విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన..
ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా(Nalgonda District) కేంద్రంలోని ద మాస్టర్ మైండ్ హై స్కూల్ ఎదుట ఈ రోజు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేశారు. కొన్ని రోజుల క్రితం పాఠశాలకు చెందిన బస్సు కింద పడి చిన్నారి మృతి చెందింది. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా పరిగణించిన విద్యాశాఖ(Department of Education) అధికారులు పాఠశాలను సీజ్ చేశారు. దీంతో తమ పిల్లలను తల్లిదండ్రులు వేరే పాఠశాలలో చేర్పించే ప్రయత్నం చేశారు.
అయితే విద్యాసంవత్సరం ముగింపు దశలో ఉన్నఈ సమయంలో తమ పాఠశాలలో చేర్పించుకోమని పాఠశాలల యాజమాన్యాలు చెబుతున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ పిల్లలకు మాస్టర్ మైండ్ స్కూల్(Master Mind School) తప్ప మరొక పాఠశాలలో చదువుకునే అవకాశం లేకుండా పోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల చదువులు అర్ధాంతరంగా ముగియకుండా ప్రభుత్వం వెంటనే స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
కోర్టు నుంచి స్కూల్ ఓపెన్(Open) చేసుకోవచ్చు అని ఆదేశాలు ఉన్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని యాజమాన్యం చెబుతుందని తల్లిదండ్రులు వాపోయారు. విద్యాశాఖ అధికారులు పిల్లల భవిష్యత్తు దెబ్బతినకుండా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.