Su*cide| భర్త వేధింపులు భరించలేక..

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఉట్నూర్ మండలంలో ఒక వివాహిత బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. భర్త నుంచి ఎదురవుతున్న నిరంతర వేధింపులు, శారీరక దాడులే ఈ ఆత్మహత్యకు ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

మండలంలోని ఎక్స్‌రోడ్‌ గ్రామానికి చెందిన గిరి వర్షాతాయి (41) అనే వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసు వివ‌రాలు ఉట్నూర్‌ ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ గురువారం తెలిపారు.

ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం, మృతురాలి భర్త గిరి నాగేందర్‌ తరచూ మద్యం సేవించి ఇంటికి వచ్చి గొడవలు చేయడంతో పాటు, డబ్బులు ఇవ్వకపోతే ఆమెను కొట్టేవాడని పేర్కొన్నారు. ఈ నెల 21న కూడా అలాగే మద్యం మత్తులో వచ్చి దాడి చేయడంతో, మనస్తాపం చెందిన వర్షాతాయి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది.

22వ తేదీ ఉదయం వాంతులు చేసుకుంటుండ‌గా గ‌మ‌నించిన‌ కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ గురువారం ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

మృతురాలి తమ్ముడు పూరి లక్ష్మీకాంత్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె భర్త గిరి నాగేందర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతురాలికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారని ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు.

మృతురాలి సోదరుడు పూరి లక్ష్మీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉట్నూర్ పోలీసులు భర్త గిరి నాగేందర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తల్లి మరణించడంతో ఆమెకు ఉన్న ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఇప్పుడు త‌ల్లిలేని వారయ్యారు. మద్యపానం, గృహ హింస ఒక నిండు ప్రాణాన్ని బలిగొనడమే కాకుండా, ఒక నిరుపేద కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసిన ఈ ఘటన గ్రామస్తులను కలిచివేస్తోంది.

Leave a Reply