Study Material | మెరుగైన ఫలితాలే లక్ష్యంగా…

Study Material | మెరుగైన ఫలితాలే లక్ష్యంగా…
- ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య
Study Material | నందిగామ, ఆంధ్రప్రభ : పదవ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి ఉజ్వల భవిష్యత్తు నిర్మించుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్ఫూర్తి ప్రేరణ స్టడీ మెటీరియల్ ను ఈ రోజు విద్యార్థి–విద్యార్థినులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య కూటమి నేతలు, ఉపాధ్యాయులతో కలిసి స్టడీ మెటీరియల్‌ను విద్యార్థులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… పదవ తరగతి విద్యార్థుల భవిష్యత్తుకు ఈ విద్యా సంవత్సరం అత్యంత కీలకమని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న స్ఫూర్తి ప్రేరణ స్టడీ మెటీరియల్‌ను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు మంచి మార్కులు సాధించాలని సూచించారు. మెరుగైన ఫలితాలే లక్ష్యంగా ప్రభుత్వం విద్యారంగంలో అనేక చర్యలు చేపడుతోందని తెలిపారు.

పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులను సానుకూల దిశలో ప్రోత్సహిస్తూ నిరంతరం మార్గనిర్దేశం చేయాలని, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుపై పూర్తిస్థాయి దృష్టి సారించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

