Suicide | కంటతడి పెట్టించే విషాద విషయాలు

Suicide | కంటతడి పెట్టించే విషాద విషయాలు
Suicide | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: కరీంనగర్ టూ టౌన్ ఎస్సై చంద్రశేఖర్, ఆయన భార్య దివ్యల ఆత్మహత్య ఘటన హృదయ విదారకంగా మారింది. ఈ ఘటనలో కంటతడి పెట్టించే అనేక విషాద విషయాలు వెలుగులోకి వచ్చాయి.
కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని భర్త చంద్రశేఖర్‌కు, తండ్రి సమ్మయ్యకు ఫోన్ చేసి దివ్య (30) బలవన్మరణానికి పాల్పడింది. అనంతరం ఆమె మృతదేహాన్ని స్వగ్రామమైన సీతంపేటకు తీసుకెళ్లగా, భర్త చంద్రశేఖర్ వల్లే దివ్య మృతి చెందిందని ఆరోపిస్తూ బంధువులు, గ్రామస్థులు అతనిపై దాడికి దిగారు.
ఈ పరిస్థితిలో దివ్య తండ్రి సమ్మయ్య, చంద్రశేఖర్‌ను కాపాడి ఒక గదిలో ఉంచి తాళం వేశారు. దివ్య కర్మకాండలు నిర్వహించే సమయంలో కూడా తాను చనిపోతానని, తనకు ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని చంద్రశేఖర్ రోదించాడు. భార్య తన వల్లే చనిపోయిందని తీవ్ర మనోవేదనకు గురైన చంద్రశేఖర్, ఇద్దరు కుమారులను చూస్తూ ఆవేదన వ్యక్తం చేస్తూ అత్తారింట్లోనే చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
అనంతరం చంద్రశేఖర్ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి, దివ్యకు అంత్యక్రియలు జరిగిన చోటే అతనికీ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనతో ఐదు రోజుల వ్యవధిలో తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలారు.
