
temparature|పగలు భగభగ.. రాత్రి గజగజ
temparature|పగలు భగభగ.. రాత్రి గజగజ
- ఫిబ్రవరి రెండో వారం వింత వాతావరణం
- అప్పుడే మండుతున్న ఎండలు
- మున్ముందు తీవ్రమయ్యే ఛాన్స్

temparature|ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో శీతాకాలం చివరి దశలో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఫిబ్రవరి రెండో వారం మొదలవ్వడంతోనే అటు వేసవి తాపం.. ఇటు శీతాకాలపు చలి ఏకకాలంలో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మధ్యాహ్నం వేళ సూర్యుడు సెగలు కక్కుతుంటే.. సాయంత్రం కాగానే చలిగాలులు వణికిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండగా మరోవైపు రాత్రిపూట చలి తీవ్రత సైతం కొనసాగుతోంది. ఉదయం 10 గంటల వరకు చల్లగా ఉంటూ క్రమంగా మధ్యాహ్నం వరకు ఎండ వేడి పెరుగుతోంది.

వాతావరణ మార్పులతో కొన్ని ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉండగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఎండగా ఉంటోంది. రాష్ట్రంలో దిగువ స్థాయిలో ఆగ్నేయ గాలులు వీచినప్పటికీ ఈశాన్య గాలులు, తూర్పు గాలులు దిగువ స్థాయిలో రావడంతో ఈ మార్పులు ఉంటాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. గాలుల తీవ్రతతో చలిలోనూ హెచ్చుతగ్గులు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. రానున్న నాలుగు రోజులు ఇలాంటి వాతావరణమే ఉంటుందని, ఆ తర్వాత క్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది. ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు దాటుతున్నాయి. నిరుడుతో పోలిస్తే ఈ ఏడాది చలికాలంలో ఎక్కువ రోజులు అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వెల్లడైంది.. ఈనెల చివరివారంలో ఒకట్రెండు రోజులు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, ఆ తర్వాత తక్కువగా నమోదవుతాయని వాతావరణశాఖ తెలిపింది.

హైదరాబాద్‌లో చలిపంజా
ఈశాన్య గాలుల ప్రభావంతో హైదరాబాద్‌లో మరోసారి చలిపులి పంజా విసురుతోంది. పగలు ఎండ దంచికొట్టినప్పటికీ రాత్రి, ఉదయం సమయంలో మాత్రం చలి తన ప్రతాపం చూపిస్తోంది. ఈ క్రమంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 2.5 డిగ్రీలు తగ్గి, 15.5 డిగ్రీల సెల్సియస్‌గాను, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31.4 డిగ్రీలు, గాలిలో తేమ 29శాతంగా నమోదవుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
