AP | రైతులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు.. మంత్రి నాదెండ్ల

(ఆంధ్రప్రభ, విజయవాడ రూరల్) : ధాన్యం కొనుగోలులో రైతులకు కష్టం, నష్టం కలిగిస్తే ఎటువంటి వారిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌరసరఫరాల, వినియోగదారుల, వ్యవహారాలు, ఆహార శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. విపత్కర సమయాల్లో నష్టపోయిన రైతులు, బుడమేరు ముంపుతో బాధితులుగా మారిన రైతులను తప్పకుండా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనన్నారు.

విజయవాడ రూరల్ పరిధిలోని గొల్లపూడి మార్కెట్ యార్డును సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు, రైతులకు కలిగే ప్రయోజనాలు, ఇబ్బందులు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన అక్కడున్న రైతులతో ప్రత్యక్షంగా ముచ్చటించారు. ధాన్యం తేమ శాతం కొలిచే యంత్రాలను స్వయంగా తనిఖీ చేశారు. గిట్టుబాటు ధర లభించకపోతే, తరుగు, తేమ శాతం పేరుతో ఎవరైనా రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని మిల్లర్లను హెచ్చరించారు. బుడమేరు వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పూర్తి సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలోని 18 రైస్ మిల్లర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, రైతులకు అండగా నిలబడతామని తెలిపారు. రైతులు తప్పనిసరిగా సహాయ కేంద్రాలను తనిఖీ చేసి వారికి కలుగుతున్న ప్రయోజనాలను స్వయంగా తెలుసుకోవాలని సూచించారు. ఈ తనిఖీల్లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, సంబంధిత అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *