అమ్మ భాషే కంటి చూపు…

అమ్మ భాషే కంటి చూపు…

భారతీయతే మన అసలైన గుర్తింపు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఉద్భోదన

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : మాతృభాషపై అపారమైన మమకారం, భారతీయతపై గర్వభావం, విద్యార్థుల జీవితంపై విలువల బోధన ఈ మూడింటిని సమన్వయపరుస్తూ భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చిత్తూరులో విద్యార్థినులను ఉత్తేజపరుస్తూ ప్రసంగించారు.

చిత్తూరులోని ఎన్ పి సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన 44వ వార్షికోత్సవం, స్నాతకోత్సవం, నూతన వసతి భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ముందుగా హాస్టల్ భవనాన్ని ప్రారంభించి, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులకు బంగారు పథకాలు, నగదు ప్రోత్సాహకాలు అందజేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం సభను ఆకట్టుకుంది. మనం ఎక్కడికి వెళ్లినా, ఎలాంటి భాషలు నేర్చుకున్నా ముందుగా మాతృభాషను గౌరవించాలని ఆయన పిలుపునిచ్చారు. మనం తెలుగు వాళ్లమని గర్వంగా చెప్పుకోవాలని, మాతృభాషను మరిచిపోవడం అంటే తల్లిని మరిచిపోయినట్టేనని స్పష్టం చేశారు. కన్నతల్లి, జన్మభూమి, మాతృభాష, మాతృదేశం, గురువును మరచిపోయేవాడు మానవుడే కాదని గుర్తుచేశారు.

అమ్మ భాష కంటి చూపు వంటిదని, ఇంగ్లీష్ భాష కళ్లద్దాల వంటిదని ఆయన ఇచ్చిన ఉపమానం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కంటి చూపు ఉంటేనే కళ్లద్దాలు ఉపయోగపడతాయని, కంటి చూపే లేకపోతే ఎంత ఖరీదైన కళ్లద్దాలు పెట్టుకున్నా ప్రయోజనం లేదని వివరించారు. అందుకే ఇంట్లో, వీధిలో, గుడిలో, బడిలో—ఎక్కడైనా మన మాతృభాషలోనే మాట్లాడాలని సూచించారు. మన కట్టు, మన బొట్టు, మన బాట, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస మాత్రమే కాదు, మన భావవ్యక్తీకరణ మొత్తం కూడా తెలుగులోనే ఉండాలని చమత్కారంగా చెప్పారు.

భారతీయతపై మాట్లాడుతూ, భాషలు, వేషాలు, సంస్కృతులు వేరైనా మనమంతా ఒకే దేశానికి చెందిన వారమని పేర్కొన్నారు. ముందుగా నేను భారతీయుడిని అని చెప్పుకోవాలి, ఆ తర్వాతనే ప్రాంతం, భాష, వ్యక్తిగత వివరాలు చెప్పుకోవాలని సూచించారు. వివిధత్వంలో ఏకత్వమే భారతదేశ ప్రత్యేకత అని, అదే మన బలమని అన్నారు.

విద్యార్థుల దినచర్యపై కూడా ఆయన స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేవడం అలవాటు చేసుకోవాలని, ప్రతిరోజూ వ్యాయామం, యోగా చేయాలని సూచించారు. ఇప్పుడు మీరు నడిస్తే రేపు మీ నడత బాగుంటుందని పేర్కొన్నారు. క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్ వంటి ఆటల్లో పాల్గొనాలని ప్రోత్సహించారు.

యోగా రాజకీయాల కోసం కాదని, శరీర ఆరోగ్యానికి అవసరమని సరదాగా వ్యాఖ్యానించారు. ఆహారపు అలవాట్లలో మార్పు అవసరమని చెబుతూ, రాగి, జొన్నలు, సజ్జలు వంటి సంప్రదాయ ధాన్యాలను ఆహారంలో చేర్చుకోవాలని సూచించారు. పాలిష్ చేసిన తెల్ల బియ్యం అధికంగా తినడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

మహిళా విద్యపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన ఆయన, ఒక అబ్బాయిని చదివిస్తే ఒక వ్యక్తి మాత్రమే చదివినట్టే కానీ ఒక అమ్మాయిని చదివిస్తే కుటుంబమంతా చదివినట్టేనని పేర్కొన్నారు. మహిళలు ప్రతి రంగంలో ముందుకు రావాలని, భవిష్యత్తులో రాజకీయాల్లో వారికి మరిన్ని అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కుటుంబ విలువలపై కూడా ఆయన స్పష్టంగా మాట్లాడారు.

తల్లిదండ్రులతో సమయం గడపాలని, ఎప్పుడూ ఫోన్లు, టీవీలతోనే కాలం గడపకూడదని సూచించారు. సామాజిక మాధ్యమాల వినియోగం అధికమై, అవి అసామాజిక మాధ్యమాలుగా మారుతున్నాయని వ్యాఖ్యానించారు. రాత్రి తొందరగా నిద్రపోయి, ఉదయం త్వరగా లేవడం అలవాటు చేసుకోవాలని చెప్పారు.

తన వ్యక్తిగత జీవితాన్ని ఉదాహరణగా చూపిస్తూ, చిన్నప్పుడే తల్లిని కోల్పోయినా తాతయ్య, అమ్మమ్మ ఇచ్చిన విలువల వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. చదువులతో పాటు ప్రాపంచిక జ్ఞానం, మంచి విలువలు జీవితంలో ఎంతో అవసరమని అన్నారు. చివరగా విద్యార్థులకు స్పష్టమైన సందేశాన్ని ఇస్తూ విదేశాలకు వెళ్లి నేర్చుకోవాలని, సంపాదించాలని కానీ తిరిగి స్వదేశానికి వచ్చి సేవ చేయాలని సూచించారు. తల్లిదండ్రులను గౌరవించాలని, స్వగ్రామానికి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. మహిళలు రాబోయే అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు చేరాలని ఆకాంక్షించారు. జై హింద్ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.

జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన వెంకయ్య నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళి మోహన్, సీపీడీసీ సెక్రటరీ ఎన్ పి వెంకటేశ్వర చౌదరి తదితరులు కూడా మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ, శైలజ తేజోమూర్తి, వెంకటరమణ, డాక్టర్ కే. మనోహర్, డాక్టర్ జి. ఉషారాణి, అధ్యాపకులు, విద్యార్థినులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply