హుస్నాబాద్ : ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగించేందుకు కార్మికులు రెడీ అయ్యారు. ఈ నెల 07 నుంచి సమ్మెకు దిగనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధం అని తెలిపారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండు పరిసరాలను సందర్శించి, ప్రయాణికులతో ముచ్చటించారు
అనంతరం ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలు ప్రభుత్వం ద్రుష్టిలో ఉన్నాయని సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతున్న సందర్భంలో ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం..ఏదైనా చర్చ ద్వారా సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని..మంత్రిని ఎప్పుడైనా కలవవచ్చని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు.ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 5,6 తేదీల్లో కార్మికులు ఎప్పుడు వచ్చినా సమస్యలపై చర్చిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ఆర్టీసీ సంస్థ కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యార్థం ప్రజాపాలన పనిచేస్తుందని మంత్రి పొన్నం వివరించారు. గత పదేళ్లుగా ఆర్టీసీ వ్యవస్థ నిర్వీర్యం అయిందని అన్నారు. నేడు ఆర్టీసీ పూర్తిగా లాభాల దిశలో ఉందన్నారు. పాత అప్పులు పాత సీసీఎస్ నిధులు లాంటివి వచ్చే ప్రయత్నం జరుగుతుందన్నారు. అనంతరం ఎల్కతుర్తి బస్ స్టేషన్ వద్ద అంబేద్కర్ జంక్షన్ సుందరీకరణ పనులను పరిశీలించారు. ఎల్కతుర్తి బస్టేషన్ లో ప్రారంభించిన ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్స్ ను పరిశీలించి కార్యకర్తలు, అధికారులతో కలిసి అల్పాహారం చేశారు.