Student | గురుకుల పాఠశాలలో దారుణం….

Student | గురుకుల పాఠశాలలో దారుణం….

  • బిల్డింగ్ పై నుండి దూకి విద్యార్థి ఆత్మహత్యాయత్నం
  • రెండు కాళ్లు విరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేముల శివ సాయి
  • గోప్యంగా ఉంచిన అధికారులు

Student | ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా తిప్పర్తి ఎస్సీ గురుకుల పాఠశాల కు చెందిన ఏడవ తరగతి విద్యార్థి వేముల శివ సాయి బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరగ గా అధికారులు విషయం బయటకు పొక్కకుండా గోప్యంగా ఉంచారు. ప్రస్తుతం ఈ ఘటనలో రెండు కాళ్ళు విరిగి తీవ్రంగా గాయపడ్డ విద్యార్థి శివ సాయి నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

చండూరు మండలం కు చెందిన వేముల వెంకన్న, పద్మ దంపతులకు కుమారుడు తిప్పర్తి మండలంలోని ఎస్సీ గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు. కొద్దిరోజులుగా స్కూల్ టీచర్ మల్లయ్య, ప్రిన్సిపల్ సునీతలు తనను తరచూ వేధిస్తున్నారని తమ కుమారుడు తమకు ఫిర్యాదు చేశాడని తల్లి పద్మ చెప్పింది. కొద్దిరోజుల క్రితం వెళ్లి వారిద్దరినీ కలిసి తమ కుమారుడిని వేధించవద్దని చెప్పి వచ్చామని ఆమె తెలిపింది. రెండు రోజుల క్రితం తన కుమారుడు వేముల శివ సాయి బిల్డింగ్ పై నుండి దూకాడని తీవ్రంగా గాయపడ్డ అతన్ని నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లామని పాఠశాల నుండి ఫోన్ రావడంతో తాము నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చామని ఆమె చెప్పింది.

రెండు కాళ్లు విరిగి చావు బ్రతుకుల మధ్య తన కొడుకు కొట్టుమిట్టాడుతున్నాడని ఆపరేషన్ చేయాలని చెప్పిన డాక్టర్లు ఇప్పటి వరకు తన కొడుకు కాళ్లకు ఆపరేషన్ చేయడం లేదని తల్లి పద్మ వాపోయింది. తన కుమారుడిని ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత పాఠశాల ప్రిన్సిపల్ కానీ, టీచర్లు కానీ ఇటువైపు రాలేదని పద్మ ఆరోపించింది. తన కొడుకుకు మెరుగైన చికిత్స అందించేందుకు ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఆమె అధికారులను వేడుకుంది. పాఠశాల విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసిన కనీసం ఆసుపత్రి కూడా రాని పాఠశాల ప్రిన్సిపల్ సునీత, ఉపాధ్యాయుడు మల్లయ్య లపై కఠిన చర్యలు తీసుకోవాలని పద్మ డిమాండ్ చేసింది.

Leave a Reply