నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
- అదనపు కలెక్టర్ చంద్రయ్య
చెన్నూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన’ కార్యక్రమంలో నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు తీసుకుంటామని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య హేచ్చరించారు. ప్రజా పాలనలో భాగంగా ఇవ్వాళ అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య చెన్నూరు పట్టణంలోని 12 మరియు 16 వార్డులలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూనే, పట్టణ పరిశుభ్రతపై కీలక సూచనలు చేశారు.
పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, వీధులు మరియు రోడ్లను కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలని అడిషనల్ కలెక్టర్ కోరారు. ప్రతిరోజూ మున్సిపాలిటీ వాహనాలు వచ్చినప్పుడు తడి, పొడి చెత్తను వేరువేరుగా అందించాలని సూచించారు. డ్రైనేజీలపై ప్రత్యేక దృష్టి: దుకాణదారులు కార్టన్ బాక్సులను, ఇతర వ్యర్థాలను డ్రైనేజీల్లో వేసి మురుగు నీటి వ్యవస్థకు ఆటంకం కలిగించవద్దని హెచ్చరించారు.
నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డుతో పాటు సన్న బియ్యాన్ని అందిస్తోందని, ఒకవేళ లబ్ధిదారులు ఆ బియ్యాన్ని అమ్ముకుంటే వారి రేషన్ కార్డులను రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. మున్సిపాలిటీకి సహకరించండి: సకాలంలో మున్సిపల్ పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు.
ప్రజా పాలన ముఖ్య ఉద్దేశం రోడ్ల మరమ్మతులు, డ్రైనేజీ సమస్యల పరిష్కారమేనని, ప్రజలు నిర్భయంగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పెద్దింటి పద్మ శ్రీనివాస్, వైస్ చైర్మన్ వినయ్, మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, కౌన్సిలర్లు శంకర్, శివకృష్ణ, నాయకులు సుశీల్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
