందా అని భయంగా, దిగులుగా వుంది.
నిశ్చితార్థము సమయములో మేమిద్దరమూ ఒకే రంగు దుస్తులు వేసుకోవాలని, ఆ రంగులు కూడా ఫోటోలు, వీడియోలలో ఆకర్షనీయంగా ఉండేలా చూసుకోవాలని అందరితో సంప్రదింపులు. నగలు, డెకొరేషన్, ఫోటోలకి పోసులు అన్ని ఆకర్షనీయంగా ఉండాలని అవి అందరూ చూసి మెచ్చుకోవాలనే తాపత్రయం తనకుంది.
ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం, వాటికి వచ్చిన లైకులు, కామెంట్స్ చూసుకొని మురిసిపోవడం లేదా దిగులు పడుతుంటుంది. అందరూ మమ్మల్ని చూసి ఈడు-జోడు బావుందనుకోవాలని, అలాగే మా బంధం బావుందని అందరికీ చూపికంచుకోవడం మీదున్న తన తాపత్రయం మా బంధం వాస్తవంలో ఎలా వుందన్నదాని మీద లేదు.

బంధంలో బాహ్య ప్రదర్శనంటే అందరి ముందూ చేతులు పట్టుకోవడం, హాగ్ చేసుకోవడం, సోషల్ మీడియాలో నేనంటే ఎంత ఇష్టమో పెద్ద పోస్ట్లు పెట్టడం, నేను తన జీవితాన్ని ఎలా కంప్లీట్ చేస్తానో తన స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పదే పదే పొగిడి చెప్పడం వలన నాకు తానేదో కల్పనలో జీవిస్తుంది వాస్తవంలో లేదనిపిస్తుంది.
నాకు మాత్రం అవతలి వాళ్ళకోసం కాదు నా కోసం నేను బ్రతకాలి అన్న తాపత్రయముంటుంది. నా ప్రేమ నేను నా చేతల ద్వారా, తన మీద గౌరవం ద్వారా చూపించాలనుకుంటా, ప్రేమను బాహ్యాటంగా అనుక్షణం ప్రదర్శించడం లేదా ప్రదర్శనే ముఖ్యం అనుకోవటం నాకు నటన లాగనిపిస్తుంది. ఇవన్నీ గమనించి మా పెళ్ళి నిలబడుతుందా నేను తీసుకున్నది సరైన నిర్ణయమేనా అన్న భయం కల్గుతుంది. తనని పెళ్ళి చేసుకోవడం సరైన నిర్ణయమేనా?
సైకాలజిస్ట్ మాట: శ్రవణ్ కి సూచనలు: శ్రవణ్ మీరు ఇద్దరు ప్రేమకి ఇచ్చే నిర్వచనాలు వేరు వేరుగా వున్నాయి. ముందు వీటి గురించి మీకు చెప్పాలి. పెర్ఫార్మేటివ్ లవ్ మరియు అథెంటిక్ లవ్ రెండు వేర్వేరు రకాల ప్రేమలు, ఇవి సంబంధాలపై విభిన్న ప్రభావాలను చూపుతాయి.
పెర్ఫార్మేటివ్ లవ్:
- గ్రాండ్ జెస్చర్స్, పబ్లిక్ డిస్ప్లేస్ ఆఫ్ ఎఫెక్షన్ లేదా మెటీరియల్ గిఫ్ట్స్ ద్వారా ప్రదర్శించబడే ప్రేమ.
- బాహ్య ప్రదర్శన, సోషల్ మీడియా లైక్స్ లేదా ఇతరుల దృష్టిని ఆకర్షించడం కోసం ప్రయత్నించడం మరియు వారి అభిప్రాయాలు గురించి ఎక్కువ తాపత్రయం పడడం ద్వారా నడపబడుతుంది.
- నిజమైన భావోద్వేగ సంబంధం, కనెక్షన్ లేకపోవచ్చు.
- ఉపరితల, క్లుప్తంగా ప్రేమ ఉండవచ్చు.
అథెంటిక్ లవ్:
- నిజాయతీతో కూడుకున్న హృదయపూర్వకమైన ప్రేమ.
- చిన్న, స్థిరమైన చర్యలు, అర్థవంతమైన పరస్పర చర్యల ద్వారా ప్రదర్శించబడుతుంది.
- నమ్మకం, అవగాహన, భావోద్వేగ సంబంధాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టే దృక్పధం కనిపిస్తుంది.
- పరస్పర గౌరవం, సంరక్షణ, మద్దతు వలన ప్రేమ, నమ్మకం బలపడతాయి.
ప్రధాన వ్యత్యాసాలు:
- పెర్ఫార్మేటివ్ లవ్ బాహ్య ప్రదర్శన మరియు ప్రామాణీకరణను కోరుతుంది, అథెంటిక్ లవ్ పరస్పర సంబంధాన్ని కోరుతుంది.
- పెర్ఫార్మేటివ్ లవ్ తరచుగా బిగ్గరగా, చూపించేలా ఉంటుంది, అథెంటిక్ లవ్ నిశ్శబ్దంగా, నిజమైనదిగా ఉంటుంది.
- పెర్ఫార్మేటివ్ లవ్ ఖాళీ (emptiness) భావాలకు/ ఆత్మనూన్యత భావాలకు దారితీస్తుంది, అథెంటిక్ లవ్ వృద్ధి, సంతృప్తిని పెంపొందిస్తుంది.
సంబంధాలపై వీటి ప్రభావం: అధ్యాయనాలు ఏమి సూచిస్తున్నాయంటే:
- పెర్ఫార్మేటివ్ లవ్ సంబంధాలలో అసంతృప్తికి దారితీస్తుంది.
- అథెంటిక్ లవ్ సంబంధాలలో సంతృప్తి, నమ్మకం, అనుబంధాన్ని పెంచుతుంది.
శ్రవణ్ మీరు అసంతృప్తికి గురవుతున్నారు తద్వారా బంధంలో ఆనందంగా ఉండలేకపోతున్నారు. మీది అథెంటిక్ లవ్, సుధది పెర్ఫార్మటివ్ లవ్. ఈ తేడాను మీరు గుర్తించారు ఇప్పుడు చేయవలసింది మీ ఆనందానికి ప్రాముఖ్యత ఇవ్వండి, అన్ని సమయాల్లో మీకు ఇష్టంలేనివి, మనసుకు నచ్చనివి చెయ్యకండి.
మీ జీవితాన్ని పంచుకోబోయే జీవిత భాగస్వామికి మీరు ఆనందంగా లేరు అన్నది చెప్పండి. తను మీ భావాలకు విలువ, గౌరవం ఇచ్చినప్పుడు తనకనుగుణంగా మిమల్ని ప్రవర్తించమని అడగరు. ఆలా అడుగుతున్నారంటే ఆమె మీ ఆనందానికి విలువ ఇవ్వట్లేదు అని అర్థం.
మీరు వేసుకోవాల్సిన ప్రశ్న ఈ బంధం నిలుస్తుందా అని కాదు, నేను ఈ బంధంలో ఆనందంగా ఉన్నానా? నా ఆనందానికి విలువ వుందా? అన్నది మీ ప్రశ్న కావాలి అప్పుడు ఈ సమస్యను పరిష్కరించుకోగల్గుతారు. మీరు తీసుకుంటున్న నిర్ణయం సరైనదా కాదా అన్నది మీకు అర్థమవుతుంది.
సుధ కి సూచనలు: సంబంధాలలో నిజమైన ప్రేమను పెంపొందించడానికి, మీ భాగస్వామితో సన్నిహితంగా ఉండటం, వారి భావాలను వినడం మరియు వారి జీవితంలో చురుకుగా పాల్గొనడం చాలా ముఖ్యం. నిజమైన ప్రేమ బాహ్య ప్రదర్శన మరియు బాహ్య ప్రామానీకరణ కోరుకోదు. అది మీ ఇద్దరికీ సంబందించిన వ్యక్తిగత భావన మాత్రమే.
ది మైండ్ వాయిస్: శ్రవణ్, బంధాలలో ఆనందంగా ఉండాలంటే మీ గురించి మీకు పూర్తి అవగాహనుండాలి అలాగే మీ భావాలను మరియు అభిప్రాయాలను అవుతలవారికి చెప్పడం కూడా రావాలి.
3.బాలప్రభ కథ – విజ్ఞత తప్పించిన ప్రమాదం !
పాఠశాలకు బయలుదేరుతున్న రాముకి పది రూపాయలు ఇచ్చి ‘పసుపు’ కొనుక్కురమ్మని చెప్పింది కాంతమ్మ.
“నీకు అన్నీ స్కూల్ కు వెళ్ళే సమయంలోనే గుర్తొస్తాయి” విసుక్కుంటూనే బయలుదేరాడు రాము.
రాము రోడ్డు మీదకు వచ్చి, ఒక సందు దాటి రెండవ సందు మొదట్లో ఉన్న రామయ్య కొట్టు దగ్గరికి వెళ్లి పసుపు కొనుక్కుని మళ్ళీ రోడ్డుమీదకు వచ్చి ఇంటి వైపు నడవసాగాడు. పది అడుగులు వేసాడో లేదో, వెనకాల నుంచి బైక్ మీద వచ్చిన ఇద్దరి యువకుల్లో వెనకాల యువకుడు వేగంగా బైక్ దిగి, రాము ముక్కుకు ఏదో వాసన చూపించి, అంతే వేగంగా అతన్ని బైక్ మీద ఇద్దరి మధ్య కూర్చోబెట్టుకుని పట్టుకున్న వెంటనే బైక్ వేగంగా ఊరికి దూరంగా వెళ్ళిపోయింది.

దాదాపు అరగంట తర్వాత రాముకి మెలకువ వచ్చింది. తను ఎవరో ఎత్తుకొచ్చిన విషయం గుర్తుకు వచ్చి తల దిమ్ముగా ఉన్నా, నెమ్మదిగా చుట్టుపక్కల పరిశీలించాడు. అది పొలంలో ఒకే ఒక ద్వారం ఉన్న కొత్తగా కట్టిన పాక గది. ఆ గదికి కొత్త సున్నంతో వెల్ల వేసినట్టుగా గమనించాడు రాము. తలుపు గట్టిగా తోసాడు. తలుపు బయట తాళం వేసి ఉంది. తనను ఎత్తుకొచ్చిన వాళ్ళు తమ ప్లాన్ ను అమలు చేయడానికి బయటికి వెళ్లినట్టు రాము గ్రహించాడు.
స్వతహాగా చురుగ్గా ఉండే రాము ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించాడు.
ఆ గదికి ఉన్న ఒకే ఒక కిటికీ వెనక ఎన్నో పిచ్చి మొక్కలు కనిపిస్తున్నాయి.
అయితే ఎంతో ఎపుగా బలంగా ఎదుగుతున్న ఒక తీగ కిటికీని పట్టుకుని పైకి ఎగబాకి ఉంది. దానిని చూడగానే అతనికి మాస్టారు చెప్పిన పాఠం గుర్తుకు వచ్చింది.
అది తమలపాకు తీగ. ఆలోచించకుండా అతను ఐదు ఆరు పెద్ద ఆకులను కోశాడు. గోడకి వేసి ఉన్న సున్నాన్ని గోరుతో ఆకులోకి గీకాడు. జేబులో ఉన్న పసుపు పొట్లం తీసి అందులోని కొంత పసుపును సున్నము మీద వేసి, తమలపాకులను ఉండగా చుట్టి, నోట్లో పెట్టుకుని నమిలేసాడు.
మరో నాలుగు నిమిషాల్లో అతని నోటి వెంట ఎర్రని ద్రవం ధారగా కారిపోయి, తెల్లని యూనిఫారం చొక్కా అంతా ఎర్రని మరకలైపోయాయి. ఆ ఎర్రని రంగును చూస్తూనే రాము స్పృహ తప్పి పడిపోయాడు.
మరునాడు ప్రార్థనా సమయంలో ప్రధానోపాధ్యాయులు పిల్లలతో ఈ విధంగా అన్నారు. ” నిన్న రాము బజార్ కి వెళ్ళినప్పుడు ఎవరో కుర్రాళ్ళని ఎత్తుకుపోయే దొంగలు వచ్చి అతనికి మత్తు చూపించి, తీసుకెళ్లి ఊరికి చివర ఉన్న ఒక సరికొత్త పాకలో బంధించారు. తర్వాత తమ పథకాన్ని అమలు చేయడానికి వాళ్ళు బయటికి వెళ్ళిన సమయంలో రాముకు మెలకువ వచ్చి చాలా చురుకుగా ప్రవర్తించాడు.
కిటికీ పక్కన ఉన్న తమలపాకు మొక్క ఆకులలోకి, గోడకు సున్నాన్ని గీకి, జేబులో ఉన్న పొట్లంలోని పసుపుని కలిపి ఉండగా చుట్టుకుని నమిలేసాడు. రసాయన చర్య వల్ల అది లాలాజలంతో కలిసి ఎరుపు రంగులోకి మారింది. అతను కావాలని ఆ లాలాజలాన్ని చొక్కా నిండా జార్చి స్పృహ తప్పిపోయినట్లు పడుకుండిపోయాడు.
ఆ కిడ్నాప్ కుర్రాళ్ళు వచ్చి రాము రక్తం కక్కుకుని పడిపోయాడని భావించి, అది తమ ప్రాణం మీదకు వస్తుందని భావించి అతన్ని విడిచి పెట్టి పారిపోయారు.
చూసారా పిల్లలు. రాము లాగా విద్యార్థులందరూ.. ఉపాధ్యాయుడు పాఠం చెబుతున్నప్పుడు శ్రద్దగా వినాలి. మన చుట్టూ అనుక్షణం ఏం జరుగుతుందో పరిశీలించుకుంటూ ఉండాలి. రోజులు అస్సలు బాగాలేదు. పిల్లల్ని ఎత్తుకుపోయే దొంగలు ఎక్కువై పోయారు. అలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే మీరు ఎంత చురుకుగా వ్యవహరించాలో, ఈవేళ రాము సంఘటన దానికి ఉదాహరణ. మరి మీరంతా మన గ్రామంలోకి ఎవరైనా కొత్త వాళ్లు ప్రవేశిస్తే అప్రమత్తంగా ఉంటారా?” అని ప్రశ్నించారు.
“ఓ తప్పకుండా ఉంటాం సార్. రాము లాగా చక్కగా పాఠాలు విని మేము కూడా మా పరిశీలనా శక్తిని పెంపొందింపచేసుకుంటాం సార్.” అన్నారు ముక్తకంఠంతో.
“ఈ వార్త నిన్ననే ఇదిగో., ఈ దినపత్రికలో వేయించాను. ఇక మీదట మన ఊరికి ఎటువంటి దొంగలు వచ్చే అవకాశం లేదు. అయినా మీరు ప్రతిక్షణం ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఇంత మంచి సాహసం చేసిన రాముని మీరందరూ ఏమి తెలపాలి?” ప్రధానోపాధ్యాయులు వారు పిల్లల్ని అడిగారు.
పాఠశాల ప్రాంగణమంతా రాముని అభినందిస్తూ చేసిన హర్షద్వానాలతో నిండిపోయింది.
4.కబుర్లు – శీర్షిక

డెత్ సర్టిఫికెట్
ఉన్నతోద్యోగం చేసి పదవీ విరమణ చేసిన ఒక వ్యక్తి అప్పటివరకు తాను నివసించిన అధికారిక నివాసం నుంచి ఒక కాలనీ లోని తన స్వంత ఇంటిలోకి మారాడు. గతంలో తాను పెద్ద ఉద్యోగం చేసానని అహంభావం ఉండేది అతగాడికి. ప్రతిరోజూ ఆ కాలనీ లో ఉన్న పార్క్ లో సాయంత్రపు నడకకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. కనీసం వారివంక చూసేవాడు కూడా కాదు. వారంతా తన స్థాయికి తగినవారు కాదనే అహం.
ఒకరోజు అతడు పార్క్ లోని బెంచ్ పై కూర్చుని ఉండగా మరో వృద్ధుడు వ్యక్తి వచ్చి పక్కన కూర్చుని సంభాషణ ప్రారంభించాడు. ఈ వ్యక్తి మాత్రం ఎదుటివ్యక్తి చెప్పే మాటలను ఏమాత్రం విలువ ఇవ్వకుండా తాను నిర్వర్తించిన ఉద్యోగం, హోదా, తన గొప్పతనంగురించి మాత్రమే చెప్పేవాడు. తన వంటి ఉన్నత స్థాయి వ్యక్తి గతిలేక స్వంత ఇల్లు ఉన్నందుకు ఈ కాలనీలో ఉంటున్నట్లు చెప్పుకున్నాడు. ఆ ముసలాయన మాత్రం ఓపిగ్గా వినేవాడు.
ఒక రోజు ఆ వృద్ధుడు నోరు విప్పాడు. “చూడు నాయనా! విద్యుత్ బల్బులు వెలుగుతున్నంత వరకే వాటికి విలువ, అవి మాడిపోయిన తరువాత అన్నీ ఒకటే. వాటి రూపం, అవి అందించిన వెలుగులు అన్నీ మరుగున పడిపోతాయి. నేను ఈ కాలనీలో ఐదు సంవత్సరాల నుండి నివస్తున్నాను. రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా సేవలు అందించానని ఎవ్వరికీ చెప్పలేదు ఇప్పటిదాకా.
అంతే .. ఆ అహంభావి మొహంలో రంగులు మారాయి.
ఆ పెద్ద మనిషి కొనసాగించాడు. “నీకు కుడి పక్కన దూరంగా కూర్చుని ఉన్న ఆ వర్మగారు భారత రైల్వేలో జనరల్ మేనేజర్ గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఎదురుగా నిలబడి నవ్వుతూ మాట్లాడుతున్న రావుగారు ఆర్మీలో లెఫ్నె౦ట్ జనరల్ గా ఉద్యోగ విరమణ చేశారు. ఆ మూలగా తెల్లటి బట్టల్లో ఉన్న శివ స్వామిగారు ఇస్రో ఛైర్మన్ గా సేవలు అందించారు.
ఈ విషయం ఆయన ఎవరితోనూ చెప్పుకోలేదు. నాకు తెలుసు కనుక నీకు చెబుతున్నాను. ఇందాక చెప్పినట్లు జీరో, 10, 20, 40, 60,100 వాట్ల ఏ బల్బ్ అయినా వెలుగుతున్నంత వరకే విలువ. ఫ్యూజ్ పోయి మాడిపోయిన తరువాత వాటికి చెందిన వాట్, అవి విరజిమ్మిన వెలుగులకు విలువ ఉండదు. అవి మామూలు బల్బ్, ట్యూబు లైట్, లెడ్, సి. ఎఫ్. ఎల్., హలోజెన్, డెకోరేటివ్ బల్బ్.. ఏది అయినా ఒకటే. నీతో సహా మనమందరము మాడిపోయిన బల్బ్ లమే.
ఉదయిస్తున్న సూర్యుడు, అస్తమిస్తున్న సూర్యుడు ఒకేలా అందంగా ఉంటారు. అయితే ఉదయిస్తున్న సూర్యుడికి అందరూ నమస్కారం చేస్తారు, పూజలు చేస్తారు. అస్తమిస్తున్న సూర్యుడికి చేయరు కదా! ఈ వాస్తవాన్ని మనం గుర్తించాలి.మనం చేస్తున్న, ఉద్యోగం, హోదా శాశ్వతం కాదని తెలుసుకోవాలి. వాటి కి విలువ ఇచ్చి అవే జీవితం అనుకుంటే.. ఏదో ఒక రోజు అవి మనలను వదలి పోతాయనే వాస్తవాన్ని గుర్తించాలి.
చదరంగం ఆటలో రాజు, మంత్రి.. వాటి విలువలు ఆ బోర్డు పై ఉన్నంత వరకే.. ఆట ముగిసిన తరువాత అన్నింటినీ ఒకే డబ్బా లో వేసి మూత పెడతాము. ఈ రోజు నేను సంతోషంగా ఉన్నానని భావించు, ముందు ముందు కూడా సంతోషంగా ఉండాలని ఆశించు. మన జీవితంలో ఎన్ని సర్టిఫికట్లు పొందినా.. చివరికి అందరూ సాధించే సర్టిఫికెట్ ఒకటే.. అదే డెత్ సర్టిఫికేట్
5.టెన్షన్ – కథ
సునీల్ ని అంత టెన్షన్ గా ఎప్పుడూ చూడలేదు కుటుంబ సభ్యులు. నిన్న ఉదయం నుండి కాలు గాలిన పిల్లి లా తిరగడం అంటే ఇదేనేమో అన్నట్లు తిరుగుతున్నాడు. కాసేపు బెడ్ రూం లోకి, కాసేపు మిద్దె మీదకి, మరి కాసేపు వరండాలోకి. తిండి కూడా సరిగ్గా తినట్లేదు రెండు రోజులు నుండి. ఉండబట్టలేక తల్లి, భార్య అతన్ని హాల్లో కూర్చోబెట్టి, మంచినీళ్ళు ఇచ్చి నిదానంగా అడిగారు. షాపులో ఏదైనా గొడవ అయిందా? డబ్బు ఏమైనా పోగొట్టుకున్నావా?
ఇంట్లో తెలీకుండా లోన్ ఆప్స్ లో అప్పు చేశావా? ఇంటి ఓనర్ తో గొడవ అయిందా? పెళ్ళై ఆరేళ్లు అవుతున్నా పిల్లలు కలుగలేదు అని బంధువుల్లో, స్నేహితుల్లో ఎవరైనా మనసు గాయపరిచే లా మాట్లాడారా? ఏదైనా జబ్బు బయటపడిందా? ఇలా తమకి తోచిన ప్రశ్నలన్నీ అడిగారు. అన్నిటికీ తల అడ్డంగా తిప్పాడు సునీల్.

చివరకు బ్రతిమిలాడగా, ఆడగా, ఫోన్ లో ఫేస్ బుక్ ఓపెన్ చేసి భార్య కి చూపించి…తల్లి భుజాల మీద తల పెట్టుకుని కన్నీటి పర్యంతం అయ్యాడు. అతని భార్య అతని అకౌంట్ చూసి అందులో అతడు రాసిన పోస్ట్ లు, పెట్టిన ఫోటో లు చూసి ఏమి అర్థం కాక సునీల్ కేసి చూసింది. “మొన్న వారం క్రితం ఫోన్ లో ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేశా.
తెలిసిన అందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టా. రోజుకి నాలుగయిదు కి తగ్గకుండా పోస్ట్ లు పెడుతున్నా. పోస్ట్ లకు కామెంట్లు రాకపోగా కనీసం లైకు లు కూడా రావట్లేదు. అప్పటికి పోస్ట్ పెట్టిన ప్రతి పది నిమిషాలకి ఫేస్ బుక్ మొహం చూస్తూనే ఉన్నా. ఉహూ ఒక్క పది లైకులు కూడా రావట్లేదు. నన్ను చూసి అందరూ నవ్వుతున్నారు. మిద్దె మీదకు వెళ్తే, ఇంటి ఓనర్ కావాలని నా ముందు, తన పోస్ట్ కి 350 లైకులు, 75 కామెంట్లు వచ్చాయి అని పెద్దగా ఫోన్లో ఎవరికో చెప్తున్నాడు. ఈ అవమానం తట్టుకోలేకుండ ఉన్నాను అమ్మా” అంటూ బావురుమన్నాడు సునీల్. అతని తల్లి అతన్ని ఓదారుస్తూ,” పిచ్చి సన్నాసి.
చిన్నప్పటి నుండి ఇంతే. నువ్వు ఒట్టి అమాయకపు పక్షివి. దీనికే ఇంత కంగారు పడిపోయావా? నేను, కోడలు కలిసి రోజుకు నాలుగైదు…. వాటినేమంటారే ?”కోడలి కేసి చూసింది. “రీల్స్, అత్తయ్యా “అందించింది కోడలు. ఆవిడ కొనసాగిస్తూ,”ఆ అదే ఆ రీళ్ళు పెడుతున్నాం. ఒక్కడంటే ఒక్కడైనా లైక్..కొట్టాడా? పాడు సంత! వాళ్ళ ఫోన్లు పగిలిపోేనూ! ఏమి ఒక్క లైకు ఇస్తే వాళ్ళ సొమ్ము ఏమైనా పోతుందా? మేమేమైనా పట్టించుకున్నామా? ఇంటి పని, వంటపని చేసుకోవట్లేదా? నీలా టెన్షన్ పడ్డామా?” అన్నది కొడుకుని ఓదారుస్తూ.
6.సన్నిహితం… శీర్షిక

కొంచెం ఓపిక పట్టాలి
నేను ఒకసారి దైవదర్శనం చేసుకోవడానికి మా కాలనీ లో ఉన్న గుడికి వెళ్ళాను. సాయంకాలం చీకట్లు ముసురుకుంటున్నాయి. దీపాలు వెలిగి గుడి అంతా దేదీప్యమానంగా ఉంది. ఆలయ ప్రాంగణంలో వివిధ దేవుళ్ల గుడులు ఉన్నాయి. ఆదాయం బాగా రావడంతో గుడి అభివృద్ధి బాగా జరుగుతోంది. ఇరవయ్యేళ్లుగా ఆ గుడికి వస్తున్న నాకు దాని అభివృద్ధి తెలుసు. ఒకప్పుడు చిన్న గా ఉన్న ఆ గుడి ఇప్పుడు పెరిగి వివిధ దేవుళ్ల గుడుల సముదాయంగా మారింది.
అయితే నేను శివుని గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాను. పూజారి గారు నాకు బాగా తెలిసిన వ్యక్తి. కానీ ఈ సారి నాతో అసలు మాట్లాడకుండా తీర్థప్రసాదాలు ఇచ్చి మౌనంగా ఉన్నారు. అతని ముభావానికి కారణం అర్థం కాలేదు. ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు అని ఆశ్చర్యపోయాను. కించిత్ బాధపడ్డాను కూడా.
తర్వాత దుర్గామాత గుడిలోకి వెళ్ళాను. అక్కడి పంతులు గారు కూడా నాకు బాగా తెలుసు.అయితే ఈయన జూనియర్. ఇందాక చెప్పిన పెద్ద పంతులు గారికి బావ మరిది. నన్ను చూడగానే చిన్న పంతులు… సార్..బాగున్నారా ..మా అమ్మాయిని జాబ్ లో పెట్టించారు..థాంక్యూ సార్…. అని కుశల ప్రశ్నలు కూడా వేసి…. తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. అమ్మవారి దర్శనం కూడా బాగా జరిగింది. తర్వాత ఇంటికి వచ్చేశాను. కానీ పెద్ద పంతులు గారి ముఖమే నన్ను వెంటాడుతోంది. మనసంతా అదో లాంటి బాధ. ఎందుకు ఆయన నాతో ముభావంగా ఉన్నారు అని ఆలోచన.
పొద్దున్న లేచాక ఆ ఆలోచనల్ని పక్కకు పెట్టి ఆఫీసుకు వెళ్లిపోయాను.
చిన్న పంతులు గారి అమ్మాయి నా సెక్షన్ లోనే పని చేస్తుంది.
ఆమెను పిలిచి ఏం జరిగింది ఇంట్లో అని అడిగాను.
సార్ .. పెద్దాయన మీ మీద అలిగారు.నాకు జాబ్ ఇప్పించారని నాన్నతో గొడవపడ్డారు. ఎందుకంటే వారి అమ్మాయికి కూడా జాబ్ కావాలని మీతో గతంలో ఒకసారి అడిగారట.కానీ మీరు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదట. అందుకే నాన్నతో.. నిన్నగాక మొన్న నా ద్వారా వచ్చిన వాడివి అప్పుడే పైరవీలు చేస్తున్నావా…. అంటూ గొడవపడ్డారు అని చెప్పింది.
జరిగిన విషయం అర్థం అయింది. నిజానికి ఆయన ముభావంగా ఉన్నప్పుడు చిన్నగా నాకు కోపం కూడా వచ్చింది. కానీ నేను కంట్రోల్ చేసుకుని ఇంటికి వచ్చేశాను. ఇదన్నమాట ఆయన ముభావానికి కారణం. ఇప్పుడు నా మనసు కూడా తేలిక అయింది. వారి అమ్మాయికి కూడా జాబ్ చూపిస్తే సరి అని అనుకున్నాను.
ఒక్కోసారి మనకు బాగా ఎరిగిన వాళ్ళ మీద కూడా అపార్థం కలుగుతుంది. అప్పుడే వెంటనే కోపాన్ని చూపకుండా ఓపిక పడితే నెమ్మదిగా అసలు కారణం తెలుస్తుంది. బంధం నిలబడుతుంది. లేకపోతే కోపంతో ఏదో ఒకటి అరిస్తే బంధాలు తెగిపోతాయి. అందుకే పెద్దలు అంటారు కదా ఓపిక ఉన్నవాడిదే ఓరుగల్లు అని…
7.మెదడుకు మేత-సామెత.. శీర్షిక

నా కోడీ కుంపటి లేకపోతే ఎలా తెల్లవారుతుంది?
‘కేవలం ఒక్కరి మీదే ఆధారపడి ఏమీ జరగదు’అన్న విషయాన్ని హాస్యస్ఫోరకంగా చెబుతుంది ఈ సామెత. ఒక ఊర్లో ఒక ముసలామె ఉంది. ఆమెకు ఒక కోడి ఉంది. అది కూస్తే, తెల్లవారిందని అందరు తెలుసుకొని నిద్ర మేల్కొనేవారట. అట్లాగే ఆమె కుంపటి నుండి గ్రామస్థులు నిప్పు తీసుకొని వెళ్లి పొయ్యిలు రాజేసుకునేవారట. ఒకసారి ఆమెకు, ఊరివారు తనను గౌరవించడం లేదని కోపం వచ్చి, తన కోడినీ కుంపటినీ తీసుకొని, వేరే ఊరుకు వెళ్లిపోయిందట! ‘వీళ్లకు ఎలా తెల్లవారుతుందో చూస్తా’అనుకుంటూ! యథాప్రకారం లక్షణంగా తెల్లవారింది.
‘అయ్యవారు లేనంత మాత్రాన అమావాస్య నిలబడదు’అనేది కూడ ఇలాంటిదే. ఆ అయ్యవారు లేకపోతే ఇంకో అయ్యవారు. “Time and tide waits for none”అన్నాడు ఆంగ్ల కవితా పితామహుడు ‘జియోఫెరీ చాసర్’. ఛార్లెస్ డికెన్స్ మరో అడుగు ముందుకు వేసి, “But all men have to wait for time and tide”,“కాని అందరూ కాలం కోసం అలల కోసం వేచి ఉండాల్సిందే” అన్నాడు.
ఎన్.టి.ఆర్. గారు “తెలుగు దేశం పార్టీ నాతోనే పుట్టింది, నాతోనే పోతుంది” అనేవారట. ఏమయింది? ఆయన తర్వాత కూడా నిక్షేపంగా ఉంది. నెహ్రూ గారు, ఇందిరా గాంధీ గారు చనిపోయినపుడు “భారతదేశం ఏమయిపోతుందో ఇక!” అని చాలామంది దిగులు పడ్డారట. ఏమీ కాలేదు!
ఆ స్థాయిలో కాకపోయినా, మన కుటుంబాల్లో కూడా “నేను రెండు రోజులు లేకపోతే ఇల్లంతా గందరగోళం చేసేస్తారు” అంటుంటారు కొందరు. రెండు రోజులు కాదు, రెండేళ్ళు లేకపోయినా ఏమీ కాదు. అసలు లేకుండా పోయినా ఏమీ కాదు. కాలం ఒక ఎటర్నిటీ. దీన్ని ఆధారంగా తీసుకొని రావిశాస్త్రిగారు ఒక గొప్ప కథ వ్రాశారు. దాని ముగింపు వాక్యం ఇది. “కొన్ని వేల, లక్షల సంవత్సరాలుగా ప్రపంచం సాగిపోతూనే ఉంది”. ‘అంతా నేనే చేశాను! అంతా నా వల్లే జరిగింది’అనుకుంటే అంతకంటే అజ్ఞానం లేదు. ట్రంప్ గారి లాగా “యుద్ధాలన్నీ నేనే ఆపాను. నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వకపోతే ఒప్పుకోను” అంటే ఎలా? నవ్వుకుంటారంతా.
‘ప్రేమాభిషేకం’సినిమాలో దాసరిగారు “ఆగదు ఏ నిమిషము నీ కోసమూ, ఆగితే సాగదు ఈ లోకము” అన్న గొప్ప పాట రాయగా, గాన గంధర్వుడు బాలు పాడగా, మహోన్నత నట శిఖరం అక్కినేని నాగేశ్వరరావు గారు ‘న భూతో న భవిష్యతి’గా అభినయించారు. ఆధ్యాత్మికత లోతులున్న పాట అది. “జీవితమొక పయనమనీ, గమ్యం తెలియదనీ.. తెలిసినా ఈ మనిషీ పయనమాగదు”. కాబట్టి మన కోడి కాకపోతే ఇంకో కోడి కూస్తుంది. నో ప్రాబ్లమ్!
టెన్నిసన్ మహాకవి ‘ది బ్రూక్’అన్న గొప్ప కవిత వ్రాశారు. అందులో“Men may come and men may go, but I go on forever”అంటారు. ‘మనుషులు వస్తుంటారు, పోతూంటారు కాని నేను నిరంతరం సాగిపోతూనే ఉంటాను’.ఇది ఆయన ‘సెలయేరు’గురించి చెప్పినా, జీవితానికీ వర్తిస్తుంది. Continuity (కొనసాగింపు),immortality (అమరత్వము) అనేవి ప్రకృతికి సహజగుణాలు.
‘నిమిత్తమాత్రం భవ! కౌంతేయ!’అన్న గీతాచార్యుని మాటల్లో కూడా ఇదే పరమార్థం ఉంది. “చేసిది నీవు కాదు చేయించేది నేను. నీవు ఉపకరణానివి (instrumental) మాత్రమే” అన్నాడు పరమాత్మ. దీన్ని గ్రహించిన జ్ఞానులందరూ హాయిగా ఉన్నారు. అట్లా కాకుండా, “అంతా నేనే, నేను లేకపోతే..” అంటూ ప్రతిదానికి కర్తృత్యం ఆపాదించుకొని విర్రవీగే వాళ్లెంతమందో కాలగర్భంలో కలిసిపోయారు! కాబట్టి, ఉన్నన్ని రోజులు, మన పని మనం చేద్దాం. తర్వాత, ‘నందోరాజా భవిష్యతి!’. కాలప్రవాహంలో మనం ఒక నీటిబొట్టు మాత్రమే. ‘అన్నీ నేనే కనిపెట్టాను’అంటే నవ్వులపాలు కాక తప్పదు!
8.వినరో భాగ్యము – శీర్షిక

దిట్టం, కైంకర్యాలదీ శతాబ్దాల చరిత్రే
తిరుమలేశుని ఆలయంలో తరతరాలుగా నిర్వహించే వివిధ రకాల సేవా కైంకర్యాలకు, ప్రసాద వితరణకు వినియోగించే పదార్థాల దిట్టాలకు సంబంధించిన అంశాలకు కూడా శతాబ్దాల చరిత్ర ఉంది. శ్రీవారి ఆలయ నిర్వహణ బాధ్యతలను ఈస్ట్ ఇండియా కంపెనీ 1801లో స్వీకరించిన తర్వాత ఆలయ విధివిధానాలకు నంబంధిత అధికారులు ఎంతో విలువనిచ్చారు.
అప్పటివరకు అమలులో ఉన్న విధివిధానాలు, సేవా కైంకర్యాలు, ప్రసాద వినియోగాలు వంటి అంశాలపై సమగ్ర నివేదికలను తయారుచేయించారు. ఆ బాధ్యతలను శ్రీవారి ఆలయ బాధ్యతలను చూస్తూ వున్న ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధి అలబ్ధు గోవిందరావుకు అప్పగించారు. ఆయన నేతృత్వంలో అప్పటి సిబ్బంది సమగ్ర వివరణలతో, శాసనాధారాల పరిశీలనలతో 1819 ఆగస్టు 14వ తేదిన దిట్టం రిజిస్ట్రర్, కైంకర్య వట్టీల తయారీ జరిగింది. ఆయా కాలాల్లో కొన్ని చేర్పులు జరిగినా ఆ రికార్డులే ఇప్పటికీ అమలు..
మరిన్ని చక్కటి కథలు, పుస్తక సమీక్షలు, వ్యాసాలు, సరికొత్త శీర్షికలతో వచ్చేవారం కలుసుకుందాం…
మీ రచనలు, పుస్తక సమీక్షలు పంపవలసిన మా మెయిల్ఐడి. prabhanewscontent@gmail.com

day day day day day day day day day day day day day day day day day day day day day day day day day day day day day day day day day

